logo

ఆర్జీయూకేటీని వీడని సమస్యల గ్రహణం!

విశ్వవిద్యాలయం అంటే అదో విశాల ప్రపంచం. ఆచార్యులు, ఔత్సాహిక విద్యార్థుల పరిశోధనలతో వినూత్న ఆవిష్కరణల కేంద్రం. కానీ నిర్మల్‌ జిల్లా బాసర ఆర్జీయూకేటీలో ఒక్కరంటే ఒక్క ఆచార్యుడు లేరు. నూతన ఆవిష్కరణల మాటేలేదు. పుష్కరకాలంగా సమస్యల గూటిలో చిక్కి విలవిల్లాడుతోంది

Published : 07 Aug 2022 06:18 IST

 ఆందోళనలే నిత్యకృత్యం..

నేడు గవర్నర్‌ పర్యటన
ఈటీవీ, ఆదిలాబాద్‌

బాసర ఆర్జీయూకేటీ విద్యాలయం

విశ్వవిద్యాలయం అంటే అదో విశాల ప్రపంచం. ఆచార్యులు, ఔత్సాహిక విద్యార్థుల పరిశోధనలతో వినూత్న ఆవిష్కరణల కేంద్రం. కానీ నిర్మల్‌ జిల్లా బాసర ఆర్జీయూకేటీలో ఒక్కరంటే ఒక్క ఆచార్యుడు లేరు. నూతన ఆవిష్కరణల మాటేలేదు. పుష్కరకాలంగా సమస్యల గూటిలో చిక్కి విలవిల్లాడుతోంది. గ్రామీణ విద్యార్థుల ఆశలపై నీళ్లు చల్లుతోంది. సమస్యల పరిష్కారం కోసం తరచూ విద్యార్థులు ఆందోళన బాట పడుతున్నారు. ఇటీవల తనను కలిసిన వారికి ఇచ్చిన హామీ మేరకు ఆదివారం రాష్ట్రగవర్నర్‌ తమిళిసై విద్యాలయాన్ని సందర్శించనున్నారు.

చదువుల క్షేత్రం బాసర కేంద్రంగా 2008లో ఏర్పడిన రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ)కి నిధుల కొరత సమస్యలన్నింటికీ ప్రధాన కారణమవుతోంది. సగటున ఏడాదికి కనీసం రూ.80 కోట్లకు తగ్గకుండా బడ్జెట్‌ అవసరమైతే ప్రభుత్వం అరకొరగా కేటాయించే నిధులతో అవసరాలు తీరడం లేదు. ఫలితంగా సాంకేతికరంగంలో నూతన ఆవిష్కరణలకు ప్రాణం పోయాల్సిన విశ్వవిద్యాలయం భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. 2014లోనే యూనివర్శిటీ గ్రాంట్స్‌ కమిషన్‌(యూజీసీ) పరిధిలోకి వచ్చినప్పటికీ రెగ్యులర్‌ బోధకుల వ్యవస్థ లేక అక్కడినుంచి నిధులు విడుదల కావడం లేదు. పీయూసీ మొదలుకొని ఇంజినీరింగ్‌ వరకు ఆరేళ్ల కోర్సులో దాదాపుగా 9వేల మంది విద్యార్థులకు నిబంధనల ప్రకారం 1:20 చొప్పున అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు, అసోసియేట్‌ ప్రొఫెÆసర్లు, ప్రొఫెÆసర్లు కలిపి 450మంది అవసరం. ప్రస్తుతం కేవలం 19 మంది రెగ్యులర్‌ బోధకులు, మరో 135 మంది ఒప్పంద ప్రాతిపదికన పనిచేస్తున్నవారు ఉన్నారు. యూజీసీ నిబంధనల ప్రకారం రెగ్యులర్‌ ప్రొఫెసర్ల పరిశోధనలకే ప్రాధాన్యం లభిస్తుంది. విశ్వవిద్యాలయం పరిధిలో ఒక పరిశోధనకు యూజీసీ ఆమోదం పొందితే రూ.లక్షల నిధులు వస్తాయి. దీంతో ప్రొఫెసర్లు, విద్యార్థుల్లో కొత్త కొత్త ఆవిష్కరణలకు రూపకల్పన చేయాలనే ఆలోచన మొగ్గ తొడుగుతుంది. అయితే విద్యాలయంలో ఆ వైపు అడుగులు పడటం లేదు.
భయం గొలిపే భవితవ్యం
గ్రామీణ ప్రాంత విద్యార్థుల కోసం ఏర్పడిన ఆర్‌జీయూకేటీ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారుతోంది. 272 ఎకరాల సువిశాల ఆవరణతో పాటు భవన సముదాయం ఉన్నప్పటికీ నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. వెయ్యిమంది విద్యార్థులే భోజనం చేసే వెసలుబాటు ఉన్న మెస్‌లలో ఇప్పుడు మూడువేల వరకు సర్దుకోవాల్సి రావటం అసౌకర్యాలకు కారణమవుతోంది. 500మంది విద్యార్థులకో మెస్‌ ఏర్పాటుచేయాల్సి ఉంది. 10వేల మంది విద్యార్థులకు సరిపడా వసతిగృహాలు అవసరం ఉంటే 12ఏళ్ల కిందటి ప్రణాళిక ప్రకారం 6వేలకే సరిపోయేలా ఉన్నాయి. కొత్తగా చేరే పీయూసీ ప్రవేశాల్లో 65శాతం బాలికలుంటే 35శాతం బాలుర సంఖ్య ఉంటోంది. బాలికలకు అనుకూలమైన వసతి కల్పనను విద్యాలయం పట్టించుకోవడం లేదు. ఏడాదికేడాది పెరుగుతున్న విద్యార్థుల ప్రవేశాలకు అనుగుణంగా నిధుల కేటాయింపు లేదు. రాష్ట్రంలో ఓయూ, కేయూ, జేఎన్‌టీయూల మాదిరిగా ఆర్జీయూకేటీకి అనుబంధ కళాశాలల వ్యవస్థ, మేనేజ్‌మెంట్‌ కోటా ఉంటే ఆర్థికంగా వెసులుబాటు కలిగేది. ఇప్పుడు ప్రభుత్వం నిధులు కేటాయిస్తే తప్ప ఏ పని జరిగే పరిస్థితిలేదు. అయితే రాష్ట్రప్రబుత్వం నుంచి నిధులు రాక నెలకు సగటున రూ.8 కోట్ల వేతనాలు ఇవ్వలేని స్థితిలో విశ్వవిద్యాలయం ఉంది. 2008లో అప్పటి ప్రభుత్వం చేసిన ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల నుంచి వేతనాలతోసహా అన్ని ఖర్చులకు డబ్బు చెల్లిస్తుండటంతో భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతోంది.
దృష్టిసారించాల్సిన అంశాలివి..
*  రెగ్యులర్‌ వీసీ సహా ఆరేళ్ల కోర్సు సబ్జెక్టులకు అనుగుణంగా రెగ్యులర్‌ బోధకులను భర్తీచేయాలి.
* ఇప్పుడున్న ఇంజినీరింగ్‌ సహా ఆర్ట్స్‌, సైన్సు, కామర్స్‌ విభాగాలతోపాటు పీజీ కోర్సులను అందుబాటులోకి తేవాలి.
*  కొన్ని విద్యాసంస్థలను అనుబంధ కళాశాలలుగా మార్చడంతో పాటు మేనేజ్‌మెంట్‌ సీట్లను పెంచి నిధుల సమకూర్చుకునే వెసలుబాటు కల్పించాలి.
*  దేశవ్యాప్తంగా ఉన్న విశ్వవిద్యాలయాలతో అనుసంధానం చేస్తూ నూతన ఆవిష్కరణలకు రూపకల్పన చేయాలి.
*  అసౌకర్యాలకు తావులేకుండా నిరంతర పర్యవేక్షణను పెంచాలి.
*  ల్యాబోరేటరీ, మిషనరీ, ల్యాప్‌టాప్‌లు, యూనిఫాం, భోజన వసతిని కల్సించాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని