UP: రసాయన పరిశ్రమలో పేలుడు.. తొమ్మిది మంది మృతి

పరిశ్రమలోని బాయిలర్‌ పేలడంతో తొమ్మిది మంది మృతిచెందగా.. 15మందికి గాయాలయ్యాయి. సమాచారం......

Published : 04 Jun 2022 19:03 IST

హాపూర్‌: ఉత్తర్‌ప్రదేశ్‌లోని హాపూర్‌ జిల్లాలో ఓ రసాయన పరిశ్రమలో భారీ పేలుడు సంభవించింది. పరిశ్రమలోని బాయిలర్‌ పేలడంతో తొమ్మిది మంది మృతిచెందగా.. దాదాపు 15మందికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు, ఫైరింజన్లు అక్కడికి చేరుకొని సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. దిల్లీకి దాదాపు 80కి.మీల దూరంలోని ధౌలానాలోని యూపీఎస్‌ఐడీసీ పారిశ్రామిక ప్రాంతంలో ఈ దుర్ఘటన చోటుచేసుకున్నట్టు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. 

ఈ పేలుడు ధాటికి చుట్టుపక్కల ఉన్న కొన్ని ఫ్యాక్టరీల పైకప్పులు సైతం దెబ్బతిన్నట్టు పోలీసులు తెలిపారు. ఫ్యాక్టరీలో మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బందికి మూడు గంటల సమయం పట్టిందన్నారు. ఈ ఘటనలో తొమ్మిది మంది మృతిచెందగా.. పలువురికి గాయాలైనట్టు మేరఠ్‌ రేంజ్‌ ఐజీ ప్రవీణ్‌ కుమార్‌ తెలిపారు. వీరిని 15 మందిని ఆస్పత్రిలో చేర్పించినట్టు వెల్లడించారు. 

ఈ ఘటనపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌, పరిశ్రమల శాఖ మంత్రి నందగోపాల్‌ గుప్తా విచారం వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. స్థానిక అధికారులు తక్షణమే ఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యలు కొనసాగించాలని సీఎం ఆదేశించినట్టు సీఎంవో తెలిపింది. బాధితులకు, వారి కుటుంబాలకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలని సూచించినట్టు ట్వీట్‌ చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని