logo

భోరజ్‌, సాత్నాల మండలాల ఏర్పాటు

ఆదిలాబాద్‌ జిల్లా మండలాల ముఖచిత్రం మారనుంది. ప్రస్తుతం 18 మండలాలతో ఉన్న ఆదిలాబాద్‌లో ఇటీవలే బోథ్‌ నుంచి వేరుచేసి కొత్తగా సొనాల మండలాన్ని ఏర్పాటు చేశారు.

Updated : 20 Aug 2023 05:53 IST

మారిన ఆదిలాబాద్‌ జిల్లా ముఖచిత్రం

న్యూస్‌టుడే, ఆదిలాబాద్‌ పట్టణం, జైనథ్‌, బేల: ఆదిలాబాద్‌ జిల్లా మండలాల ముఖచిత్రం మారనుంది. ప్రస్తుతం 18 మండలాలతో ఉన్న ఆదిలాబాద్‌లో ఇటీవలే బోథ్‌ నుంచి వేరుచేసి కొత్తగా సొనాల మండలాన్ని ఏర్పాటు చేశారు. తాజాగా అతిపెద్ద మండలమైన జైనథ్‌లోని మెజార్టీ గ్రామాలు, బేల, ఆదిలాబాద్‌ గ్రామీణ మండలాల్లోని కొన్ని గ్రామాలు కలిసి కొత్తగా రెండు మండలాలు రూపుదిద్దుకున్నాయి. ఈ మేరకు సాత్నాల, భోరజ్‌ మండలాలను ఏర్పాటుచేస్తు ప్రభుత్వం నుంచి జీఓ ఆర్‌.టి.నెం.268 పేరిట శనివారం రెవెన్యూ(జిల్లా పరిపాలన) శాఖ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఫలితంగా మండలాల సంఖ్య 21కి పెరిగాయి. 

పరిపాలన సౌలభ్యం కోసం కొత్త జిల్లాలను గతంలో ఏర్పాటుచేసిన ప్రభుత్వం దానికి తగ్గట్లుగానే కొత్త మండలాలు ఆవిర్భవించాయి. ఇదే సమయంలో డిమాండ్‌ వచ్చిన చోట మళ్లీ నూతన మండలాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగానే బోథ్‌ నుంచి సొనాల కొత్త మండలాన్ని ఏర్పాటు చేశారు. వైశాల్యం, జనాభాపరంగా పెద్ద మండలమైన జైనథ్‌ను విభజించాలని ఏళ్ల నుంచి డిమాండ్‌ ఉంది. సర్పంచులు, ఎంపీటీసీలు, మండల వాసులు తమ గళం వినిపించారు. స్థానిక ఎమ్మెల్యే జోగు రామన్నది ఇదే మండలం కావడంతో ప్రజల అభీష్టాన్ని నెరవేర్చాలని సీఎం కేసీఆర్‌కు నివేదించారు. రెండు నెలల కిందట ఆసిఫాబాద్‌కు వచ్చిన సీఎం కేసీఆర్‌కు మరోమారు ఎమ్మెల్యే కొత్త మండలాలపై ప్రత్యేకంగా విన్నవించడంతో సీఎం అదేరోజు హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీకి తగ్గట్లుగానే కొత్త మండలాలను ఏర్పాటుచేస్తు ఉత్తర్వులు జారీ అయ్యాయి.

మూడుగా విడిపోయిన జైనథ్‌

జిల్లాలోనే 55 గ్రామాలతో అతిపెద్ద మండలంగా ఉన్న జైనథ్‌ను మూడు భాగాలుగా విభజించారు. ఇందులో 28 గ్రామాలతో భోరజ్‌ మండలం ఆవిర్భవించింది. ఇదే మండలం నుంచి 7 గ్రామాలను సాత్నాల మండలంలో కలిపారు. జైనథ్‌ మండలం 20 గ్రామాలకు పరిమితమైంది. భోరజ్‌ కేంద్రంగా భోరజ్‌ మండలం, జైనథ్‌ కేంద్రంగా జైనథ్‌ మండల కార్యకలాపాలు కొనసాగనున్నాయి.

అభ్యంతరాల  స్వీకరణ

ఎవరికైన అభ్యంతరాలుంటే మార్పులు చేర్పుల కోసం 15 రోజుల్లోగా అర్జీలు స్వీకరిస్తారు.  ఇందుకు ఆయా గ్రామస్థాయి, మండల, డివిజన్‌, జిల్లాస్థాయిలో తమ సమస్యను విన్నవించవచ్చని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. తెలుగు, ఆంగ్లం, ఉర్దూ భాషల్లో ఫిర్యాదులు స్వీకరిస్తారు.

తొలుత జిల్లాలో 13 మండలాలే..

ఉమ్మడి ఆదిలాబాద్‌ నాలుగు జిల్లాలుగా విడిపోయినప్పుడు 13 మండలాలతో కొత్త ఆదిలాబాద్‌ జిల్లా రూపుదిద్దుకుంది. ఆ తరువాత భీంపూర్‌, సిరికొండ, గాదిగూడ, మావల, ఆదిలాబాద్‌ అర్బన్‌ అయిదు కొత్త మండలాలు ఆవిర్భవించడంతో మండలాల సంఖ్య 18కి చేరింది. తాజాగా సొనాల, భోరజ్‌, సాత్నాల మండలాలతో జిల్లాలో మండలాల సంఖ్య 21 పెరగడం వల్ల పరిపాలన మరింత సులభతరం కానుంది. కొత్త మండలాలు ఏర్పాటు కావడంతో ఎమ్మెల్యే జోగు రామన్న సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

ప్రాజెక్టు పేరుతో సాత్నాల

సాత్నాల మండలం కోసం మూడు మండలాలను కదిలించాల్సి వచ్చింది. ఇందులో జైనథ్‌ మండలంలోని 7, ఆదిలాబాద్‌ గ్రామీణ మండలం 4, బేల మండలం 7 గ్రామాలను ఒకేచోట కలిపారు. మొత్తం 18 గ్రామాలతో సాత్నాల ఆవిర్భవించింది. సాత్నాల ప్రాజెక్టు ఉండడంతో అదే పేరుతో మండలానికి నామకరణం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని