పక్షవాతంతో మంచాన పడ్డ వృద్ధురాలిపై వానరమూక దాడి

ఆమె ఎనిమిది పదుల వయసున్న వృద్ధురాలు.. ఆపై పక్షవాతంతో మంచాన పడిన దీనస్థితి. ఒంటరిగా ఉన్న అలాంటి నిస్సహాయురాలిపై ఓ వానరమూక దాడిచేసి ఏకంగా ప్రాణాలే తీసేసింది.

Published : 27 Sep 2022 04:44 IST

కన్నుమూసిన దీనురాలు
సూర్యాపేట జిల్లాలో దారుణం

ఆమె ఎనిమిది పదుల వయసున్న వృద్ధురాలు.. ఆపై పక్షవాతంతో మంచాన పడిన దీనస్థితి. ఒంటరిగా ఉన్న అలాంటి నిస్సహాయురాలిపై ఓ వానరమూక దాడిచేసి ఏకంగా ప్రాణాలే తీసేసింది. ఈ భయానక ఘటన సూర్యాపేట జిల్లా ఆత్మకూర్‌(ఎస్‌) మండలం పాతసూర్యాపేట గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. బాధిత కుటుంబ సభ్యులు, గ్రామస్థులు, కారోబార్‌ వెంకన్న తెలిపిన వివరాల ప్రకారం.. మెట్టు లింగమ్మకు రెండు నెలల క్రితం పక్షవాతం సోకింది. కదలలేని స్థితిలో ఉన్న ఆమె కోసం కుమారుడు శంకర్‌రెడ్డి ప్రత్యేకంగా ఓ గదిని ఏర్పాటు చేశారు. శంకర్‌రెడ్డి దంపతులు పొలం పనులకు వెళ్లడంతో గదిలో ఒంటరిగా ఉన్న లింగమ్మపై ఆదివారం సాయంత్రం అటుగా వచ్చిన కోతులు దాడి చేశాయి. ఆమె ముఖం, నడుము, కాళ్లను ఇష్టారాజ్యంగా కరిచాయి. వీధి చివరన ఉండే వీరి ఇంట్లో వానరాల స్వైరవిహారాన్ని గ్రామస్థులు గమనించలేకపోయారు. ఈ క్రమంలో తీవ్రగాయాలతో వృద్ధురాలు మంచం మీదే కన్నుమూసింది. అనంతరం వీరి ఇంటికి రోజూ మాదిరే తాగునీటిని తీసుకెళ్లేందుకు వచ్చిన ఎస్సీకాలనీ వాసులు చనిపోయిన లింగమ్మను గమనించి శంకర్‌రెడ్డికి సమాచారం అందించారు. పెద్దామెకు సోమవారం అంత్యక్రియలు నిర్వహించారు.

- న్యూస్‌టుడే, ఆత్మకూర్‌(ఎస్‌)

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని