logo

మాయ లేడి

ఆమె ఓ మహిళ. భర్త వ్యాపారం చూస్తూనే అందరితో కలివిడిగా ఉంటూ మాటలు కలిపేది. ఈ క్రమంలో ఏర్పడిన పరిచయాలను సొమ్ము చేసుకోవాలనుకుంది. విద్యార్హత ఆధారంగా ఉద్యోగాలిప్పిస్తానంటూ నమ్మబలికింది.

Published : 08 May 2024 08:18 IST

ఉద్యోగాల పేరిట బురిడీ

నిర్మల్‌ పట్టణం, న్యూస్‌టుడే: ఆమె ఓ మహిళ. భర్త వ్యాపారం చూస్తూనే అందరితో కలివిడిగా ఉంటూ మాటలు కలిపేది. ఈ క్రమంలో ఏర్పడిన పరిచయాలను సొమ్ము చేసుకోవాలనుకుంది. విద్యార్హత ఆధారంగా ఉద్యోగాలిప్పిస్తానంటూ నమ్మబలికింది. వారి నుంచి డబ్బులు వసూలుచేసి, ఆతర్వాత ఉద్యోగం ఇప్పించకుండా కాలం గడిపేది. ఇదేంటని ప్రశ్నించినవారికి డబ్బులు చెల్లిస్తానని, ఓపికగా ఉండాలని సర్దిచెప్పేది. చూసీచూసీ విసిగిపోయిన బాధితులు తామంతా మోసపోయినట్లు గుర్తించారు. పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారు.

రూ.లక్షల్లో వసూలు..

పట్టణానికి చెందిన ఓ మహిళ ఉద్యోగాల పేరిట మోసగిస్తున్న వైనం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లు వెలువడటం లేదు. చాలాచోట్ల పొరుగుసేవల విధానంలో ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. దీన్ని ఆసరాగా చేసుకొని.. ఏజెన్సీ నుంచి ఉద్యోగాలను ఇప్పిస్తానంటూ సదరు మహిళ తెలిసినవారిని నమ్మించింది. వివిధ ప్రభుత్వ రంగాల్లో ఉద్యోగమంటూ ఒక్కొక్కరి నుంచి సగటున రూ.3 లక్షల వరకు వసూలుచేసింది. కొందరికి కేంద్ర రైల్వేవిభాగంలో ఉద్యోగమని చెప్పి రూ.8 లక్షల వరకు వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఇలా పదులసంఖ్యలో ఆశావహుల నుంచి రూ.లక్షల్లో  వసూలుచేసింది. వారిలో మరింత నమ్మకం కలిగేందుకు డబ్బు అప్పుగా తీసుకుంటున్నానని, కొద్దిరోజుల్లోనే చెల్లిస్తానంటూ బాండ్‌ పేపర్లు సైతం రాసివ్వడం గమనార్హం. డబ్బులిచ్చిన నెలరోజుల్లోపు ఉద్యోగం వస్తుందని, నియామకపత్రం చేతికిస్తామని చెప్పడంతో చాలామంది ఆశగా చెల్లించారు. కానీ, ఆ తర్వాత రోజులు గడుస్తున్నా స్పందన లేకపోవడం, ఉద్యోగ నియామక అవకాశం రాకపోవడంతో వారంతా బిత్తరపోతున్నారు. దాదాపు ఏడాదికాలంగా ఈ తతంగం కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.

నకిలీ పత్రాలతో..

పట్టణానికి చెందిన ఓ యువకుడు ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఉద్యోగి. ఉద్యోగం వస్తుందన్న ఆశతో దాదాపు అయిదునెలల క్రితం రూ. 2.30 లక్షలు చెల్లించాడు. ఆ తర్వాత అతడికి పొరుగుజిల్లాకు చెందిన ఓ ఏజెన్సీ నుంచి ఉద్యోగ నియామకపత్రం అందించారు. వారు చెప్పిన కార్యాలయానికి వెళ్లి ఉద్యోగంలో చేరేందుకు అంగీకరిస్తూ సంతకం చేసొచ్చాడు. రెండు, మూడురోజుల్లో కాల్‌చేస్తామని చెప్పి వారు ఆ విషయం మర్చిపోయారు. తీరా చూస్తే ఆ ఉద్యోగంలో మరొకరు చేరినట్లు తెలిసింది. ఒకే నియామక ఉత్తర్వును ముగ్గురికి ఇచ్చినట్లు గుర్తించి అవాక్కయ్యాడు. ఏది నకిలో, ఏది నిజమో తెలియక తన డబ్బులు తనకు ఇచ్చేయాలని, లేకపోతే ఉద్యోగం ఇప్పించాలంటూ సదరు మహిళను ఆశ్రయించాడు. ఆమె వ్యవహారం అనుమానంగా ఉండటంతో మోసపోయామని గుర్తించారు. డబ్బులు ఇచ్చేస్తానని, ఓపికగా ఉండకపోతే తనను బెదిరిస్తున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు చేస్తానని భయపెడుతోందంటూ బాధితులు వాపోవడం గమనార్హం.

  • మరో ఇద్దరు బాధితులకు పోస్ట్‌ డేటెడ్‌ చెక్కులు అందించింది. ఎందుకైనా మంచిదని, సదరు బ్యాంకులో ఆ చెక్కు గురించి వాకబుచేస్తే.. సంతకం నకిలీదని బ్యాంకు సిబ్బంది చెప్పడంతో తాము హతాశులయ్యామని బాధితులు పేర్కొంటున్నారు. సుమారు రూ. కోటికి పైగానే ఇలా వసూలుచేసి అందరినీ ఇబ్బందులకు గురిచేస్తోందని, డబ్బులివ్వకుండా వేధిస్తోందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు