logo

ఓటు పోటెత్తేలా..!!

రెండక్షరాల ఓటు.. రాజ్యాంగం కల్పించిన హక్కు. సామాన్యుల చేతిలో వజ్రాయుధం. నే‘తల’రాతలు మార్చే ఆయుధం.

Published : 16 Apr 2024 02:44 IST

పోలింగ్‌ పెంచడానికి అధికార యంత్రాంగం కృషి
ఓటర్ల్లకు అవగాహన కల్పించేందుకు చైతన్య కార్యక్రమాలు

కొద్ది రోజుల క్రితం కలెక్టరేట్‌లో ముగ్గుల పోటీల ద్వారా పోలింగ్‌శాతం పెంపుపై అవగాహన కార్యక్రమాన్ని తిలకిస్తున్న జిల్లా పాలనాధికారి అశిష్‌ సంగ్వాన్‌

నిర్మల్‌, న్యూస్‌టుడే: రెండక్షరాల ఓటు.. రాజ్యాంగం కల్పించిన హక్కు. సామాన్యుల చేతిలో వజ్రాయుధం. నే‘తల’రాతలు మార్చే ఆయుధం. ఓటును సరిగ్గా సంధిస్తే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుంది. చక్కని పాలన అందుబాటులోకి వస్తుంది. సమస్యలు పరిష్కారం అవుతాయి. అందుకే పోలింగ్‌శాతం ఎక్కువగా నమోదయ్యేలా అధికార యంత్రాంగం కృషి చేస్తోంది. పలు చైతన్య కార్యక్రమాలతో ఓటును ప్రజలకు చేరువ చేస్తోంది.

ప్రధానంగా ఓటు విలువ తెలపడం, పోలింగ్‌ కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు కల్పించడం, ఓటర్లకు పోలింగ్‌ కేంద్రాలు అందుబాటులో ఉండేలా చూడటం, పోలింగ్‌రోజు ప్రశాంత వాతావరణం కల్పించడం, ఓటరు నిర్భయంగా ఓటువేసేలా అక్కడ పరిస్థితులు ఉండేలా అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. ఈ సారి జిల్లా వ్యాప్తంగా 85 శాతానికిపైగా ఓటింగ్‌ నమోదు చేయాలనే లక్ష్యంతో జిల్లా పాలనాధికారి అశిష్‌ సంగ్వాన్‌ ఆధ్వర్యంలో జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది.. ఓటుహక్కు వినియోగించుకునేలా పలు చైతన్య కార్యక్రమాలు చేపడుతోంది.

దివ్యాంగులకు ప్రత్యేక ఏర్పాట్లు

ఓటు.. నీతి నిజాయతీ, నిస్వార్థ, దార్శనికత గల పాలకుడిని ఎన్నుకునేందుకు ప్రతి ఒక్కరి చేతిలో వజ్రాయుధం. అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ ఓటుహక్కు వినియోగించుకునేలా అధికార యంత్రాంగం విస్తృత ప్రచారం చేయిస్తోంది. దివ్యాంగులకు ఓటుహక్కు ఉన్నా.. అచేతన స్థితిలో ఉండటంతో చాలా మంది బయటకు వెళ్లలేని పరిస్థితి ఉంది. వారికి ఓటు వేయాలనే ఉత్సాహంగా ఉన్నా.. సౌకర్యాలలేమితో హక్కును కోల్పోతున్న బాధ వారిని నిరాశకు గురిచేస్తోంది. ఈ సారి కేంద్ర ఎన్నికల సంఘం దివ్యాంగులపై ప్రత్యేక దృష్టి సారించింది. వారికి ఓటుహక్కు నమోదు చేయించడంతో పాటు వినియోగించుకునేందుకు సకల సౌకర్యాలు కల్పించాలని ఆదేశించింది. ఇప్పటికే జిల్లాలో 10,032 మంది దివ్యాంగులు ఉన్నట్లు గుర్తించారు. ఎలాంటి వైకల్యంతో ఉన్నారని తెలుసుకుని వారికి అవసరమైన సామగ్రి తెప్పించడంతో పాటు పోలింగ్‌కేంద్రాల్లో సౌకర్యాలు కల్పిస్తున్నారు. ప్రతి పోలింగ్‌ కేంద్రంలో వీల్‌ఛైర్‌ అందుబాటులో ఉంచుతున్నారు. నడవలేని స్థితిలో ఉన్నవారికి రవాణా సదుపాయం కల్పించనున్నారు.

వజ్రాయుధం.. కావాలి సద్వినియోగం

నా ఒక్క ఓటు వేయకపోతే ఏమవుతుందనే భావన వద్దు.. రెండక్షరాల ఓటు ప్రజాస్వామ్య దేశంలో వజ్రాయుధం. దీనికున్న శక్తి ఎంతో మహత్తరమైనది. ఈ దేశ పౌరునిగా, మనకు నచ్చిన నాయకుని నిర్భయంగా, నిష్పక్షపాతంగా ఎన్నుకునేందుకు దోహదం చేసే బృహత్తర అవకాశం. అందుకే అయిదేళ్లకోసారి వచ్చే ఎన్నికల సమయంలో ఓటుహక్కు ఉన్నవారంతా నాయకులకు దేవుళ్లుగా దర్శనమిస్తుంటారు. వారిని ప్రసన్నం చేసుకునేందుకు నానాతంటాలు పడుతుంటారు. అడిగిందల్లా ఇస్తామని, ఎంతో చేస్తామని హామీలను గుప్పిస్తారు. నమ్మించే ప్రయత్నంచేస్తారు. వీటికి ఏమాత్రం లొంగినా, ఆకర్షణలు, ఆర్భాటాల మత్తులో పడిపోయినా అనర్హుడిని అందలం ఎక్కించినవారమవుతాం. తెలిసితెలిసి మన భవితవ్యాన్ని వారికి ధారాదత్తం చేసినవారమవుతాం. మే 13న జరిగే పార్లమెంటు ఎన్నికల్లో నిర్భయంగా ఓటుహక్కు వినియోగించుకోవాలని అధికారులు విన్నవిస్తున్నారు.

ఇదీ లక్ష్యం..

ప్రతి పోలింగ్‌ కేంద్రం పరిధిలో 85 శాతానికిపైగా ఓటు నమోదు కావాలన్న లక్ష్యంతో ఆదర్శపోలింగ్‌ కేంద్రాల ఏర్పాటు తెరపైకి వచ్చింది. తక్కువ పోలింగ్‌ నమోదు అవుతున్న కేంద్రాల్లో ఓటు నమోదు శాతం పెంచేందుకు చర్యలు చేపట్టారు. నిరక్షరాస్యులు, దివ్యాంగులు, వృద్ధులు ఓటుహక్కు వినియోగించుకునేందుకు పెద్దగా ఆసక్తి చూపించడం లేదని అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఓటుహక్కు వినియోగంపై విస్తృత ప్రచారం కల్పిస్తున్నారు. స్వీప్‌ కార్యక్రమం, కళాబృందాలతో ఓటు విలువ తెలిపే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రతీసారి పోలింగ్‌శాతం తక్కువగా నమోదవుతున్న పట్టణాల్లో ఓటుహక్కు వినియోగించుకోవడానికి బ్యానర్లు ఏర్పాటు చేస్తున్నారు. ఈవీఎం, వీవీ ప్యాట్‌ల పనితీరుపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.  

1950 నెంబరులో సంప్రదిస్తే చాలు

ఓటు సమాచారం తెలుసుకునేందుకు అన్ని జిల్లాల్లోని పాలనాప్రాంగణాల్లో ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటుచేశారు. ఎవరైనా 1950 నెంబరుకు ఫోన్‌ చేసి ఓటరు జాబితాలో పేరుందో లేదో తెలుసుకోవచ్చు. చిరునామా చెబితే ఓటు ఏ పోలింగ్‌ కేంద్రంలో ఉందో తెలుపుతారు. ఇందులో సమాచారం, ఫిర్యాదులు, సలహాలు స్వీకరిస్తారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని