Crime News: విచారణ పేరిట చిత్రహింసలు.. ఆత్మకూరు(ఎస్) ఎస్‌ఐ లింగంపై బదిలీ వేటు

సూర్యాపేట జిల్లా ఆత్మకూరు(ఎస్) ఎస్‌ఐ లింగంపై బదిలీ వేటు పడింది. ఎస్‌ఐ లింగంను వీఆర్‌కు పంపిస్తూ జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్ ఆదేశాలు జారీ చేశారు. విచారణ పేరిట గిరిజనుడిని చిత్రహింసలు పెట్టినట్లు ఎస్‌ఐపై ఆరోపణలు వచ్చిన విషయం...

Updated : 12 Nov 2021 16:30 IST

ఆత్మకూర్‌(ఎస్‌): సూర్యాపేట జిల్లా ఆత్మకూరు(ఎస్) ఎస్‌ఐ లింగంపై బదిలీ వేటు పడింది. ఎస్‌ఐ లింగంను వీఆర్‌కు పంపిస్తూ జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్ ఆదేశాలు జారీ చేశారు. విచారణ పేరిట గిరిజనుడిని చిత్రహింసలు పెట్టినట్లు ఎస్‌ఐపై ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. రామోజీతండాకు చెందిన వ్యక్తిని.. దొంగతనం కేసులో విచారణ పేరిట చిత్రహింసలు పెట్టారని బంధువులు నిన్న ఆందోళనకు దిగారు. పోలీస్  స్టేషన్ ఎదుట బాధితుడితో కలిసి ధర్నా నిర్వహించారు. ఈ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారడంతో ఎస్పీ రాజేంద్రప్రసాద్ విచారణకు ఆదేశించారు. ఎస్‌ఐని వీఆర్‌కు పంపిస్తూ ఆదేశాలు జారీ చేశారు.

(చికిత్స పొందుతున్న వీరశేఖర్‌)

అసలేం జరిగిందంటే..

దొంగతనం కేసులో విచారణ పేరిట ఓ 23 ఏళ్ల యువకుడిని పోలీసులు తీవ్రంగా కొట్టారంటూ సూర్యాపేట జిల్లాలోని రామోజీ తండాకు చెందిన గిరిజనులు నిన్న పోలీస్‌స్టేషన్‌ను ముట్టడించారు. తీవ్ర అస్వస్థతకు గురైన బాధితుడితో మూకుమ్మడిగా ఠాణాకు చేరుకొని ఆందోళన చేపట్టారు. ఆత్మకూర్‌(ఎస్‌) పోలీస్‌స్టేషన్‌ వద్ద గురువారం ఈ ఘటన జరిగింది. ఈ నెల 4న ఏపూర్‌లోని తన దుకాణంలో రూ.10 వేల నగదు, 40 మద్యం సీసాలు ఎత్తుకెళ్లినట్లు నిర్వాహకుడు షేక్‌ సైదులు గత శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో రామోజీతండాకు చెందిన బానోత్‌ నవీన్‌ను సీసీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు. అతను మరికొందరి పేర్లను చెప్పడంతో బానోత్‌ బుచ్చ్యా, బానోత్‌ లాల్‌సింగ్‌, గుగులోతు వీరశేఖర్‌లను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. వీరశేఖర్‌ను బుధవారం మధ్యాహ్నం ఠాణాకు తీసుకొచ్చి విచారించి అర్ధరాత్రి వదిలేశారు. గురువారం ఉదయం మళ్లీ తండాకు వెళ్లి అతన్ని స్టేషన్‌కు రావాలని అడిగారు. అప్పటికే మంచంపై మూలుగుతున్న వీరశేఖర్‌ను కుటుంబసభ్యులు, తండావాసులు ఆరాతీయగా.. తనను రాత్రంతా పోలీసులు కొట్టినట్లు అతను తెలిపాడు. దీంతో తండావాసులు ఆగ్రహించి అతడిని ట్రాక్టర్‌పై ఠాణాకు తీసుకెళ్లి ఆందోళన చేపట్టారు. వారించేందుకు యత్నించిన ఎస్సై ఎం.లింగంతో వాగ్వాదానికి దిగారు. ఈ సందర్భంగా వీరశేఖర్‌కు న్యాయం చేయాలని, ఎస్సైను సస్పెండ్‌ చేయాలని నినాదాలు చేశారు. అనంతరం బాధితుడిని ఆటోలో సూర్యాపేట ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై సూర్యాపేట జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్‌ స్పందించి విచారణకు ఆదేశించారు. సూర్యాపేట డీఎస్పీ మోహన్‌కుమార్‌ను విచారణ అధికారిగా నియమించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని