logo

బాల్యం.. బక్కచిక్కిపోతోంది

బాల్య దశలో బలంగా ఉంటేనే భవిష్యత్తు దృఢంగా ఉంటుంది. మారుతున్న కాలం, ఆహారపు అలవాట్లతో చిన్ననాటి నుంచే రుగ్మతలు చుట్టుముడుతున్నాయి. బడికెళుతున్న బాల్యం పోషకాహారం సరిగా అందక బక్కచిక్కిపోతోంది. ఎదుగుదల లోపాలు తలెత్తుతున్నాయి.

Published : 15 Aug 2022 05:26 IST

‘ఆర్‌బీఎస్‌కే’ పరీక్షల్లో 3780 విద్యార్థులకు సమస్యలు
ఆసిఫాబాద్‌, న్యూస్‌టుడే


పిల్లలకు ఆరోగ్య పరీక్షలు చేస్తున్న ఆర్‌బీఎస్‌కే వైద్యులు, సిబ్బంది

బాల్య దశలో బలంగా ఉంటేనే భవిష్యత్తు దృఢంగా ఉంటుంది. మారుతున్న కాలం, ఆహారపు అలవాట్లతో చిన్ననాటి నుంచే రుగ్మతలు చుట్టుముడుతున్నాయి. బడికెళుతున్న బాల్యం పోషకాహారం సరిగా అందక బక్కచిక్కిపోతోంది. ఎదుగుదల లోపాలు తలెత్తుతున్నాయి. కంటి, దంత, చర్మవ్యాధులతో సతమతమవుతున్నారు. ఇలాంటి వాటి నుంచి పిల్లలను రక్షించి వారి బంగారు భవిష్యత్తుకు ఆరోగ్య బాటలు వేసేందుకు ప్రభుత్వం రాష్ట్రీయ బాల స్వస్థ్య కార్యక్రమం చేపడుతోంది. విద్యార్థి ఆరోగ్యానికి ఆర్‌బీఎస్‌కే బాసటగా నిలుస్తోంది. జిల్లాలో పది ఆర్‌బీఎస్‌కే బృందాలు పని చేస్తున్నాయి. ఒక్కో బృందంలో ఇద్దరు వైద్యులు, ఒక ఏఎన్‌ఎం, ఒక ఫార్మాసిస్టు చొప్పున ఉన్నారు. వారికి ప్రత్యేకంగా వాహనాలు కేటాయించారు. వీరు నిత్యం ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్‌ కళాశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల పిల్లలను క్షేత్ర స్థాయిలో సందర్శించి ఆరోగ్య పరీక్షలు చేయాలి. వారి పరిధిలో అయిన వాటికి వైద్య సేవలు అందిస్తారు. అంతకు మించి సమస్యలుంటే ఆదిలాబాద్‌ రిమ్స్‌లోని డైస్‌ కేంద్రానికి పంపించి వైద్య నిపుణులతో అవసరమైన శస్త్ర చికిత్సలు చేయిస్తున్నారు. ఒక్కో బృందం రోజుకు కనీసం 120 మంది విద్యార్థులకు పరీక్షించాలి.

బయట పడుతున్న రుగ్మతలు..
జిల్లాలో విద్యా సంవత్సరం ప్రారంభం నుంచి జూన్‌, జులైలో మొత్తం 271 అంగన్‌వాడీ కేంద్రాలు, పాఠశాలలు, కళాశాలల్లో 28,632 మంది విద్యార్థులకు పరీక్షలు చేసినట్లు బృందం అధికారుల లెక్కలు చెబుతున్నాయి. 3780 మంది విద్యార్థులు జ్వరం, జలుబు, దగ్గు తదితర చిన్నచిన్న అనారోగ్య సమస్యలతో బాధపడుతుండగా.. మందులిచ్చి నయం చేశారు. చర్మ, దంత, వినికిడి, పోషణలోపం, కంటి సమస్యలు, పుట్టుక లోపాలు.. ఇలా రకరకాల ఆరోగ్య సమస్యలున్న 550 మంది విద్యార్థులను గుర్తించి మెరుగైన వైద్యం కోసం ఆదిలాబాద్‌ డైస్‌(డిస్ట్రిక్ట్‌ ఎర్లీ ఇంటర్‌వెన్షన్‌ సెంటర్‌)కు రిఫర్‌ చేశారు. అక్కడ కాని వాటికి హైదరాబాద్‌లోని ఆసుపత్రుల్లో కూడా చేర్పించి ఉచితంగా చికిత్సలు చేయిస్తారు. గుండె సంబంధిత, ఎదుగుదల లోపం, గ్రహణమొర్రి, రక్తహీనత, బుద్దిమాంధ్యం, నరాలు, కండరాల సమస్యలు, రుతుస్రావ సమస్యలు, శ్రద్ధ లోపం.. ఇలా సుమారు 32 అంశాల్లో వైద్య సేవలు అందిస్తారు.

పోషకాహార లోపంతోనే అనేక ఇబ్బందులు..
పోషకాహార లోపం అనేక సమస్యలకు దారి తీస్తుంది. అలసట, చిరాకు, శ్వాస సమస్య, చర్మం నిర్జీవంగా మారడం, గుండె సంబంధిత జబ్బులు, పెరుగుదలలో లోపం, జీర్ణలోపాలు, కంటి, రక్తహీనత, వ్యాధి నిరోధక  శక్తి తగ్గడం.. ఇలా అనేక రుగ్మతలకు దారి తీస్తుంది. వీటిపై తల్లిదండ్రులు ప్రత్యేక దృష్టిసారించి పౌష్టికాహారం అందించేలా చూడాలి.

ప్రతి విద్యార్థిని పరీక్షిస్తారు : - ప్రభాకర్‌రెడ్డి, డీఎంహెచ్‌వో
అన్ని ప్రభుత్వ విద్యా సంస్థల్లోని ప్రతి విద్యార్థికి ఆర్‌బీఎస్‌కే బృందం ఆరోగ్య పరీక్షలు చేస్తుంది. పుట్టుక లోపాలు, వ్యాధులు, ఎదుగుదల.. ఇలా వివిధ రకాల ఆరోగ్య సమస్యలు గుర్తిస్తారు. సీజనల్‌ వ్యాధుల నేపథ్యంలో గురుకులాలు, కేజీబీవీల్లో నెలకు రెండుసార్లు పరీక్షలు జరపాలని ఆదేశించాం. తీవ్ర సమస్యలున్న, శస్త్ర చికిత్సలు అవసరమున్న పిల్లలకు ఆదిలాబాద్‌, హైదరాబాద్‌ ఆసుపత్రులకు తరలిచించి వైద్యం చేయిస్తారు.


ఈ చిత్రంలో కనిపిస్తున్నది కెరమెరి మండలం పాటగూడకు చెందిన అయిదేళ్ల బాలుడు అర్జున్‌. గ్రహణం మొర్రితో బాధపడుతున్న ఈ బాలుడిని ఆర్‌బీఎస్‌కే ఆధ్వర్యంలో జూన్‌లో హైదరాబాద్‌లోని ఆసుపత్రిలో శస్త్రచికిత్స చేయించారు. చికిత్స అనంతరం ముఖంలో రూపు ఇలా మారింది. ఇలా అవసరమైన వారికి శస్త్ర చికిత్సలు, ప్లాస్టిక్‌ సర్జరీలు సైతం ఉచితంగా చేయిస్తారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని