logo

లక్ష మెజార్టీతో గెలుపు ఖాయం

ఆదిలాబాద్‌ ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ లక్ష ఓట్ల మెజార్టీతో విజయం సాధించడం ఖాయమని మంత్రి సీతక్క అన్నారు.

Published : 05 May 2024 02:24 IST

రాహుల్‌గాంధీ సభను జయప్రదం చేయండి: మంత్రి సీతక్క

నిర్మల్‌ అర్బన్‌, న్యూస్‌టుడే: ఆదిలాబాద్‌ ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ లక్ష ఓట్ల మెజార్టీతో విజయం సాధించడం ఖాయమని మంత్రి సీతక్క అన్నారు. శనివారం నిర్మల్‌లో ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం ఉదయం 11 గంటలకు నిర్మల్‌లోని క్రషర్‌గ్రౌండ్‌లో చేపట్టనున్న జనజాతర బహిరంగ సభకు పార్టీ అగ్ర నేత రాహుల్‌గాంధీ హాజరుకానున్నారని చెప్పారు. రాహుల్‌ ప్రధానమంత్రి కావడానికి  ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని కోరారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఉమ్మడి ఆదిలాబాద్‌ అంటే ఎంతో ఇష్టమని, ఇక్కడి నుంచే ప్రచారం ప్రారంభించి అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్లీ మొదటిసారి ఇంద్రవెల్లికి వచ్చారని గుర్తు చేశారు. ఇంద్రవెల్లి, ఆసిఫాబాద్‌, ఆదిలాబాద్‌లో నిర్వహించిన సభల్లో ఇచ్చిన హామీలను పార్లమెంటు ఎన్నికల్లో విజయం అనంతరం నెరవేర్చనున్నారని చెప్పారు. ఆదివాసీ ఆడబిడ్డ, ప్రజా సమస్యలపై నిర్విరామంగా పోరాటం చేసే ఆత్రం సుగుణను గెలిపించాలని కోరారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో అమలు చేస్తున్నామని గుర్తు చేశారు. సంపద పెంచడం.. ప్రజలకు పంచడమే కాంగ్రెస్‌ లక్ష్యమని వెల్లడించారు. భాజపా ప్రలోభాలు, భయాందోళనలను సృష్టిస్తోందని విమర్శించారు.  బహిరంగ సభకు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో టీపీసీసీ  ఉపాధ్యక్షుడు శ్రావణ్‌కుమార్‌రెడ్డి, కార్యదర్శి సత్తు మల్లేష్‌, కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ, డీసీసీ అధ్యక్షుడు శ్రీహరిరావు, మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, మున్సిపల్‌ ఛైర్మన్‌ గండ్రత్‌ ఈశ్వర్‌ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని