logo

గృహలక్ష్మిపై.. లక్ష సందేహాలు

పేద, మధ్యతరగతి వర్గాల సొంతింటి కలను నెరవేర్చేలా ప్రభుత్వం ‘గృహలక్ష్మి’ పథకం అమలుకు శ్రీకారం చుట్టింది.

Updated : 09 Aug 2023 05:14 IST

దరఖాస్తుల స్వీకరణకు ఇంకా రెండు రోజులే గడువు..
తొలిరోజు 3,379 స్వీకరణ

న్యూస్‌టుడే, ఆదిలాబాద్‌పాలనాప్రాంగణం :పేద, మధ్యతరగతి వర్గాల సొంతింటి కలను నెరవేర్చేలా ప్రభుత్వం ‘గృహలక్ష్మి’ పథకం అమలుకు శ్రీకారం చుట్టింది. మంగళవారం నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ మొదలైంది. ఈ నెల 10 తుదిగడువు విధించడంతో అందరిలో అయోమయం నెలకొంది. దరఖాస్తుకు ఏ పత్రాలు జతచేయాలో.. ఎవరి పేరిట దరఖాస్తు చేసుకోవాలో తెలియక ఇబ్బందులు పడాల్సి వచ్చింది. తొలిరోజున 3,379 మంది దరఖాస్తులు సమర్పించారు.

సొంత స్థలం ఉండి పక్కాగృహం లేని బలహీనవర్గాల కుటుంబాలు గృహలక్ష్మి పథకం కింద దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. రూ.3 లక్షల నగదును లబ్ధిదారు బ్యాంకు ఖాతాల్లో మూడు విడతల్లో జమ చేయాలని నిర్ణయించింది. దరఖాస్తుల సమర్పణకు కేవలం మూడు రోజులే గడువు ఇవ్వడం అందరిలో అనుమానాలను రేకెత్తిస్తోంది. దరఖాస్తుకు ఏ పత్రాలు జత చేయాలో తెలుసుకునేందుకు సంబంధీకులు కార్యాలయాలకు తరలివచ్చారు. మూడు రోజుల్లో ఒకరోజు ముగిసిపోయింది. ఇంకా రెండు రోజులే మిగిలి ఉండటంతో ఆయాపత్రాల సేకరణకు ఉరుకులు, పరుగులు పెడుతున్నారు. కుల, వార్షికాదాయ వివరాలను అడగడం.. ఇళ్ల కేటాయింపుల్లో కులాల వారీగా రిజర్వేషన్లు ఉండటంతో ఆ పత్రాలు లేనివారిలో ఆందోళన వ్యక్తమవుతోంది. గడువులోగా ఆ పత్రాలు వస్తాయో, రావో అన్న మీమాంస వారిని వెంటాడుతోంది.

ఇవీ జత చేయాలి!

నిర్ణీత దరఖాస్తుకు రెండు పాస్‌పోర్ట్‌సైజు ఫొటోలు, ఆహార భద్రత కార్డు, ఓటరుకార్డు, ఆధార్‌కార్డు, ఇంటి స్థల దస్తావేజులు, ఇంటిపన్ను రసీదు, విద్యుత్తు బిల్లు రసీదు, బ్యాంకు పాస్‌బుక్‌ జిరాక్సు ప్రతులను జత చేయాలి. దివ్యాంగులైతే సదరం సర్టిఫికెట్నూ సమర్పించాలి.

ప్రతి తహసీల్దార్‌ కార్యాలయంలో  

జిల్లాలోని 18 తహసీల్దార్‌ కార్యాలయాల్లో ప్రజల నుంచి గృహలక్ష్మి దరఖాస్తులు తీసుకునేలా ప్రత్యేక కౌంటర్లను మంగళవారం ప్రారంభించారు.

మహిళ పేరిట చేయాలి: ఆర్డీవో స్రవంతి

ఇంటిస్థలం ఉన్నవారు మాత్రమే అర్హులు. దస్తావేజులు మగవారి పేరిట ఉన్నా మహిళ పేరిట మాత్రమే దరఖాస్తులు స్వీకరిస్తారు. విచారణ సమయంలో దరఖాస్తుదారుతో ఉన్న సంబంధాన్ని నిర్ధారిస్తారు. గ్రామీణులైతే తహసీల్దార్‌ కార్యాలయంలో, పట్టణవాసులు మున్సిపాలిటీ కార్యాలయంలో దరఖాస్తులను అందజేయాలి.

22 అంశాలతో దరఖాస్తు!

గృహలక్ష్మి కోసం దరఖాస్తు పేరిట అందులో 22 అంశాలను పొందుపరిచేలా రూపొందించారు. ఇంటి స్థలం ఉంటేనే దరఖాస్తు చేసుకునేందుకు అర్హులని నిర్దేశించారు.

తొలిరోజునే బారులు!

ఆదిలాబాద్‌ మున్సిపల్‌ కార్యాలయానికి తొలిరోజునే గృహలక్ష్మి దరఖాస్తుదారులు వరుస కట్టారు. మొత్తం 49 వార్డుల దరఖాస్తులను ఇక్కడే స్వీకరిస్తుండటంతో సందడి నెలకొంది. వృద్ధులు, దివ్యాంగులు ఇబ్బందులు పడకుండా కార్యాలయ కింది గదిలోనే ప్రత్యేక కౌంటరును తెరిచారు.

అంతా అయోమయం!

వీరంతా మావల మండలం బట్టిసావర్గాం పంచాయతీ దుబ్బగూడ కాలనీవాసులు. తొలిరోజున కార్యాలయానికి వచ్చిన వీరంతా దరఖాస్తుకు ఏం జత చేయాలో తెలియక గంటల తరబడి నిరీక్షించారు. అక్కడి సిబ్బంది సూచనలతో ఆయా పత్రాల కోసం తిరిగి ఇళ్లకు వెళ్లి తెచ్చారు.

రెండు కౌంటర్లు..!

కలెక్టరేట్లో రెండు కౌంటర్లను ఏర్పాటు చేసి దరఖాస్తులు స్వీకరించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చే వారితోపాటు ఆదిలాబాద్‌ రెవెన్యూ డివిజన్‌ పరిధిలోని 14 మండలాల దరఖాస్తులు స్వీకరణకు వేర్వేరు కౌంటర్లు ఏర్పాటు చేశారు. అనంతరం మండలాలవారీగా వాటిని వేరుచేసి ఆయా తహసీల్దార్‌ కార్యాలయాలకు పంపించనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని