Adibatla Kidnap Case: ఆదిభట్ల కిడ్నాప్‌ కేసు.. నోరు విప్పని నవీన్‌..!

నగర శివారు మన్నెగూడలో బీడీఎస్‌ విద్యార్థిని అపహరణ కేసులో ప్రధాన నిందితుడు, ‘మిస్టర్‌ టీ’ ఎండీ నవీన్‌రెడ్డి వ్యవహారాలపై పోలీసులు లోతైన దర్యాప్తు చేస్తున్నారు.

Updated : 12 Dec 2022 07:59 IST

బీడీఎస్‌ విద్యార్థిని అపహరణ కేసులో లోతైన దర్యాప్తు

ఈనాడు, హైదరాబాద్‌: నగర శివారు మన్నెగూడలో బీడీఎస్‌ విద్యార్థిని అపహరణ కేసులో ప్రధాన నిందితుడు, ‘మిస్టర్‌ టీ’ ఎండీ నవీన్‌రెడ్డి వ్యవహారాలపై పోలీసులు లోతైన దర్యాప్తు చేస్తున్నారు. కిడ్నాప్‌ వ్యవహారం వెనుక కారణాలు.. అతని వెనుక ఎవరెవరున్నారు.. తదితర కోణాల్లో ఆరా తీస్తున్నారు. యువతి కుటుంబం పెళ్లికి నిరాకరించిన నాటి నుంచి పరిణామాలను నిశితంగా తెలుసుకుంటున్నారు. నిందితుడు నవీన్‌ ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. కిడ్నాప్‌ చేశాక ఆమెను వాహనంలో ఎక్కడెక్కడికి తీసుకెళ్లారు? బాధితురాలికి అతను ఇంకా ఏమైనా చెప్పాడా? అనే కోణంలో పోలీసులు వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. నవీన్‌ మాత్రం నోరు విప్పడం లేదని తెలుస్తోంది. యువతి ఇంటిపై దాడి, కిడ్నాప్‌లో మొత్తం 36 మంది పాల్గొన్నట్లు సమాచారం. కాగా శనివారం 32 మందిని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.

కోలుకుంటున్న యువతి..

నిందితుల దాడిలో గాయపడిన యువతి కోలుకుంటున్నారు. ఆదివారం ఆమె మరోసారి విలేకరులతో మాట్లాడారు. ‘‘నిశ్చితార్థం జరిగే సమయానికి దాదాపు 10మంది ఇంట్లోకి దౌర్జన్యంగా ప్రవేశించారు. బయటకు లాక్కెళ్లేందుకు ప్రయత్నించగా.. మా మామ వారినుంచి తప్పించి పై గది లోపలికి పంపించి తాళం వేశారు. నిందితులు ఆగకుండా తలుపు ధ్వంసం చేశారు. నవీన్‌ నా గొంతు పట్టుకుని లాక్కెళ్లాడు. అడ్డుకోబోయిన మా అమ్మను నెట్టేశాడు. గతంలోనూ నన్ను వేధిస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. నవీన్‌రెడ్డి తల్లి ఇష్టారీతిన మాట్లాడుతున్నారు’’ అని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని