logo

వట్టి మాటలే.. కడుపు కోతలే..

కడుపు కోతలు(శస్త్రచికిత్సలు)తగ్గించడంలో జిల్లా వైద్యారోగ్యశాఖ విఫలమవుతోంది. సర్కారుతోపాటు ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ వీటి సంఖ్య పెరుగుతోంది.

Updated : 24 May 2023 06:46 IST

 ప్రైవేటులో పెరుగుతున్న శస్త్రచికిత్సలు
 సర్కారులో తగ్గిన సాధారణ ప్రసవాలు

మంచిర్యాల సిటీ, న్యూస్‌టుడే: కడుపు కోతలు(శస్త్రచికిత్సలు)తగ్గించడంలో జిల్లా వైద్యారోగ్యశాఖ విఫలమవుతోంది. సర్కారుతోపాటు ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ వీటి సంఖ్య పెరుగుతోంది. మంత్రులు, అధికారులు సాధారణ కాన్పులపై శ్రద్ధ పెడుతున్నామని చెబుతున్నా అవన్నీ వట్టిమాటలే అవుతున్నాయి. కాన్పులన్నీ ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లోనే జరగాలంటూ పదే పదే మంత్రి ఆదేశాలు ఇస్తున్నా ఇక్కడి అధికారులు పెడచెవిన పెడుతున్నారు తప్ప చర్యలు తీసుకోవడం లేదు. సంబంధిత సమస్యలపై ప్రతినెల ప్రైవేటు ప్రసూతి వైద్యులతో నిర్వహిస్తున్న సమీక్షా సమావేశాలు నామమాత్రంగా మారాయి. ప్రైవేటులో ప్రసవాలు, శస్త్రచికిత్సలు పెరుగుతున్నాయే కానీ తగ్గడం లేదు. సర్కారులో సాధారణ ప్రసవాలు తగ్గడమే కాకుండా కాన్పుల సంఖ్య రోజురోజుకు పడిపోతుంది.

అవగాహన కల్పించ డంలో విఫలం..

మంచిర్యాలలోని మాతా, శిశు ఆరోగ్య కేంద్రం

సాధారణ ప్రసవాలతో కలిగే ప్రయోజనంపై అవగాహన కల్పించడంలో జిల్లా ఆరోగ్యశాఖ విఫలమవుతోంది. వైద్యులు బాధితులకు భరోసా కల్పించలేకపోతున్నారు. శస్త్రచికిత్సలతో కలిగే నష్టాలు వివరించడం లేదు. ముహూర్తాలు, నొప్పులు భరించడం లేరంటూ గర్భిణుల కుటుంబసభ్యుల మాటలు, ఒత్తిడికి లొంగుతున్నారు తప్పితే సర్దిచెప్పేందుకు ప్రయత్నించడం లేదనే ఆరోపణలు వినవస్తున్నాయి.

ఈ లెక్కలు చూస్తే ప్రైవేటులో ఏ స్థాయిలో కోతలు ఉంటున్నాయో అర్థం చేసుకోవచ్చు. జిల్లాలోని సంబంధిత ఆసుపత్రుల్లో చేస్తున్న ప్రసవాల్లో 85 శాతానికి పైగా శస్త్రచికిత్సలే ఉంటుండగా సాధారణ కాన్పులు 13 శాతానికి పరిమితం అవుతున్నాయి. దీన్ని బట్టి చూస్తే ఆయా కేంద్రాలకు వచ్చే గర్భిణులకు ఏ మాత్రం అవగాహన కల్పించడం లేదని అర్థమవుతోంది. శస్త్రచికిత్సతో వచ్చే ఆదాయాన్ని చూసుకుంటున్నారు తప్పితే.. బాధితులకు భవిష్యత్తులో ఎదురయ్యే అనర్థాల గురించి వివరించడం లేదని తెలిసింది.

జిల్లాలోని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో సాధారణ, శస్త్రచికిత్సలు దాదాపు సమానంగా ఉంటున్నాయి. గతంలో వీటి వ్యత్యాసం భారీగా ఉండగా ప్రస్తుత వైద్యులకు సమయం లేకపోవడం, ఓపిక ఉండకపోవడంతో కోతలపై మొగ్గుచూపుతున్నారు. ఇక్కడ జరిగిన సాధారణ ప్రసవాలు ఎక్కువశాతం స్టాఫ్‌నర్సుల చొరవ తీసుకోవడంతో జరిగినవి తప్పితే వైద్యుల పాత్ర శూన్యమని సంబంధితశాఖ సిబ్బందే తెలుపుతుండటం విశేషం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని