logo

కారుకు బైబై.. చేయికి సై..!

 రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడంతోపాటు నిర్మల్‌, ముథోల్‌ స్థానాలను భాజపా, ఖానాపూర్‌ను కాంగ్రెస్‌ పార్టీ కైవసం చేసుకుంది. ఈ మూడు నియోజకవర్గాల్లోనూ భారాస అభ్యర్థులు ఓటమి చెందడంతో ఆ పార్టీ శ్రేణులు అంతర్మథనంలో పడ్డారు

Updated : 12 Dec 2023 09:43 IST

నిర్మల్‌ ‘పుర’ ఛైర్మన్‌తో సహా మెజార్టీ కౌన్సిలర్లు కాంగ్రెస్‌లో చేరే అవకాశం

జిల్లాలో మారుతున్న రాజకీయ సమీకరణాలు

 

నిర్మల్‌, న్యూస్‌టుడే : రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడంతోపాటు నిర్మల్‌, ముథోల్‌ స్థానాలను భాజపా, ఖానాపూర్‌ను కాంగ్రెస్‌ పార్టీ కైవసం చేసుకుంది. ఈ మూడు నియోజకవర్గాల్లోనూ భారాస అభ్యర్థులు ఓటమి చెందడంతో ఆ పార్టీ శ్రేణులు అంతర్మథనంలో పడ్డారు. రాష్ట్రంలో అధికారంలో లేకపోవడం, స్థానికంగా పార్టీ అభ్యర్థులు కూడా గెలవకపోవడంతో భారాస పార్టీకి చెందిన స్థానిక సంస్థల మెజార్టీ ప్రజాప్రతినిధులు ప్రత్యామ్నాయంగా ‘చేయి’ పట్టుకునే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ‘కారు’ దిగి ‘హస్తం’ గూటికి చేరేందుకు నిర్మల్‌ పురపాలక సంఘం ఛైర్మన్‌తోపాటు మెజార్టీ కౌన్సిలర్లు కాంగ్రెస్‌ పార్టీకి చెందిన జిల్లాలోని సీనియర్‌ నాయకులతో మంతనాలు జరుపుతున్నట్లు తెలిసింది.  

కాంగ్రెస్‌, భాజపాల్లో చేరడానికి సుముఖత...

నిర్మల్‌ పురపాలక సంఘంలో 42 వార్డులు ఉండగా.. 2020 జనవరిలో జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లో భారాస పార్టీ 30, కాంగ్రెస్‌ 7, ఏఐఎంఐఎం రెండు స్థానాలు కైవసం చేసుకోగా.. స్వతంత్రులు ఇద్దరు, భాజపా నుంచి ఒక్కరు గెలుపొందారు. కొన్ని నెలలు గడిచిన తర్వాత కాంగ్రెస్‌ పార్టీ నుంచి గెలిచిన కౌన్సిలర్లు ఒక్కొక్కరూ పార్టీలు మారారు. ప్రస్తుతం కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఒక్క కౌన్సిలర్‌ కూడా లేరు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడంతో ఆ పార్టీలో చేరేందుకు భారాసకు చెందిన 16 మంది కౌన్సిలర్లు సుముఖత వ్యక్తం చేస్తున్నారు. మిగతా 14 మందిలో ఒకరు మూన్నెళ్ల క్రితం భాజపాలో చేరగా.. మరో ఆరుగురు కూడా అందులో చేరడానికి ఆసక్తి చూపిస్తున్నారు. మిగిలిన ఏడుగురు ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. నిర్మల్‌ పట్టణంలో చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించి దాదాపు రూ.12 కోట్ల నిధులు ప్రభుత్వం విడుదల చేయాల్సి ఉండటంతోపాటు రానున్న రోజుల్లో కొత్తగా చేపట్టాల్సిన పనులకు నిధులు మంజూరు చేయించుకోవాలంటే కాంగ్రెస్‌ పార్టీలో చేరడం ఉత్తమమనే అభిప్రాయానికి భారాస కౌన్సిలర్లు వచ్చినట్లు తెలిసింది. వీరంతా మున్సిపల్‌ ఛైర్మన్‌ గండ్రత్‌ ఈశ్వర్‌పై కూడా కాంగ్రెస్‌ పార్టీలో చేరాలని ఒత్తిడి తీసుకొచ్చారని, ఆయన కూడా అంగీకారం తెలిపినట్లు సమాచారం. త్వరలోనే హస్తం గూటికి చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నామని భారాస పార్టీ చెందిన పలువురు కౌన్సిలర్లు బాహాటంగా చెబుతున్నారు. ఇటీవల శాసనసభ ఫలితాల్లో పాత పట్టణంలోని అయిదారు వార్డుల్లో భాజపాకు బాగా మెజార్టీ వచ్చింది. ఓ వర్గానికి సంబంధించి ఓట్లు గంపగుత్తగా పడటంతో ప్రస్తుతం ఆయా వార్డులకు భారాస నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న కౌన్సిలర్లు భాజపాలో చేరేందుకు ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. త్వరలో ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి సమక్షంలో కమలం గూటిలో చేరనున్నట్లు సమాచారం. ఓ వైపు భారాస కౌన్సిలర్లు కాంగ్రెస్‌, భాజపాల వైపు చూస్తుండగా.. మరోవైపు మున్సిపల్‌ ఛైర్మన్‌ గండ్రత్‌ ఈశ్వర్‌పై అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చేందుకు కొందరు కౌన్సిలర్లు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. కొద్ది నెలల క్రితం భాజపాలో చేరిన కౌన్సిలర్‌ ప్రస్తుతం ఏ పార్టీలో చేరేందుకు ఇష్టపడని వారితోపాటు భాజపాలో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్న వారిని, భారాసలో ఉన్న మరికొందరి మద్దతు కూడగట్టే పనిలో నిమగ్నం కావడంతో శాసనసభ ఎన్నికలు ముగిసినా నిర్మల్‌లో రాజకీయ వేడి తగ్గడంలేదు.

ఖానాపూర్‌ మున్సిపల్‌ ఛైర్మన్‌పై అవిశ్వాస తీర్మానం..?

కొత్తగా ఏర్పడిన ఖానాపూర్‌ పట్టణంలో 12 వార్డులు ఉండగా.. అప్పుడు జరిగిన ఎన్నికల్లో భారాస ఆరు, కాంగ్రెస్‌ అయిదు, ఒక స్థానంలో భాజపా గెలుపొందింది. గతేడాది ఇక్కడి మున్సిపల్‌ ఛైర్మన్‌ అంకం రాజేందర్‌పై తొమ్మిది మంది కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మాన నోటీసును అప్పటి జిల్లా పాలనాధికారి వరుణ్‌రెడ్డికి అందజేశారు. ఆ సమయంలో రాష్ట్రవ్యాప్తంగా చాలా పురపాలక సంఘాల ఛైర్మన్లపై అవిశ్వాస తీర్మానాల అలజడి నెలకొనగా.. కొత్త మున్సిపల్‌ చట్టం ప్రకారం ‘పుర’పాలకవర్గం కొలువుదీరి నాలుగేళ్లు పూర్తయితేనే అవిశ్వాస తీర్మాన నోటీసు ఇచ్చే అవకాశం ఉంది. ఆ సమయంలోనే అవిశ్వాస తీర్మాన నోటీసులపై ప్రభుత్వం స్పందించలేదు. వచ్చే జనవరి నెలాఖరుతో నాలుగేళ్ల ‘పుర’పాలన ముగియనున్న నేపథ్యంలో ఖానాపూర్‌ మున్సిపల్‌ ఛైర్మన్‌పై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు ఇక్కడి పురపాలక సంఘంలో తొమ్మిది మంది కౌన్సిలర్లు సమాయత్తమవుతున్నట్లు తెలిసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని