Crime New: స్నేహితుడి కుమార్తెపై అత్యాచార ఘటన.. ఉన్నతాధికారిపై సస్పెన్షన్‌ వేటు

Crime News: దిల్లీ స్త్రీ, శిశు అభివృద్ధి శాఖలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఒక సీనియర్‌ అధికారి.. తన స్నేహితుడి కుమార్తెపై కొన్నినెలల పాటు దారుణాలకు పాల్పడ్డాడు. దీనిపై దిల్లీ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. 

Updated : 21 Aug 2023 16:01 IST

దిల్లీ: స్నేహితుడి మైనర్‌ కుమార్తెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడి, ఆమె గర్భం దాల్చడానికి కారణమైన ఓ ఉన్నతాధికారిపై సోమవారం సస్పెన్షన్‌ వేటు పడింది. ఈ మేరకు దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్(Delhi Chief Minister Arvind Kejriwal) ఆదేశించారు. అలాగే సాయంత్రం ఐదు గంటల్లోగా ఈ ఘటనపై ముఖ్యమంత్రికి చీఫ్ సెక్రటరీ నివేదిక సమర్పించనున్నారు.

దిల్లీ స్త్రీ, శిశు అభివృద్ధి శాఖలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఒక సీనియర్‌ అధికారి తన స్నేహితుడు మరణించడంతో.. అతడి కుమార్తె బాగోగులు చూస్తానంటూ ముందుకొచ్చాడు. ఆ కుటుంబంతో కొన్నేళ్లుగా స్నేహం ఉండడంతో బాలికను అతడితో పంపేందుకు తల్లి కూడా సమ్మతించింది. ఆ విధంగా ఇంటికి తీసుకెళ్లిన అధికారి బాలికపై నవంబరు 2020 నుంచి జనవరి 2021 మధ్య అనేకమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో బాలిక గర్భం దాల్చింది. ఈ విషయం బయటకు తెలియకుండా ఉండేందుకు నిందితుడి భార్య కూడా అతడికి సహకరించింది. తన కుమారుడితో గర్భవిచ్ఛిత్తి మాత్రలు తెప్పించి బాలికతో మింగించింది.

30 కి.మీ. వెంటాడి.. వేటాడి.. పల్నాడులో రెచ్చిపోయిన వైకాపా శ్రేణులు

అయితే ఆ బాలిక అనారోగ్యానికి గురికావడంతో తల్లి ఆమెను ఇంటికి తీసుకువెళ్లింది. ఆ తర్వాత ఆసుపత్రికి తీసుకెళ్లగా.. జరిగిన విషయమంతా బాధితురాలు చెప్పడంతో అసలు విషయం బయటపడింది. దీంతో బాధితురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై దిల్లీ మంత్రి సౌరభ్‌ భరద్వాజ్‌ స్పందించారు. 

‘ఆ అధికారి హీనమైన చర్యకు పాల్పడ్డారు. ఈ నేరంలో అతడి భార్య కూడా భాగమైంది. ఆ అధికారిని సస్పెండ్‌ చేయాలని ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌( Swati Maliwal) ఆదేశించారు. అలాగే సాయంత్రం ఐదు గంటల్లోగా చీఫ్‌ సెక్రటరీ నివేదిక సమర్పించనున్నారు. అధికారిని అరెస్టు చేయడంలో దిల్లీ పోలీసులు విఫలమవడం ఈ కేసులో అత్యంత దారుణమైన అంశం. అతడికి కఠిన శిక్ష పడాలి’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే ఆ అధికారిని వెంటనే అరెస్టు చేయాలని దిల్లీ మహిళా కమిషన్‌ ఛైర్మన్‌ స్వాతీమాలివాల్‌ పోలీసులకు నోటీసులు ఇచ్చారు.

బాలికకు వరుస పానిక్ అటాక్స్‌..

2020 నుంచి 2021 మధ్య ఐదు నెలల పాటు ఆ బాలికపై అత్యాచారం జరిగింది. దాంతో ఆమె తీవ్ర ఆందోళనకు గురైంది. వరుస పానిక్‌ అటాక్స్‌ను ఎదుర్కొన్నట్లు సమాచారం. వాటిని గమనించిన తల్లి ఆమెను వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లింది. ఆమెను పరీక్షించిన వైద్యులు మానసిక చికిత్స అందించారు. వైద్యులు అందించిన సమాచారం మేరకు ఆగస్టు 13న పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం అధికారి, అతడి భార్యను పోలీసులు అరెస్టు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని