logo
Published : 02/12/2021 03:08 IST

సాంకేతిక చదువులు విద్యార్థులకు కొలువులు

ప్రగతి పథంలో జేఎన్‌టీయూ నరసరావుపేట కళాశాల


ప్రయోగశాలలో ఆన్‌లైన్‌ తరగతుల్లో విద్యార్థులు

న్యూస్‌టుడే, నరసరావుపేట అర్బన్, యడ్లపాడు పల్నాడు ప్రాంతానికి మణిహారంగా భావించే జేఎన్‌టీయూ నరసరావుపేట కళాశాల ఏటేటా అభివృద్ధి పథంలో పయనిస్తోంది. కళాశాల ప్రారంభిన తర్వాత మూడో బ్యాచ్‌ బయటకు వెళ్లేందుకు సిద్ధంగా ఉంది. నాణ్యమైన విద్యతో పాటు ప్రాంగణ నియామకాల్లో ఉద్యోగావకాశాలు పొందిన విద్యార్థుల సంఖ్య ఏటా పెరుగుతోంది. మౌలిక వసతులు సరిపడా సమకూరకపోయినా అధ్యాపకుల కృషితో విద్యార్థులు సాంకేతిక నిపుణులుగా తయారై ఉన్నతికి బాటలు వేసుకుంటున్నారు.

జేఎన్‌టీయూ నరసరావుపేట కళాశాల ప్రారంభించిన తర్వాత రెండు బ్యాచ్‌లు బీటెక్‌ పూర్తి చేసుకుని బయటకు వెళ్లాయి. ప్రస్తుతం 2021-22 బ్యాచ్‌ చివరి సెమిస్టర్‌లో ఉంది. 2019-20 బ్యాచ్‌లో 120 మంది విద్యార్థులు ఉద్యోగాలు సాధించారు. 2020-21 బ్యాచ్‌ విద్యార్థులు 148 మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ప్రస్తుత బ్యాచ్‌ ఇప్పటికే 150 మంది ఉద్యోగాలు సాధించారు. విప్రోలో 73, గెలాక్సీ సొల్యూషన్స్‌లో మూడేళ్లకు రూ.23లక్షల ప్యాకేజీని ముగ్గురు విద్యార్థులు సాధించారు. టీసీఎస్‌లో 90మంది విద్యార్థులు తుదిదశకు ఎంపిక కాగా ఇప్పటికి 40మంది ఉద్యోగాలు సాధించారు.

ఉద్యోగ నైపుణ్య శిక్షణ ఇలా
సాంకేతిక రంగంలో ఉద్యోగాలకు బీటెక్‌లో సాధించిన మార్కుల కంటే అనువర్తన నైపుణ్యం, సాంకేతిక పరిజ్ఞానం, భావవ్యక్తీకరణ, స్పందించేతత్వం తదితరాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఆధునిక పరిజ్ఞానంపై అవగాహన కీలకంగా మారింది. దీనిని దృష్టిలో ఉంచుకుని ఏపీఎస్‌ఎస్‌డీసీ సహకారంతో విద్యార్థులకు పైథాన్, సీ, జావా లాంగ్వేజ్‌లపై శిక్షణ ఇచ్చారు. ఈ ఏడాది కాండెర్రా సంస్థ సహకారంతో ప్రత్యేకంగా తరగతులు చేపట్టారు. మాదిరి ఇంటర్వ్యూలు, వాటిని ఎదుర్కొనే నైపుణ్యాలపై శిక్షణ ఇచ్చారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఆన్‌లైన్‌లోనే ఎక్కువ శాతం శిక్షణ సాగింది.

అధ్యాపకుల ప్రోత్సాహంతో..
కళాశాలలో అధ్యాపకుల పర్యవేక్షణలో ఉద్యోగ సాధన నైపుణ్యాలపై దృష్టి పెట్టా. కొవిడ్‌ సమయంలో మిషన్‌ లెర్నింగ్, వెబ్‌డెవలప్‌మెంట్, పైథాన్, సీ అంశాల్లో ఆన్‌లైన్‌లో శిక్షణ తీసుకున్నా. చివరి ఏడాదిలో చేసిన మూడు ప్రాజెక్టులు, ప్రోగ్రామ్‌ రాయడంలో నైపుణ్యాలు మూడు ఉద్యోగాలు సాధించేందుకు కారణమయ్యాయి. ఆయా సంస్థలు వచ్చే జూన్‌లో ఉద్యోగాల్లో చేరేందుకు అనుమతులు ఇచ్చాయి. 
-జ్యోత్స్నమానస, గుంటూరు

కళాశాలపై నమ్మకంతో..
కొవిడ్‌ సమయంలో కళాశాల జరగకపోయినా అధ్యాపకులు ఆ లోటు తెలియనివ్వలేదు. క్లౌడ్‌ కంప్యూటింగ్, మిషన్‌లెర్నింగ్, కృత్రిమ మేధస్సు అంశాలపై ఆన్‌లైన్‌లో శిక్షణ తీసుకున్నా. కాండెర్రా సంస్థ తరగతులు, ఇంటర్వ్యూ స్కిల్స్‌పై శిక్షణ ఉద్యోగాల సాధనకు దోహదపడింది. గెలాక్సీలో మూడేళ్లకు రూ.23 లక్షల ప్యాకేజీతో ఉద్యోగానికి ఎంపికయ్యా. విదేశాల్లో ఎంఎస్‌ చేయాలన్న లక్ష్యంతో ఉన్నా. కొన్నాళ్లు ఉద్యోగం చేశాక అమెరికా వెళ్లి చదువుకుంటా. 
-సాయివంశీ, శ్రీకాకుళం

చర్చలతో ప్రయోజనం 
స్నేహితులతో సబ్జెక్టులపై చర్చలు ఉద్యోగ సాధనకు ఉపయోగపడ్డాయి. కృత్రిమ మేథస్సు, మిషన్‌లెర్నింగ్, కోడింగ్‌ సబ్జెక్టులు ఆన్‌లైన్‌లో నేర్చుకున్నా. ప్రోగ్రామ్‌ రాయడం కూడా సాధన చేశాం. అధ్యాపకుల సూచనలతో ఇంటర్వ్యూ స్కిల్స్, సాంకేతిక విషయాలపై శిక్షణ తీసుకున్నా. యాక్సెంచర్‌లో రూ.6.5లక్షల ప్యాకేజీతో ఉద్యోగం సాధించా.
- సాయి జాహ్నవి, గుంటూరు 

200 మందికి పైగా ఉద్యోగాలు 
జేఎన్‌టీయూ ఉపాధి కల్పన, శిక్షణ విభాగం తరఫున సీఆర్‌టీ తరగతులపై ఎక్కువ దృష్టి పెట్టాం. విభాగాధిపతులు సాఫ్ట్‌వేర్‌ రంగంలో ఉద్యోగావకాశాల గురించి విద్యార్థుల్లో ప్రేరణ కలిగించారు. 90శాతం మంది ఆన్‌లైన్‌ తరగతులతో పాటు ఏపీఎస్‌ఎస్‌డీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శిక్షణ వినియోగించుకున్నారు. చివరి ఏడాది విద్యార్థులు 300 మంది ఉన్నారు. వీరిలో ఇప్పటికే 150 మంది ఉద్యోగాలు సాధించారు. మరో 50మందికి పైగా విద్యార్థులకు అవకాశాలు వస్తాయి. 
- డాక్టర్‌ జి.మాధవి, ఉపాధి కల్పన, శిక్షణ విభాగం అధికారి, జేఎన్‌టీయూ నరసరావుపేట 

Read latest 4 News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని