logo

పూర్తయిన ఇళ్లు.. అనుమానాలు కోకొల్ల్లలు

పేదలు వారి కలల సౌధమైన రెండు పడకగదుల ఇళ్ల కోసం లబ్ధిదారులు నానా పాట్లు పడాల్సి వస్తోంది. ప్రభుత్వం ప్రకటించిన తొలి జాబితాలో పేరున్నా.. సర్వేకోసం వచ్చిన అధికారుల దగ్గరున్న జాబితాలో అవి లేకపోవడం.. కొందరి దరఖాస్తు పత్రాలు మాయమవడం విస్మయాన్ని కలిగిస్తున్నాయి. దీనిపై లబ్ధిదారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

Published : 13 Aug 2022 05:38 IST

 జాబితాలో పేర్లు మాయం..లబ్ధిదార్ల అయోమయం
నిర్మల్‌, న్యూస్‌టుడే

పట్టణ శివారులో నిర్మించిన రెండు పడక గదుల ఇళ్లు

పేదలు వారి కలల సౌధమైన రెండు పడకగదుల ఇళ్ల కోసం లబ్ధిదారులు నానా పాట్లు పడాల్సి వస్తోంది. ప్రభుత్వం ప్రకటించిన తొలి జాబితాలో పేరున్నా.. సర్వేకోసం వచ్చిన అధికారుల దగ్గరున్న జాబితాలో అవి లేకపోవడం.. కొందరి దరఖాస్తు పత్రాలు మాయమవడం విస్మయాన్ని కలిగిస్తున్నాయి. దీనిపై లబ్ధిదారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
జిల్లా కేంద్రంలోని బంగల్‌పేట్‌ మహాలక్ష్మి ఆలయం సమీపంలోని రెండు ప్రాంతాల్లో 1,380 రెండు పడక గదుల ఇళ్లు (జీ ప్లస్‌ 2) నిర్మాణాలు పూర్తి చేశారు. వీటిని పట్టణంలోని 42 వార్డుల్లో నివసిస్తున్న పేద లబ్ధిదారులకు వచ్చే దసరా పండగ రోజు ఇళ్లు కేటాయించాలని అధికారులు నిర్ణయించారు. ఏడాది క్రితం అన్ని వార్డుల్లోని పేదల నుంచి దరఖాస్తులు స్వీకరించి  విచారణ చేసి తుది జాబితాను వెల్లడించారు. ఆ జాబితాపై అభ్యంతరాలు రావడంతో మళ్లీ రీ సర్వే ప్రక్రియను కొనసాగిస్తున్నారు. ఈ అవకాశాన్ని తమకు అనుకూలంగా మలుచుకునేందుకు కొంతమంది ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఆయా వార్డుల జాబితాను తీసుకుని పేర్లున్న వారి వద్దకు వెళ్లి మీకు ఇల్లు మంజూరు కావాలంటే కొంత ముట్ట జెప్పాల్సిందేనని, జాబితాలో పేరు లేకపోతే మీ పేరు ఉండేలా చూస్తాం. ఇల్లు ఇప్పిస్తాం.. డబ్బులు ఇవ్వాలని నమ్మిస్తున్నారు. వారి మాటలు నమ్ముతున్న కొంతమంది అమాయక డబ్బులు ఇవ్వడానికి ఒప్పందం కుదుర్చుకుంటున్నారు.
‘‘మీకు ఉండటానికి ఇల్లు ఉంది. అయినా రెండు పడక గదుల ఇల్లు అవసరం ఉంటే చెప్పండి.. మీ పేరు జాబితాలో ఉండేట్లు చేస్తాం.. ఇల్లు ఇప్పించే బాధ్యత మాది.. ఇందుకు రూ. లక్ష అవసరం.. ఇప్పుడు రూ.50 వేలు.. ఇంట్లోకి వెళ్లిన తర్వాత మరో రూ.50 వేలు ఇవ్వాల్సి ఉంటుంది.’’ అంటూ పట్టణంలోని కొన్ని వార్డుల్లో లబ్ధిదారులను నచ్చజెప్తూ డబ్బులు అడుగుతున్నారు. కొంతమంది స్థానిక రాజకీయాలతో సంబంధం ఉన్న వ్యక్తులు. మరికొన్ని చోట్ల ప్రత్యక్షంగా స్థానిక ప్రజాప్రతినిధులే డబ్బులు అడుగుతుండటం గమనార్హం.

పట్టణంలోని 39 వార్డుకు చెందిన 210 మంది రెండు పడక గదుల కోసం గతంలోనే దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 55 మంది అర్హులు ఉన్నట్లు అధికారుల విచారణలో తేలింది. అన్ని వార్డుల్లోనూ జాబితాపై అభ్యంతరాలు రావడంతో మళ్లీ సర్వే చేయించాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఈ రెండు వార్డుల్లో జాబితాలో ఉన్న వారిలో అందరినీ సర్వే చేయకుండా కొందరిని చేసి.. మరికొందరివి చేయకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో విచారణ చేసిన సమయంలో అద్దె ఇంట్లో ఉన్నా.. ఇల్లు ఉందని రాసుకుని వెళ్లిపోయారని కొంతమంది లబ్ధిదారులకు ఉన్నతాధికారులకు విన్నవించారు. తమకు రెండు పడక గదుల ఇళ్లు మంజూరు చేయించాలని కోరారు.

ఈ చిత్రంలో ఉన్న మహిళ పేరు వొల్లెపు సుజాత. పట్టణంలోని భాగ్యనగర్‌ ప్రాంతం. రెండు పడక గదుల ఇళ్ల మంజూరు జాబితాలో 136 సీరియల్‌ నెంబరుతో ఈమె పేరుండటంతో ఎంతో సంతోషించింది. రోజూ కూలి పనులు చేసుకునే తమకు సొంతింటి ‘కల’ నెరవేరుతుందని ఆ కుటుంబం ఆనంద పడింది. ఇంతలోనే సర్వే చేపట్టడానికి వచ్చిన అధికారి తీసుకొచ్చిన జాబితాలో పేరున్నా.. దరఖాస్తు లేదని చెప్పడంతో ఒక్కసారిగా విస్తుపోయింది. ఏం చేయాలో తెలియక ఉన్నతాధికారులకు విన్నవించింది. తమకు డబ్బులు ఇచ్చేంత స్థోమత లేదని, కొంతమంది వ్యక్తులు తన దరఖాస్తును కావాలనే తొలగించాలని ఆవేదన వ్యక్తం చేసింది. సదరు అధికారి సర్వే చేయకుండానే తిరిగి వెళ్లిపోయాడని, పేదలమైన తమకు ఇల్లు ఇప్పించాలని వేడుకుంది.
మా పేర్లు కంశెట్టి లక్ష్మి, గోరె లక్ష్మి. పట్టణంలోని వొడ్డెర కాలనీలో ఉంటున్నాం. రోజూ కూలీ పనులు చేసుకుని జీవనం కొనసాగిస్తున్నాం. ఉండటానికి ఇళ్లు లేవు. రెండు పడక గదుల ఇల్లు కోసం గతంలో దరఖాస్తు చేసుకున్నాం. సర్వే చేశామని చెబుతున్నా.. జాబితాలో పేర్లు లేవు. మా ప్రాంతంలోనే ఓ ఇంట్లో ముగ్గురి పేర్లు జాబితాలో ఉన్నాయి. సర్వే కోసం వచ్చిన అధికారులను అడిగితే తమకేం తెలియదని, ఇక్కడున్న వారు ఇచ్చిన దరఖాస్తుల ఆధారంగా సర్వే చేస్తున్నామని  వెళ్లిపోయారు. మాలాంటి పేదలకు న్యాయం చేయాలి.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని