logo

బాప్‌రే.. బంగారం..!

బంగారం.. అన్నివర్గాల ప్రజలకు.. ప్రధానంగా అతివలకు ఇష్టమైన అంశం. నాలుగు డబ్బులు జమైతే కొంతైనా కొనిపెట్టుకోవాలన్న ఆలోచన చేస్తుంటారు

Updated : 16 Apr 2024 06:15 IST

ఎక్కడ చూసినా ఇదే చర్చ
రూ. 75 వేలు దాటిన 10 గ్రాముల ధర

నిర్మల్‌ పట్టణం, న్యూస్‌టుడే: బంగారం.. అన్నివర్గాల ప్రజలకు.. ప్రధానంగా అతివలకు ఇష్టమైన అంశం. నాలుగు డబ్బులు జమైతే కొంతైనా కొనిపెట్టుకోవాలన్న ఆలోచన చేస్తుంటారు. ఇంట్లో ఆడపిల్లలుంటే ముందు నుంచే కొద్దికొద్దిగానైనా పోగు చేస్తుంటారు. పెళ్లిళ్లు, శుభకార్యాలకు వెళ్లేటపుడు నగానట్రా లేకుంటే అసంతృప్తికి గురవుతుంటారు. ఆడవారికి పసిడితో ఉన్న బంధాన్ని ఎంత చెప్పుకున్నా తక్కువే. కానీ, ప్రస్తుత పరిస్థితులు ఎవరికీ మింగుడుపడడం లేదు. కొంత కొందామన్నా అందనంత ఎత్తుకు ధర వెళ్తుండటంతో బాప్‌రే! బంగారం అంటూ బాధపడుతున్నారు. 10 గ్రాముల ధర ఏకంగా రూ.75 వేలు దాటడంతో ఎక్కడచూసినా దీనిపైనే చర్చ కనిపిస్తోంది.

ఇదీ సంగతి..

బంగారం ధరలపై చాలామందికి అవగాహన ఉండదు. ఎందుకు పెరుగుతాయో, ఎప్పుడు తగ్గుతాయో అంతుపట్టదు. మనం నిత్యం వాడే సరకులు, వస్తువుల ధరలు స్థానికంగా ఉండే పరిస్థితులపై ఆధారపడి ఉంటాయి. బంగారం మాత్రం అంతర్జాతీయ పరిస్థితులతో ముడిపడి ఉంటుంది. ద్రవ్య మారకపురేటు పైన ధర ఆధారపడి ఉంటుంది. దేశ ఆర్థిక వ్యవహారాల కోసం చెలామణిలో ఉన్న ద్రవ్య ప్రవాహం సైతం ప్రభావితం చేస్తుంది. మనదేశంలో పసిడిని ఆభరణ వస్తువుగా చూడటం కూడా ధరల పెరుగుదలకు కారణం. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఒడిదుడుకులు రావడం, దేశాల మధ్య యుద్ధ వాతావరణం, వ్యాపార ఒడంబడికలు విచ్ఛిన్నమవడం, ఎగుమతులు-దిగుమతుల సుంకాల్లో హెచ్చుతగ్గులు, ద్రవ్య ముద్రణ నియమాలు, చమురు దేశాల ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నమైన సందర్భాల్లోనూ స్వర్ణం ధరలో మార్పులు చోటుచేసుకుంటాయి.

వెండి తక్కువేం కాదు..

బంగారం ధర విపరీతంగా పరిగెడుతుంటే వెండి సైతం తానేం తక్కువ కాదంటూ ఉరకలెత్తుతోంది. అయిదేళ్ల క్రితం కిలో వెండి ధర రూ. 50 వేలు ఉండగా, ప్రస్తుతం రూ.84,000కు చేరింది. సామాన్యుల బంగారంగా పిలిచే ఈ రజతం వారికి అందకుండా పోతోంది. ముఖ్యంగా దీనిని కాళ్లపట్టీలు, మెట్టెలు, పిల్లల మొలతాళ్లకు అధికంగా వినియోగిస్తుంటారు. వీటికీ ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొంది.

ఎటొచ్చీ.. ‘వారికే’ ఇబ్బంది

ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డట్లుగా పసిడి పరిగెత్తి సామాన్యులు, మధ్యతరగతి ప్రజలు, చిన్న స్వర్ణకారులను ఇబ్బందులకు గురిచేస్తోంది. పెద్ద పట్టణాల్లో మెగా షోరూముల్లో ధరలు పెరిగినా గిరాకీలపై అంతగా ప్రభావం కనిపించడం లేదు. ఎన్నారైలు, ధనవంతులు తమ అవసరాలకు అనుగుణంగా ఇప్పటికీ కొనుగోళ్లు చేస్తున్నారు. సాధారణ కుటుంబాల వారు పెరిగిన బంగారం ధరను అందుకోలేక అక్కడే ఉండిపోతున్నారు. ఇలాంటి వారు కొనుగోలు చేయకపోవడంతో గ్రామీణ ప్రాంతాల్లో చిరు దుకాణాలు నిర్వహించే స్వర్ణకారుల ఉపాధికి గండం వాటిల్లుతోంది.

గల్ఫ్‌లో ధర తక్కువా!?

నిర్మల్‌ జిల్లా నుంచి ఉపాధి నిమిత్తం గల్ఫ్‌ దేశాలకు వెళ్లిన వారి సంఖ్య 20 వేలకు పైగానే ఉంటుంది. అక్కడి బంగారం నాణ్యంగా ఉంటుందని, ధర కాస్త తక్కువేనన్న అభిప్రాయం ఈ ప్రాంత ప్రజల్లో అధికôగా ఉంటుంది. అసలు దీని సంగతేంటని పరిశీలిస్తే.. ఉదాహరణకు.. దుబాయ్‌ ద్రవ్య ప్రమాణం దిరమ్‌. ప్రస్తుతం ఒక దిరమ్‌ మన దేశ ద్రవ్యప్రమాణాలలో రూ.22.40కి సమానం. పైగా అక్కడ మామూలు బంగారు బిస్కట్‌గా కొనుగోలు చేసే దానికన్నా ఆభరణాల రూపంలో కొంటే ధర తగ్గుతుంది. ఆ కారణంగా అక్కడ కొనుగోలు చేస్తే ధర కాస్త తక్కువగా ఉంటుంది. అది మన దగ్గరకు తీసుకొచ్చేసరికి కొద్దిగా వ్యత్యాసం ఏర్పడుతుంది. అంతర్జాతీయ ఒప్పందాల ప్రకారం పరిమిత పరిమాణంలో మాత్రమే అక్కడ నుంచి మన దేశానికి బంగారం తీసుకొచ్చేందుకు అనుమతి ఉంటుంది. ఆభరణం రూపంలో ఉన్న పసిడినే అధికారికంగా తెచ్చుకునే వెసులుబాటు ఉంటుంది. ఒకవేళ నికర బంగారాన్ని తెస్తే మన ధరకు అక్కడి ధరకు దాదాపు సమానంగానే ఉంటుంది.

వ్యాపారులకు నష్టమే: రఘువీర్‌, ఆభరణాల వ్యాపారి, నిర్మల్‌

పెరిగిన ధరలతో అందరూ ఇబ్బంది పడుతున్నారు. వ్యాపారులకూ నష్టంగా మారింది. ఒకరోజు వ్యవధిలోనే రెండు, మూడుసార్లు ధరల్లో వ్యత్యాసం రావడంతో ఆ తేడా ఒక్కోసారి మాపై భారంగా మారుతోంది. ఆభరణాల తయారీ కోసం కొన్ని సందర్భాల్లో వినియోగదారులకు విక్రయించిన ధరకన్నా అధికంగా చెల్లించి బంగారం కొనాల్సివస్తోంది. పరిస్థితి ఇలాగే ఉంటే కొనుగోళ్లు గణనీయంగా పడిపోతాయి. వ్యాపారులకే కాదు స్వర్ణకారులకూ ఉపాధి దెబ్బతింటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని