Jubilee Hills Gang Rape: మొదట లైంగిక దాడి చేసింది కార్పొరేటర్‌ కుమారుడే

జూబ్లీహిల్స్‌లో బాలికపై అత్యాచారం కేసులో ఆదివారం పోలీసులు సీన్‌ రీ కన్‌స్ట్రక్షన్‌ చేశారు. ఉదయం సైఫాబాద్‌లోని జువెనైల్‌ హోం నుంచి అయిదుగురు

Updated : 13 Jun 2022 07:04 IST

అత్యాచార కేసులో సీన్‌ రీ కన్‌స్ట్రక్షన్‌లో నిర్ధారణకు వచ్చిన పోలీసులు

ముగిసిన సాదుద్దీన్‌ కస్టడీ

ఈనాడు, హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌, న్యూస్‌టుడే: జూబ్లీహిల్స్‌లో బాలికపై అత్యాచారం కేసులో ఆదివారం పోలీసులు సీన్‌ రీ కన్‌స్ట్రక్షన్‌ చేశారు. ఉదయం సైఫాబాద్‌లోని జువెనైల్‌ హోం నుంచి అయిదుగురు మైనర్లను ప్రత్యేక వాహనంలో బంజారాహిల్స్‌లోని కాన్సు బేకరీ వద్దకు తీసుకొచ్చారు. జూబ్లీహిల్స్‌ పోలీసుల కస్టడీలో ఉన్న సాదుద్దీన్‌ మాలిక్‌ను మరో వాహనంలో తీసుకెళ్లారు. ఆరుగురు నిందితులను పోలీసు ఫోర్స్‌ వాహనంలో బేకరీ నుంచి కేబీఆర్‌ కూడలి మీదుగా జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు వరకు తరలించారు. బంజారాహిల్స్‌ డివిజన్‌ ఏసీపీ సుదర్శన్‌, నార్కోటిక్స్‌ డ్రగ్స్‌ విభాగ ఏసీపీ నర్సింగ్‌రావు సివిల్‌ దుస్తుల్లో నిందితులతో పాటు ప్రయాణించి ఆయా ప్రాంతాల్లో జరిగిన సంఘటనల వివరాలు రాబట్టారు. మే 28న ఘటనా స్థలాలను పోలీసులు నిర్ధారించుకున్నారు.

ఎవరెవరు...ఎక్కడెక్కడ!
అమ్నీషియా పబ్‌ నుంచి బెంజ్‌ కారులో బాలికను తీసుకెళ్లిన నిందితులు బంజారాహిల్స్‌లోని కాన్సు బేకరీ వద్ద బిస్కెట్లు, శీతలపానీయం తీసుకున్నారు. అక్కడే బాలికను ఇన్నోవా కారులోకి ఎక్కించుకొని మూడు నిర్జన ప్రాంతాలకు తిప్పుతూ సామూహిక అత్యాచారానికి పాల్పడినట్టు నిందితులు అంగీకరించారు. సాదుద్దీన్‌ రెచ్చగొట్టడంతోనే తాము లైంగిక దాడి చేసినట్టు మైనర్లు చెబుతుంటే.. సాదుద్దీన్‌ మాత్రం, ఎమ్మెల్యే కుమారుడే మొదట బాలికపై అత్యాచారం చేశాడని వివరించినట్టు సమాచారం. పోలీసు వాహనంలోని నిందితులు కేబీఆర్‌ కూడలి దాటిన తర్వాత చిచ్చాస్‌ ప్రాంతంలోని ఖాళీ ప్రాంతాన్ని చూపారు. అనంతరం జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు, కృష్ణ జువెలర్స్‌ మార్గంలో వెళుతూ ఆ రోజు ప్రయాణించిన దారిని నిర్ధారించుకున్నారు. అమ్నీషియా పబ్‌ వద్దకు, అక్కడి నుంచి నేరుగా జూబ్లీహిల్స్‌లోని పెద్దమ్మగుడి సమీపంలో ఉన్న ఖాళీ స్థలం వద్దకు తీసుకెళ్లారు. సంఘటన జరిగిన ప్రాంతమిదేనా? అని పోలీసులు వారిని ప్రశ్నించారు. ఆ రోజు కొంత చీకటిగా ఉండటంతో పెద్దగా గుర్తించలేకపోయామని నిందితులు చెప్పారు.

బాలికపై మొదటగా కార్పొరేటర్‌ కుమారుడు లైంగిక దాడికి పాల్పడినట్టు సీన్‌ రీ కన్‌స్ట్రక్షన్‌ తర్వాత పోలీసులు నిర్ధారణకు వచ్చారు. తర్వాత కేసులో ఏ5గా పేర్కొన్న బంజారాహిల్స్‌ ప్రాంతానికి చెందిన బాలుడు(16), ప్రభుత్వ రంగ సంస్థ ఛైర్మన్‌ కుమారుడు అత్యాచారానికి పాల్పడినట్లు అంగీకరించారు. అనంతరం మిగిలిన ఇద్దరు మైనర్లు అత్యాచారానికి పాల్పడినట్లు నిర్ధారించుకున్నారు. ఏసీపీ నర్సింగ్‌రావు విచారణలో తామెలాంటి మాదకద్రవ్యాలు, మద్యం తీసుకోలేదని నిందితులు తెలిపినట్టు సమాచారం. సీన్‌ రీ కన్‌స్ట్రక్షన్‌ పూర్తయ్యాక ఆరుగురు నిందితులను జూబ్లీహిల్స్‌ పోలీసు ఠాణాకు తరలించారు. నాలుగు రోజుల కస్టడీ గడువు ముగియడంతో సాదుద్దీన్‌ మాలిక్‌ను సోమవారం ఉదయం న్యాయస్థానంలో హజరుపరచి, చంచల్‌గూడ జైలుకు తరలించనున్నారు.

బిర్యానీ కాదు.. అన్నం.. పప్పు పెట్టాం
సామూహిక అత్యాచారం కేసులో నిందితులు ప్రముఖుల సంతానం కావడంతో పోలీసులు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. అయితే సీన్‌ రీ కన్‌స్ట్రక్షన్‌కు వాహనంలో వచ్చిన నిందితులకు వారి బంధువులు, స్నేహితులు స్టార్‌హోటల్‌ నుంచి బిర్యానీ తీసుకొచ్చి ఇచ్చారన్న విషయం చర్చనీయాంశమైంది. కొన్ని ప్రత్యేక కేసుల్లో మాత్రమే న్యాయస్థానం అనుమతితో బయటి ఆహారపదార్థాలను అనుమతిస్తారు. ఇక్కడ ఎటువంటి ఆదేశాలు లేకపోయినా బయటి నుంచి తెచ్చిన బిర్యానీని నిందితులు పోలీసుల ఎదుటే తిన్నట్టు ఆరోపణలున్నాయి. ఈ వార్తలను పోలీసు అధికారులు కొట్టిపారేశారు. బందోబస్తుకు వచ్చిన వారు తెచ్చుకున్న బిర్యానీ పొట్లాలను కొందరు తప్పుగా చూపారన్నారు. నిందితులకు అన్నం, పప్పు మాత్రమే ఇచ్చినట్టు ఓ పోలీసు అధికారి తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని