YSRCP: 30 కి.మీ. వెంటాడి.. వేటాడి.. పల్నాడులో రెచ్చిపోయిన వైకాపా శ్రేణులు

మాపై డీఎస్పీకి ఫిర్యాదు చేసేంతటి వాడివా అంటూ పల్నాడు జిల్లా మాచర్లలో వైకాపా నాయకులు రెచ్చిపోయారు.

Published : 21 Aug 2023 07:59 IST

తెదేపా నేత కారు అద్దాలు ధ్వంసం

ఈనాడు డిజిటల్‌, నరసరావుపేట, రెంటచింతల, గురజాల, న్యూస్‌టుడే: మాపై డీఎస్పీకి ఫిర్యాదు చేసేంతటి వాడివా అంటూ పల్నాడు జిల్లా మాచర్లలో వైకాపా నాయకులు రెచ్చిపోయారు. గురజాల నడిబొడ్డున డీఎస్పీ కార్యాలయం పక్కనే రెంటచింతల మండలం రెంటాలకు చెందిన తెదేపా నాయకుడు పేరం సర్వారెడ్డిపై దాడికి పాల్పడి, కారు అద్దాలు పగలగొట్టారు. ఏం జరిగిందో తెలియక ఆదివారం సాయంత్రం 10 నిమిషాల పాటు స్థానికుల్లో భయాందోళన నెలకొంది. సర్వారెడ్డి సోదరుడు జగ్గారెడ్డి ఇటీవల చనిపోగా, కుటుంబసభ్యులను పరామర్శించేందుకు మాచర్ల నియోజకవర్గ తెదేపా ఇన్‌ఛార్జి జూలకంటి బ్రహ్మారెడ్డి ఆదివారం రెంటాలకు వచ్చారు. వెల్దుర్తి మండలం ఉప్పలపాడులో నివాసముంటున్న సర్వారెడ్డి కూడా బ్రహ్మారెడ్డి వెంట వచ్చి గ్రామంలో పర్యటించారు. దీనిపై వైకాపా నాయకులు సర్వారెడ్డితో వాగ్వాదానికి దిగారు. బ్రహ్మారెడ్డిని రెంటాలకు తీసుకువచ్చేంతటి వాడివా అంటూ దాడికి యత్నించారు.

డీఎస్పీ కార్యాలయం సమీపంలోనే..

దాడి భయంతో సర్వారెడ్డి రెంటచింతలకు కారులో వెళ్తుండగా, వైకాపా నాయకులు ఓ కారులో కర్రలు వేసుకొని 5 కి.మీ. దూరం వెంబడించారు. రెంటచింతలకు రాగానే సర్వారెడ్డి కారును ఆపి, అద్దాలు పగలగొట్టారు. బాధితుడు అక్కడి నుంచి తప్పించుకొని అద్దాలు పగిలిపోయిన కారులోనే మరో 10 కి.మీ దూరంలోని గురజాలకు బయల్దేరారు. అక్కడ డీఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేద్దామని, కారును కార్యాయలం పక్కనే ఆపి లోపలికి వెళ్లేందుకు యత్నించారు. అతడిని వెంబడించిన వైకాపా ముఠా మరోసారి దాడికి దిగింది. సర్వారెడ్డిని బలవంతంగా కారులో ఎక్కించుకొని రెంటచింతల వైపు తీసుకెళ్లారు. గురజాల పోలీసులు ఆపే ప్రయత్నం చేసినా ఆగలేదు. వారు రెంటచింతల పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అక్కడ మాటువేసిన పోలీసులు సర్వారెడ్డిని, అతడిని వెంబడించిన వైకాపా శ్రేణులను పోలీసుస్టేషన్‌కు తరలించారు. రెంటాల నుంచి రెంటచింతల, అక్కడి నుంచి గురజాల, గురజాల నుంచి రెంటచింతల వరకు సుమారు 30 కి.మీ. దూరం మూకలు వెంటాడాయి. రెంటచింతలలో పోలీసు పహారా పెంచారు. దుకాణాలు మూయించారు. వెల్దుర్తి మండలం ఉప్పలపాడులో నర్సరీలో మొక్కలు చనిపోవడానికి సర్వారెడ్డి కారణమని వైకాపా నేత సీతారామరెడ్డి జులైలో ఠాణాలో ఫిర్యాదు చేశారు. నర్సరీలో భాగస్వామిగా ఉన్న సర్వారెడ్డి గడ్డిమందు చల్లి మొక్కలు చనిపోయేలా చేశారన్న ఆరోపణపై అతడిని జైలుకు పంపారు. ఇటీవలే బెయిల్‌పై బయటకు రాగా, తాజాగా దాడిని ఎదుర్కొన్నారు.

ఆరుగురిపై ఫిర్యాదు

తనపై రెంటాలకు చెందిన నవులూరి చెన్నారెడ్డి, నవులూరి అశోక్‌రెడ్డి, జక్కిరెడ్డి రాజశేఖరరెడ్డి, పోట్లూరి శ్రీనివాసరెడ్డి, పోట్లూరి వెంకటరెడ్డి, చిన్నపరెడ్డి వంశీరెడ్డి కలిసి దాడి చేసి, చంపడానికి ప్రయత్నించారని రెంటచింతల పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెదేపా నాయకుడు సర్వారెడ్డి చెప్పారు. గురజాల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందిన ఆయన రాత్రి 10 గంటల సమయంలో విలేకరులకు వివరాలు వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని