logo

ఎమ్మెల్యే ఫిర్యాదు చేసినా పట్టించుకోరా?: ఏలేటి

గత ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి హయాంలో ప్రభుత్వ భూములను విచ్చలవిడిగా చెరబట్టారని ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి మరోసారి ఆరోపించారు.

Updated : 29 Mar 2024 06:23 IST

మాట్లాడుతున్న ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి

నిర్మల్‌ పట్టణం, న్యూస్‌టుడే: గత ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి హయాంలో ప్రభుత్వ భూములను విచ్చలవిడిగా చెరబట్టారని ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి మరోసారి ఆరోపించారు. స్థానిక క్యాంపు కార్యాలయంలో గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. భూ కబ్జాలపై అన్ని ఆధారాలతో ఎమ్మెల్యేగా తాను స్వయంగా జిల్లా పాలనాధికారికి ఫిర్యాదుచేసినా చర్యలు లేకపోవడం సిగ్గుచేటన్నారు. ఓ పక్క ఆక్రమణలు వాస్తవమేనని అంగీకరిస్తూనే చర్యలకు వెనుకడుగు వేయడం విడ్డూరంగా ఉందన్నారు. అమ్మినవారి వివరాలేవీ లేకుండా కేవలం కొన్నవారి పేర్లు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. విచారణ పేరిట కాలయాపన చేస్తూ ఆక్రమిత భూముల్లో నిర్మాణాలు పూర్తయ్యేందుకు అధికారులే సహకరిస్తున్నారని విమర్శించారు. నిర్మాణాలు ప్రారంభించినంత మాత్రాన వదిలేస్తామనే భావన వద్దని, ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వ స్థలాల్లో జరిగిన నిర్మాణాలను కూల్చేసే వరకు పోరాటాలు కొనసాగిస్తామని, అర్హులైన పేదలకు పంపిణీ చేస్తామని స్పష్టంచేశారు. భవిష్యత్తు అవసరాల కోసం ప్రభుత్వస్థలం ఏమాత్రం లేకుండా కబ్జాలకు పాల్పడ్డారని, ఏ అంశాన్ని వదిలిపెట్టబోమన్నారు. బాధ్యుల్లో మంత్రి కుటుంబసభ్యులు, అధికారులు ఎవరున్నా చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే నల్ల ఇంద్రకరణ్‌రెడ్డి, భాజపా జిల్లా అధ్యక్షుడు అంజుకుమార్‌రెడ్డి, నాయకులు రావుల రాంనాథ్‌, సాదం అరవింద్‌, అల్లం భాస్కర్‌, వొడిసెల అర్జున్‌, వీరేశం, వెంకటేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

మహిళపై దాడి హేయం

నిర్మల్‌ పట్టణం: హోలీ సందర్భంగా హైదరాబాద్‌ చెంగిచెర్లలో గిరిజన మహిళపై ఓ వర్గం వ్యక్తులు దాడిచేయడం హేయమైన చర్య అని భాజపా శాసనసభాపక్షనేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి అన్నారు. బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన భాజపా ఎంపీ బండి సంజయ్‌, ఇతర నేతలపై కేసులు పెట్టడం, గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను గృహనిర్బంధం చేయడం దారుణమని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని