logo

కాంగ్రెస్‌లోకి వలసలు..

బోథ్‌ మాజీ ఎమ్మెల్యే రాఠోడ్‌ బాపురావు భాజపాకు రాంరాం చెప్పారు. జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి సీతక్క మధ్యవర్తిత్వంతో సోమవారం హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు.

Updated : 16 Apr 2024 06:07 IST

మాజీ ఎమ్మెల్యే బాపురావు, నిర్మల్‌ మున్సిపల్‌ ఛైర్మన్‌ చేరిక
ఈటీవీ - ఆదిలాబాద్‌  

బోథ్‌ మాజీ ఎమ్మెల్యే రాఠోడ్‌ బాపురావు భాజపాకు రాంరాం చెప్పారు. జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి సీతక్క మధ్యవర్తిత్వంతో సోమవారం హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. భారాస తరఫున 2014, 2018లో బోథ్‌ ఎమ్మెల్యేగా ఎన్నికైన రాఠోడ్‌ బాపురావుకు గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ టికెట్‌ నిరాకరించింది. అప్పట్లోనే ఆయన కాంగ్రెస్‌లో చేరాలని భావించినా బోథ్‌ ఎమ్మెల్యేగా బరిలో నిలిచిన ఎంపీ సోయం బాపురావు, అప్పటి పార్టీ జిల్లా అధ్యక్షుడు పాయల్‌ శంకర్‌ మధ్యవర్తిత్వం కారణంగా నవంబరు 1న భాజపాలో చేరారు. సోయం బాపురావు ఎమ్మెల్యేగా గెలిస్తే రాఠోడ్‌ బాపురావును ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టాలనే అంగీకారం మేరకే భాజపాలో చేరినట్లు ప్రచారం జరిగింది. సోయం బాపురావు సహా రాఠోడ్‌ బాపురావును కాకుండా భాజపా అధిష్ఠానం గోడం నగేష్‌కు అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది. వారిద్దరు పార్టీ కార్యక్రమాలకు హాజరుకావటం లేదు. భారాసలో ఉన్నప్పుడే తనతో విభేదించిన గోడం నగేష్‌ తిరిగి భాజపా అభ్యర్థి కావటంతో రాఠోడ్‌ బాపురావులో అంతర్మథనం నెలకొంది. చివరికి కాంగ్రెస్‌లో చేరడానికి మార్గం ఏర్పడింది. ‘‘సోయం బాపురావు, పాయల్‌ శంకర్‌, ఇచ్చోడకు చెందిన ముస్తాపురే అశోక్‌ మాటలు నమ్మి భాజపాలో చేరా. భారాసపై విమర్శలు చేసే భాజపా నేతలు ఆ పార్టీ నుంచి వచ్చిన నగేష్‌కు టికెట్‌ ఎలా ఇస్తారు? భాజపా టికెట్‌ కోసం దరఖాస్తు చేసుకున్న 42 మందిలో అర్హులే లేరా? అభ్యర్థిగా ఖరారైన గోడం నగేష్‌ కనీసం మర్యాద పూర్వకంగానైనా నన్ను సంప్రదించలేదు. అందుకే రాష్ట్రాభివృద్ధే లక్ష్యంగా కాంగ్రెస్‌లో చేరినట్లు’’ హైదరాబాద్‌లో ఉన్న రాఠోడ్‌ బాపురావు చరవాణిలో ‘ఈనాడు’తో చెప్పారు.

ఐకేరెడ్డి అనుచరులు..

మాజీ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అనుచరుల్లో ముఖ్య నేతలు మంత్రి సీతక్క, ఖానాపూర్‌ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, నిర్మల్‌ జిల్లా అధ్యక్షుడు శ్రీహరిరావు మధ్యవర్తిత్వంతో సోమవారం సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో చేరారు. నిర్మల్‌ మున్సిపల్‌ ఛైర్మన్‌ గండ్రత్‌ ఈశ్వర్‌, సారంగపూర్‌ మార్కెట్‌ కమిటీ మాజీ ఛైర్మన్లు రాజ్‌మహ్మద్‌, రవీందర్‌రెడ్డి, అడెల్లి పోచమ్మ ఆలయ కమిటీ మాజీ ఛైర్మన్‌ శ్రీనివాస్‌రెడ్డి సహా మరో 11 మంది భారాస కౌన్సిలర్లు కాంగ్రెస్‌లో చేరటం ఉమ్మడి జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఇంద్రకరణ్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరటానికి సుముఖంగానే ఉన్నా ఆ పార్టీ నేతల నుంచి వస్తున్న వ్యతిరేకత కారణంగా ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ(పీసీసీ) ఆచితూచి వ్యవహరిస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని