logo

మెజార్టీయే లక్ష్యం

లోక్‌సభ ఎన్నికల ప్రచార గడువు సమీపిస్తున్న నేపథ్యంలో ఆయా రాజకీయ పార్టీల ఎత్తుకు పైఎత్తులతో వ్యూహాలకు పదును పెడుతున్నారు. ప్రచారానికి నాలుగు రోజులే మిగిలి ఉండటంతో మెజార్టీయే లక్ష్యంగా లెక్కలు వేసుకుంటూ ఓటర్లకు గాలం వేస్తున్నారు.

Updated : 08 May 2024 07:00 IST

ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్న పార్టీలు

న్యూస్‌టుడే, నిర్మల్‌: లోక్‌సభ ఎన్నికల ప్రచార గడువు సమీపిస్తున్న నేపథ్యంలో ఆయా రాజకీయ పార్టీల ఎత్తుకు పైఎత్తులతో వ్యూహాలకు పదును పెడుతున్నారు. ప్రచారానికి నాలుగు రోజులే మిగిలి ఉండటంతో మెజార్టీయే లక్ష్యంగా లెక్కలు వేసుకుంటూ ఓటర్లకు గాలం వేస్తున్నారు. భాజపా, కాంగ్రెస్‌, భారాస మధ్యే ముక్కోణపు పోటీ నెలకొనడంతో తమకు అత్యధిక ఓట్లు వచ్చేలా ఆయా పార్టీలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. పట్టణ, మండల, గ్రామాల వారీగా పార్టీల ముఖ్య నాయకులకు ప్రచార బాధ్యతలు అప్పగించి ప్రచారం చేయిస్తున్నారు.  
నిర్మల్‌, ముథోల్‌పైనే పార్టీల దృష్టి 2019లో ఆదిలాబాద్‌ పార్లమెంటు స్థానాన్ని భాజపా కైవసం చేసుకోవడంలో నిర్మల్‌, ముథోల్‌ నియోజకవర్గాల ఓట్లు కీలకమయ్యాయి. ఈ రెండు నియోజకవర్గాల్లోనే భాజపాకు 45,492 ఓట్ల మెజార్టీ వచ్చింది. గత శాసనసభ ఎన్నికల్లో నిర్మల్‌, ముథోల్‌ నియోజకవర్గాలను తమ ఖాతాలో వేసుకున్న భాజపా ఓట్ల ఆధిక్యతను మరోసారి చూపించింది. ఈ ఎన్నికల్లో నిర్మల్‌ నియోజకవర్గంలో ఆ పార్టీకి 1,06,400 ఓట్లు రాగా మొత్తం పోలైన ఓట్లలో 54.03 శాతంతో 50,703 ఓట్లు ఎక్కువగా వచ్చాయి. రెండోస్థానంలో భారాసకు 55,697, మూడో స్థానానికే పరిమితమైన కాంగ్రెస్‌కు 28,642 ఓట్లు వచ్చాయి. ముథోల్‌ నియోజకవర్గంలోనూ భాజపాకు 98,252 ఓట్లు రాగా మొత్తం పోలైన ఓట్లలో 48.59 శాతంతో 23,999 ఆధిక్యత సాధించింది. రెండోస్థానంలో భారాసకు 74,253, మూడోస్థానంలో ఉన్న కాంగ్రెస్‌కు 15,588 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఈ పార్లమెంటు ఎన్నికల్లో భాజపా మరింత భారీ మెజార్టీ సాధించేలా పక్కా ప్రణాళికలతో ఆ పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు ప్రచార పర్వాన్ని కొనసాగిస్తున్నారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ పార్టీ ఈ రెండు నియోజకవర్గాల్లో భాజపాకు వచ్చిన ఓట్లకు గండి కొట్టడానికి ప్రయత్నాలు చేస్తూ వ్యూహాలతో ప్రచారాన్ని హోరెత్తిస్తోంది. పార్టీలో చేరికలను ప్రోత్సహిస్తూనే ఈ సారి మెజార్టీ సాధించాలన్న సంకల్పంతో ముందుకెళుతోంది. ఈమేరకు నిర్మల్‌లో రాహుల్‌గాంధీ, సీఎం రేవంత్‌రెడ్డిలతో బహిరంగ సభ నిర్వహించింది. భారాస గట్టిపోటీ ఇవ్వడానికి ప్రయత్నాలు చేస్తోంది. మాజీ మంత్రి ఐకేరెడ్డి, ముథోల్‌ మాజీ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి, మున్సిపల్‌ ఛైర్మన్‌ గండ్రత్‌ ఈశ్వర్‌, మాజీ ఛైర్మన్‌ అప్పాల గణేశ్‌, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ ఛైర్మన్‌ రాజేందర్‌, పలు మండలాల ఎంపీపీలు, జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు, పలువురు కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు పార్టీని వీడినా కార్యకర్తలు తమ వెంట ఉన్నారన్న ధీమా భారాసలో కనిపిస్తోంది. నిర్మల్‌, భైంసా పట్టణాల్లో గురువారం కేటీఆర్‌తో రోడ్‌షో తలపెట్టింది. 

ఎవరికి వారే..

లోక్‌సభ ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నాయి. సమయం తక్కువగా ఉండటంతో బృందాలుగా ఏర్పడి ప్రచార పర్వాన్ని కొనసాగిస్తున్నారు. ఇప్పటికే అన్ని పార్టీలు పట్టణ, గ్రామాల్లోని సామాజిక వర్గాల వారీగా కుల సంఘాలను కలిసి మద్దతు ఇవ్వాలని కోరారు. ఉదయం సమయాల్లో ఉపాధి పనులు జరిగిన చోటకు వెళ్లి ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి ఆత్రం సుగుణ విజయం కోసం ఉమ్మడి జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి సీతక్క పలుమార్లు ఈ రెండు నియోజకవర్గాల నేతలతో సమీక్షలు నిర్వహించి ప్రచారశైలిపై దిశానిర్దేశం చేశారు. డీసీసీ అధ్యక్షుడు శ్రీహరిరావు, ఇటీవల పార్టీలో చేరిన మాజీ మంత్రి ఐకేరెడ్డి, ముథోల్‌లోనూ మాజీ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి, నియోజకవర్గ ఇన్‌ఛార్జి నారాయణరావుపటేల్‌, ఇతర పార్టీ ముఖ్యులు ఎవరికి వారే ప్రచారం చేస్తున్నారు. ఇక భాజపాలో అన్నీ తానై చూసుకుంటున్న ఆ పార్టీ శాసనసభ పక్ష నేత, ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి ఈ ఎన్నికల్లో తనకు వచ్చిన మెజార్టీకి మించేలా వ్యూహంతో ముందుకెళ్తున్నారు. గోడం నగేశ్‌ గెలుపు కోసం గ్రామాల్లో పర్యటిస్తూ కాంగ్రెస్‌, భారాసల వైఖరి ఎండగడుతూ ప్రచారం కొనసాగిస్తున్నారు. ముథోల్‌లోనూ ఆధిక్యత తగ్గకుండా ఆ పార్టీ ఎమ్మెల్యే రామారావు పటేల్‌తోపాటు ద్వితీయశ్రేణి నాయకులు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. భారాస పార్టీ భాజపా, కాంగ్రెస్‌లకు దీటుగా ప్రచారం కొనసాగిస్తోంది. నాయకులు పార్టీని వీడినా కార్యకర్తల బలం ఉందన్న ధీమాతో ప్రచారం చేస్తున్నారు. నిర్మల్‌లో ఆ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త రాంకిషన్‌రెడ్డి, ఇన్‌ఛార్జి యూనుస్‌ అక్బానీ, పట్టణాధ్యక్షుడు మారుగొండ రాము, తదితర నేతలు, ముథోల్‌లో పార్టీ సమన్వయ కమిటీ బాధ్యులు పడకంటి రమాదేవి, విలాస్‌ గాదేవార్‌, లోలం శ్యాంసుందర్‌, డా.కిరణ్‌కుమార్‌ కొమ్రెవార్‌, తదితర నాయకులు ఆ పార్టీ అభ్యర్థి ఆత్రం సక్కు విజయం సాధించేందుకు కృషి చేస్తున్నారు. ప్రధాన పార్టీల ప్రచారంతో అంతటా ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు