logo

భరోసా కోసం భారాస వ్యూహం..

శాసనసభ ఎన్నికల కంటే ముందు ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో భారత రాష్ట్ర సమితి(భారాస) తిరుగులేని రాజకీయశక్తిగా ఉండేది.

Published : 16 Apr 2024 02:55 IST

నేడు కేటీఆర్‌ రాక
ఈటీవీ - ఆదిలాబాద్‌  

శాసనసభ ఎన్నికల కంటే ముందు ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో భారత రాష్ట్ర సమితి(భారాస) తిరుగులేని రాజకీయశక్తిగా ఉండేది. మంత్రిగా ఇంద్రకరణ్‌రెడ్డి సహా మిగిలిన తొమ్మిది నియోజకవర్గాల్లో రాజకీయ అనుభవం కలిగిన ప్రజాప్రతినిధులతో ప్రత్యర్థి పార్టీలకు దీటుగా నిలిచింది. శాసనసభ ఎన్నికల్లో ఆసిఫాబాద్‌లో కోవ లక్ష్మి, బోథ్‌లో అనిల్‌ జాదవ్‌ ఎమ్మెల్యేలుగా విజయం సాధించగా చెన్నూరు - బాల్క సుమన్‌, నిర్మల్‌- ఇంద్రకరణ్‌రెడ్డి, ఆదిలాబాద్‌ - జోగు రామన్న, మంచిర్యాల- దివాకర్‌రావు, ముథోల్‌ - విఠల్‌రెడ్డి, ఖానాపూర్‌ - జాన్సన్‌ నాయక్‌, సిర్పూర్‌(టి) - కోనేరు కోనప్ప, బెల్లంపల్లి - దుర్గం చిన్నయ్య ఓటమి పాలవడంతో భారాస రాజకీయంగా బలహీనపడింది. దీనికి తోడు కీలక నేతలు ఒక్కొక్కరు పార్టీని వీడటం శ్రేణులను మరింత అంతర్మథనానికి గురి చేసింది. ఆదిలాబాద్‌లో జోగు రామన్న, ఎమ్మెల్యేలుగా కోవ లక్ష్మి, అనిల్‌ జాదవ్‌, ఎమ్మెల్సీ దండె విఠల్‌, అడపాదడపా బాల్కసుమన్‌, జాన్సన్‌ నాయక్‌ తప్పితే క్రియాశీలక నాయకత్వం కనిపించడం లేదు. ఎంపీగా పార్టీ అభ్యర్థి ఆత్రం సక్కు గెలుపుపై అగ్రనాయకత్వం దృష్టి సారించింది. ఇందులోభాగంగా తగిన వ్యూహాలు రచించేందుకు పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ మంగళవారం ఆదిలాబాద్‌లో క్రియాశీలక కార్యకర్తలతో సమావేశం నిర్వహించనున్నారు.

భారాస ఓట్ల లెక్కలు

శాసనసభ ఎన్నికల్లో ప్రచారంలో గతేడాది నవంబరు 26న చెన్నూరుకు వచ్చి వెళ్లిన తర్వాత కేటీఆర్‌ మళ్లీ ఉమ్మడి జిల్లాకు రావటం ఇదే ప్రథమం. నిస్తేజంలో ఉన్న పార్టీ శ్రేణుల్లో ఆయన పర్యటన తిరిగి ఉత్సాహం నింపుతుందని భారాస భావిస్తోంది. ఉమ్మడి జిల్లాలోని పది శాసనసభ స్థానాల పరిధిలో పార్టీల వారీగా తీసుకుంటే కాంగ్రెస్‌కు 6,34,389 ఓట్లతో మొదటి స్థానంలో నిలిస్తే 5,98,830 ఓట్లతో భారాస రెండోస్థానంలో, 4,95,977 ఓట్లతో భాజపా మూడోస్థానంలో నిలిచినట్లు గులాబీ దళం విశ్లేషిస్తోంది. అదే ఆదిలాబాద్‌ ఎంపీ పరిధిలోకి వచ్చిన ఓట్లను పరిశీలిస్తే 4,65,476 ఓట్లతో భారాస మొదటి స్థానంలో, 4,48,961 ఓట్లతో భాజపా రెండోస్థానంలో, 2,51,886 ఓట్లతో కాంగ్రెస్‌ మూడో స్థానంలో నిలిచాయి. కీలక నేతలు పార్టీలు మారినా ప్రజలకు భారాసపై ఉన్న నమ్మకానికి అనుగుణంగా క్షేత్రస్థాయిలో కార్యకర్తలు అంకితభావంతో పనిచేస్తే పార్టీ అభ్యర్థి ఆత్రం సక్కు విజయం కష్టమేమీ కాదనే భావనతో గులాబీదళం కూడికలు, తీసివేతల లెక్కలతో కుస్తీ పడుతోంది.

పెద్దపల్లిపై నజర్‌..

ఏడు శాసనసభ నియోజకవర్గాలతో విస్తరించి ఉన్న పెద్దపల్లి ఎంపీ సీటు రాజకీయం మంచిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లి స్థానాలపై ఆధారపడి ఉంది. కాంగ్రెస్‌ అభ్యర్థిగా వంశీ, భాజపా అభ్యర్థి గోమాసె శ్రీనివాస్‌ బరిలో ఉంటే భారాస మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ను బరిలో నిలిపింది. కాంగ్రెస్‌లో ఎమ్మెల్యేలు ప్రేమ్‌సాగర్‌రావు, వివేక్‌, వినోద్‌ల మధ్య రాజకీయ సఖ్యత లేదని, భాజపాకు ఆశించిన ఓటు బ్యాంకు లేదని భారాస భావిస్తోంది. మంచిర్యాల జిల్లాలో పార్టీ అభ్యర్థి ఈశ్వర్‌తో ముమ్మర ప్రచారం చేయిస్తున్న భారాస అంతర్గతంగా శ్రేణులకు ధైర్యం నూరిపోసే ప్రయత్నం చేస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని