logo

చరవాణులకు బానిస కావొద్దు

మహిళలు, విద్యార్థినులు సాధికారత సాధనే ధ్యేయంగా కృషి చేయాలని రాష్ట్ర మహిళా కమిషన్‌ సభ్యురాలు కుమ్ర ఈశ్వరీబాయి సూచించారు.

Published : 14 Dec 2023 04:47 IST

మాట్లాడుతున్న రాష్ట్ర మహిళా కమిషన్‌ సభ్యురాలు ఈశ్వరీబాయి, చిత్రంలో డీఎల్‌ఎస్‌ఏ కార్యదర్శి క్షమా దేశ్‌పాండె  

ఎదులాపురం, న్యూస్‌టుడే : మహిళలు, విద్యార్థినులు సాధికారత సాధనే ధ్యేయంగా కృషి చేయాలని రాష్ట్ర మహిళా కమిషన్‌ సభ్యురాలు కుమ్ర ఈశ్వరీబాయి సూచించారు. స్థానిక జడ్పీ సమావేశ మందిరంలో బుధవారం దళిత్‌ స్త్రీ శక్తి కేంద్రం ఆధ్వర్యంలో స్త్రీలపై హింసకు వ్యతిరేకంగా ప్రచారోద్యమంలో భాగంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విద్యార్థినులు చరవాణులకు బానిసలు కాకుండా చదువుపై దృష్టి సారిస్తే సాధికారత సాధించగలుగుతారన్నారు. దళిత్‌ స్త్రీ శక్తి జాతీయ కన్వీనర్‌ గడ్డం ఝాన్సీ మాట్లాడుతూ మహిళలు, విద్యార్థినులు సమస్యలు వచ్చినప్పుడు, వేధింపులకు గురైతే మనోధైర్యం సడలకుండా వాటిని ఎదుర్కోవటానికి సిద్ధం కావాలని, అవసరమైతే డయల్‌ 100కు సమాచారం అందిస్తే వారు స్పందించి అవసరమైన సాయం వెంటనే అందిస్తారని సూచించారు. డీఎల్‌ఎస్‌ఏ కార్యదర్శి క్షమా దేశ్‌పాండె మాట్లాడుతూ మహిళలకు ఎలాంటి న్యాయపరమైన సహాయం, సూచనలు అందించటానికైనా సిద్ధంగా ఉన్నామన్నారు. బాలికలు ప్రదర్శించిన నాటికలు ఆకట్టుకున్నాయి. డీఈఓ ప్రణీత, ఐసీడీఎస్‌ పీడీ మిల్కా, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ పి.సాధన, సీడబ్ల్యూసీ ఛైర్మన్‌ వెంకటస్వామి, సభ్యుడు సమీర్‌ఉల్లాఖాన్‌, డీసీపీఓ రాజేంద్రప్రసాద్‌, దళిత్‌ స్త్రీ శక్తి జిల్లా సమన్వయకర్త యశోద, చైల్డ్‌ లైన్‌ సమన్వయకర్త సతీష్‌, లీగల్‌ అడ్వైజర్‌ మంజుల, టీఎంసీ భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని