logo

చెత్త రహితంపై చిత్తశుద్ధి కరవు

జిల్లా కేంద్రంలో ఎక్కడ పడితే అక్కడ మళ్లీ చెత్త పోగవుతోంది. రహదారుల పక్కన, కూడళ్ల సమీపంలో, చెత్త కుండీల వద్ద అపరిశుభ్రత నెలకొంటోంది.

Published : 16 Apr 2024 02:53 IST

బల్దియాలో ఎక్కడ పడితే అక్కడ పోగవుతున్న వ్యర్థాలు

పాతహౌజింగ్‌బోర్డు కాలనీలో అపరిశుభ్రత

న్యూస్‌టుడే, ఆదిలాబాద్‌ అర్బన్‌: జిల్లా కేంద్రంలో ఎక్కడ పడితే అక్కడ మళ్లీ చెత్త పోగవుతోంది. రహదారుల పక్కన, కూడళ్ల సమీపంలో, చెత్త కుండీల వద్ద అపరిశుభ్రత నెలకొంటోంది. రెండేళ్ల కిందట బల్దియా అధికారులు పట్టణంలో చెత్త వేసే స్థలాల (గార్బేజ్‌ వల్నరబుల్‌ పాయింట్లు-జీవీపీ)ను గుర్తించారు. చెత్త రహిత పట్టణంగా తీర్చిదిద్దడంలో భాగంగా ప్రజలకు అవగాహన కల్పించి మార్పు తీసుకురావడమే ముఖ్య ఉద్దేశంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేశారు. ఈ ప్రయత్నం ఏడాదిపాటు సత్ఫలితాలు ఇచ్చింది. కాలక్రమంలో చెత్త రహిత ప్రాంతాల నిర్వహణ లోపం, ప్రజలు ఇష్టానుసారంగా చెత్తను పడేయడంతో సమస్య మళ్లీ మొదటికొచ్చింది. ఆ ప్రాంత పరిసరాలు అపరిశుభ్రంగా తయారయ్యాయి.

ప్రయత్నం మంచిదే అయినా..

పారిశుద్ధ్య కార్మికులు ఇంటింటికి తిరిగి చెత్తను సేకరిస్తున్నారు. సిబ్బంది వాహనాన్ని తీసుకొస్తే కాలనీవాసులు చెత్తను తెచ్చి వాహనంలో వేస్తారు. కొన్నిసార్లు సిబ్బంది వచ్చినపుడు ఇంట్లో వారు ఆలస్యంగా స్పందించడం, మరికొన్నిసార్లు సిబ్బందే ఆలస్యం కావడం తదితర కారణాలతో కాలనీల్లో రోడ్ల పక్కన, మూల మలుపుల వద్ద ఈ చెత్తకుప్పలు వెలుస్తున్నాయి. సిబ్బంది వచ్చి తీసుకెళ్లే దాకా అవి అలాగే ఉంటున్నాయి. సమస్యను గుర్తించిన అధికారులు రెండేళ్ల కిందట పట్టణంలో 49 చోట్ల గార్బేజ్‌ వల్నరబుల్‌ పాయింట్లను గుర్తించారు. అక్కడ చెత్త వేయకుండా మొక్కలు నాటి ట్రీగార్డులను అమర్చారు.

తెలంగాణ కూడలి సమీపంలో చెత్త ఎక్కువగా పోగు అవుతుండటంతో రెండేళ్ల కిందట ఈ ప్రాంతాన్ని చెత్త రహితంగా ప్రకటించి పరిశుభ్రంగా మార్చి మొక్కలు నాటారు.  

ప్రచారానికే హెచ్చరిక బోర్డులు..

చెత్త రహిత ప్రాంతాలుగా ప్రకటించిన చోట హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. ఇక్కడ చెత్త వేస్తే రూ.1,000 జరిమానా విధిస్తామని స్పష్టం చేశారు. ఈ ప్రాంతం సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉందని పేర్కొన్నారు. అయితే ఆయాచోట్ల ఎక్కడా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయకపోవడంతో వట్టి ప్రచారానికే బోర్డులను ఏర్పాటు చేశారనే విషయం బహిర్గతమైంది. దీంతో మళ్లీ కొందరు నిర్లక్ష్యంగా  ఆయా ప్రాంతాల్లో చెత్తను పడేస్తున్నారు. ఇప్పటిదాకా అక్కడ చెత్తను వేస్తున్న వారిని గుర్తించి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు.

చెత్త వేసిన వారిపై చర్యలు తీసుకోకపోవడంతో మళ్లీ ఆ ప్రాంతంలో ఇలా చెత్త పేరుకుపోయి అపరిశుభ్రంగా తయారైంది.

సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తాం

నరేందర్‌, శానిటరీ ఇన్‌స్పెక్టర్‌, బల్దియా

చెత్త రహిత ప్రాంతాల్లో మొదట్లో మంచి ఫలితాలు వచ్చాయి. సీసీ కెమెరాలు లేకపోవడంతో చెత్తవేసే వారిని గుర్తించలేకపోతున్నాం. దీంతో కొందరు నిర్లక్ష్యంగా అక్కడ చెత్తను పడేస్తున్నారు. అక్కడ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి ప్రజలకు మరోసారి అవగాహన కల్పిస్తాం. ఉల్లంఘించిన వారిపై జరిమానా వసూలు చేసేలా చర్యలు తీసుకుంటాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని