కత్తితో పొడుస్తా.. మహిళపై వైకాపా ఎమ్మెల్యే అనుచరుడి దుష్ప్రవర్తన

నడిరోడ్డుపై భర్త, కుటుంబీకులతో కలిసి వెళ్తున్న ఓ మహిళపై విశాఖ జిల్లా పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్‌రాజ్‌ అనుచరుడు కత్తితో పొడుస్తానని బెదిరించడంతోపాటు అసభ్యంగా

Updated : 14 Aug 2022 07:05 IST

పెందుర్తి, న్యూస్‌టుడే: నడిరోడ్డుపై భర్త, కుటుంబీకులతో కలిసి వెళ్తున్న ఓ మహిళపై విశాఖ జిల్లా పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్‌రాజ్‌ అనుచరుడు కత్తితో పొడుస్తానని బెదిరించడంతోపాటు అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ సంఘటన శుక్రవారం అర్ధరాత్రి పెందుర్తిలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించి సీఐ అశోక్‌కుమార్‌ తెలిపిన వివరాలివి. పెందుర్తి వేగివారి వీధి ప్రాంతానికి చెందిన కచ్చుల మౌనిక హోమియో వైద్యురాలు. ఆమె భర్త శేషు, కుటుంబీకులతో కలిసి ద్విచక్రవాహనాలపై శుక్రవారం రాత్రి ఓ శుభకార్యానికి వెళ్లి తిరిగి ఇంటికి వస్తున్నారు. వీరిని పెందుర్తి సమీపంలోని పులగవానిపాలెం ప్రాంతానికి చెందిన మనోహర్‌ (25), కల్యాణ్‌ (23) స్నేహబృందం ద్విచక్రవాహనాలపై వెంబడించింది. మౌనిక భర్త వీరిపై అసహనం వ్యక్తం చేయడంతో యువకులు వారు ప్రయాణిస్తున్న వాహనాన్ని దాటివెళ్లి అకస్మాత్తుగా బ్రేక్‌ వేశారు. దీంతో మౌనిక ప్రయాణిస్తున్న ద్విచక్రవాహనం మనోహర్‌ వాహనాన్ని ఢీకొట్టింది. ఆ క్రమంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. మనోహర్‌ తన వాహనంపైకి ఎక్కి నిల్చుని కత్తితో పొడిచేస్తానంటూ మౌనిక, ఆమె భర్తను బెదిరించాడు. మౌనిక పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. దీనిపై బాధితులు పెందుర్తి పోలీసులను ఆశ్రయించడంతో వారు కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై ఎమ్మెల్యే అదీప్‌రాజ్‌ను ‘న్యూస్‌టుడే’ సంప్రదించగా.. ‘అందరూ ఒకేలా ఉండరు.. ఎక్కడో ఒకచోట తప్పు జరగడం సహజం. ఎన్నికల్లో నా గెలుపునకు కృషి చేసిన ప్రతి ఒక్కరూ నా మనిషి కిందే భావిస్తా. మనోహర్‌ మా పార్టీ కాదని, నా మనిషి కాదని నేను చెప్పను’ అని బదులిచ్చారు. తప్పు చేస్తే ఎవరైనా ఒకటేనని, మనోహర్‌పై కేసు నమోదైందని తెలిపారు. ఆయన చేసిన తప్పును సమర్థించడం లేదని అన్నారు. సంఘటన ఏ సందర్భంలో జరిగింది? ఎందుకు జరిగింది? అనే వివరాలు బయటకొస్తే బాగుంటుందని పేర్కొన్నారు.

Read latest Crime News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని