logo

వడ్డీ వ్యాపారుల ఇళ్లలో పోలీసుల దాడులు

మంచిర్యాల పట్టణంలో నిబంధనలు అతిక్రమించి అధిక వడ్డీలకు డబ్బులు ఇస్తూ పలువురిని వేధిస్తున్న ఫైనాన్స్‌ నిర్వాహకులపై కేసు నమోదు చేసినట్లు సీఐ బన్సీలాల్‌ తెలిపారు.

Published : 16 Apr 2024 02:37 IST

మంచిర్యాల నేరవిభాగం, న్యూస్‌టుడే: మంచిర్యాల పట్టణంలో నిబంధనలు అతిక్రమించి అధిక వడ్డీలకు డబ్బులు ఇస్తూ పలువురిని వేధిస్తున్న ఫైనాన్స్‌ నిర్వాహకులపై కేసు నమోదు చేసినట్లు సీఐ బన్సీలాల్‌ తెలిపారు. ఎస్‌కే ఫైనాన్స్‌, సీసీసీ నస్పూర్‌కు చెందిన ఎస్‌కే ఇమ్రాన్‌ నుంచి రూ.7.64 లక్షల నగదు, 76 ప్రామిసరీ నోట్లు 16 బ్లాంక్‌ చెక్కులను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ పేర్కొన్నారు.

చెన్నూరు: చెన్నూరు పట్టణంలో అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న ఫైనాన్స్‌, వడ్డీ, చీటీల వ్యాపారుల కార్యాలయాలు, ఇళ్లల్లో సోమవారం పోలీసులు ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. పట్టణంలోని పద్మనగర్‌ కాలనీకి చెందిన మామిడాల లక్ష్మినారాయణ అనే వ్యక్తి ఇంట్లో సోదాలు నిర్వహించగా అతడి వద్ద 5 ఖాళీ చెక్కులు, అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న చీటీ వ్యాపారానికి సంబంధించిన రికార్డులను స్వాధీనం చేసుకున్నట్లు పట్టణ సీఐ రవీందర్‌ తెలిపారు. ఈ మేరకు అతడిపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. చెన్నూరు, జైపూర్‌ ఎస్సైలు వెంకటేశ్వర్‌రావు, శ్రీధర్‌, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.


గొలుసు దొంగతనం

నిర్మల్‌ పట్టణం, న్యూస్‌టుడే: వివాహిత మెడలోంచి బంగారు గొలుసు అపహరించిన ఘటన జిల్లాకేంద్రంలో చోటుచేసుకుంది. పట్టణ సీఐ అనిల్‌ తెలిపిన ప్రకారం.. స్థానిక శాస్త్రినగర్‌కు చెందిన యమున అనే మహిళ పరామర్శ నిమిత్తం వేరే గ్రామంలో ఉంటున్న బంధువుల ఇంటికి వెళ్లారు. సోమవారం మధ్యాహ్నం ఇంటికి తిరిగొచ్చే క్రమంలో శివాజీచౌక్‌ వద్ద బస్సు దిగి నడుచుకుంటూ వెళ్తున్నారు. ఆ సమయంలో ద్విచక్రవాహనంపై వచ్చిన ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు అదునుచూసి ఆమె మెడలోని 2 తులాల బంగారు గొలుసును లాక్కొని అక్కడ్నుంచి పరారయ్యారు. చైన్‌ లాగే క్రమంలో ఆమె అదుపుతప్పి కిందపడటంతో స్వల్పగాయాలయ్యాయి. కేకలు వేసినా ఫలితం లేకపోయింది. పోలీసులకు సమాచారం అందించారు. సీసీ టీవీలో నమోదైన దృశ్యాల ఆధారంగా నిందితులను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. కేసు నమోదుచేసినట్లు సీఐ వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని