logo

నాలుగు గంటల వరకే పోలింగ్‌

లోక్‌సభ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా ఎన్నికల అధికారి, పాలనాధికారి వెంకటేష్‌ ధోత్రే పేర్కొన్నారు. ఓటర్లందరికి ఓటరు చీటీలను అందజేస్తున్నామన్నారు.

Updated : 26 Apr 2024 06:27 IST

మారుమూల ప్రాంతాల్లో ఈవీఎంపై అవగాహన
ఈనాడు, ఆసిఫాబాద్‌

లోక్‌సభ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా ఎన్నికల అధికారి, పాలనాధికారి వెంకటేష్‌ ధోత్రే పేర్కొన్నారు. ఓటర్లందరికి ఓటరు చీటీలను అందజేస్తున్నామన్నారు. పోలింగ్‌ కేంద్రాల్లో వసతుల గురించి ప్రత్యేక యాప్‌ తయారు చేశామని, అన్ని కేంద్రాల్లో పూర్తి స్థాయిలో వసతులు కల్పిస్తున్నామని చెప్పారు. ఎన్నికల ఏర్పాట్లపై ‘ఈనాడు’తో నిర్వహించిన ముఖాముఖిలో పలు విషయాలను వివరించారు.

ఈనాడు: ఓటరు చీటీలు అందరికీ పంపిణీ చేస్తున్నారా? రాని వ్యక్తులు ఎవరిని సంప్రదించాలి?

పాలనాధికారి: గురువారం నుంచి ఓటరు చీటీల పంపిణీని సిర్పూర్‌ నియోజకవర్గంలో ప్రారంభించాం. మే 8 వరకు వీటి పంపిణీ పూర్తి చేస్తాం. చీటీలు రాని ఓటర్లు సంబంధించి బీఎల్‌ఓలు, తహసీల్దార్‌లు, ఆర్డీఓ కార్యాలయాల్లో సంప్రదిస్తే అందజేస్తారు. చీటీపై ఓటేసే పోలింగ్‌ కేంద్రం, చిరునామా, అన్ని వివరాలు ఉంటాయి.

ఈ: పోలింగ్‌ కేంద్రాల్లో ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు. పోలింగ్‌ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు నిర్వహిస్తారు?

పా: పోలింగ్‌ కేంద్రాల్లో తాగునీరు, ర్యాంప్‌లు, నీడ, విద్యుత్తు సౌకర్యం తప్పకుండా కల్పిస్తాం. అందుకు ప్రత్యేకమైన యాప్‌ తయారు చేశాం. గురువారం పార్లమెంటరీ నియోజకవర్గ జనరల్‌ ఎన్నికల పరిశీలకులు రాజంద్రే విజయ్‌(ఐఏఎస్‌)తో కలిసి సిర్పూర్‌ నియోజకవర్గంలో పలు పోలింగ్‌ కేంద్రాల్లో వసతులను పరిశీలించాం. గతంలో అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఈ ఎన్నికల్లో 69 పోలింగ్‌ కేంద్రాలు పెరిగాయి. ఆయా పోలింగ్‌ కేంద్రాల్లో ఎక్కడ తాగునీరు, నీడ ఇతర సౌకర్యాలు అవసరమో గుర్తించాం. తాగునీటికి ఇబ్బందులు ఉన్న చోట ట్యాంక్‌లను ఏర్పాటు చేస్తాం. జిల్లాలోని రెండు నియోజకవర్గాల్లో మే 13న ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్‌ నిర్వహిస్తాం.

ఈ: సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల్లో ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు?

పా: జిల్లాలో 85 సమస్యాత్మక, మావోయిస్టు ప్రభావిత 12, షాడో పోలింగ్‌ కేంద్రాలు 61 గుర్తించాం. ఈ కేంద్రాల్లో పోలింగ్‌ ప్రక్రియను పూర్తిగా చిత్రీకరించనున్నాం. సీసీకెమెరాలను, పోలింగ్‌ కేంద్రం లోపల, బయట సైతం ఏర్పాటు చేస్తాం. ప్రత్యేక సీఆర్‌పీఎఫ్‌ దళాలను భద్రతాపరంగా నియమిస్తాం.

ఈ: ఓటేసే దివ్యాంగులు, వృద్ధులకు ఎలాంటి సదుపాయాలు కల్పిస్తున్నారు?

పా: సదరం ధ్రువీకరణ పత్రంలో 40 శాతం అవయవలోపం కలిగిన దివ్యాంగులకు ఇంటి వద్దే ఓటేసే అవకాశం కల్పించాం. 85 సంవత్సరాలు దాటిన వృద్ధులు సైతం ఇంటి వద్దే ఓటు వేయచ్చు. ఫామ్‌ 20 పూర్తి చేసి సంబంధిత ఆర్డీఓ కార్యాలయంలో అందించాలి. జిల్లావ్యాప్తంగా 173 మంది ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకున్నారు. పోలింగ్‌కు మూడు, నాలుగు రోజుల ముందే వీరు ఇంటి వద్దే ఓటేసేలా చూస్తాం.

ఈ: ఎన్నికల్లో ధన ప్రవాహం ఎలా అడ్డుకుంటారు? అక్రమాలపై ఎవరికి ఫిర్యాదు చేయాలి?

పా: ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా నిష్పక్షపాతంగా ఓటేయాలి. వివిధ చెక్‌పోస్టుల ద్వారా ఇప్పటికే రూ.1.85 కోట్లు పట్టుకున్నాం. రూ.58.14 లక్షల విలువైన మద్యం, 5.5 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నాం. పట్టుకున్న నగదుకు సంబంధించి సరైనా ఆధారాలు ఉంటే జిల్లా గ్రీవెన్స్‌ కమిటీ ఆధ్వర్యంలో వెంటనే విడుదల చేస్తున్నాం. సీవిజిల్‌ యాప్‌ ద్వారా ఎవరైనా ఎన్నికల అక్రమాల గురించి ఫిర్యాదు చేయవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని