logo

పేరుకే శిబిరం.. పర్యవేక్షణ పూజ్యం

జిల్లాలో అస్తవ్యస్తంగా మారాయి. జిల్లా యువజన, క్రీడాభివృద్ధిశాఖ నిర్వహిస్తున్న కార్యక్రమం నామమాత్రంగా మారింది.

Published : 05 May 2024 02:31 IST

ఈ ఏడాది కార్యాలయంలో శిక్షకులకు సామగ్రి అందిస్తూ..
మంచిర్యాల సిటీ, న్యూస్‌టుడే: గ్రామీణ, పట్టణాల్లోని క్రీడాకారులను వెలికితీసేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్న వేసవి శిక్షణ శిబిరాలు జిల్లాలో అస్తవ్యస్తంగా మారాయి. జిల్లా యువజన, క్రీడాభివృద్ధిశాఖ నిర్వహిస్తున్న కార్యక్రమం నామమాత్రంగా మారింది. గతంలో కన్నా క్రీడావిభాగాలు తగ్గించినా అనుమతి లభించినవి అంతంత మాత్రంగానే కొనసాగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా 16 చోట్ల శిబిరాలను కేటాయించగా అందులో మంచిర్యాల పట్టణంలోని జిల్లా పరిషత్తు బాలుర పాఠశాల మైదానంలోనే పది శిబిరాల నిర్వహణ జరుగుతోంది. వీటి పర్యవేక్షణ డీవైఎస్‌ఓ చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు శిబిరాల వైపే చూడలేదంటూ క్రీడాసంఘాల నాయకులు, శిక్షకుల నుంచి ఆరోపణలు వస్తున్నాయి. నెలరోజులపాటు కొనసాగే ప్రత్యేక శిబిరాలు సక్రమంగా నిర్వర్తించకపోవడంపై క్రీడాకారులు, తల్లిదండ్రులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

 సందడి లేకుండానే మొదలు..

 ఏటా జిల్లా కేంద్రంలోని మైదానంలో ఉన్నతాధికారుల చేతులమీదుగా అట్టహాసంగా మొదలయ్యే వేసవి శిబిరం.. ఈ సంవత్సరం సాదాసీదాగా ప్రారంభించారు. పర్యవేక్షణ, ప్రచారం సరిగా లేకపోవడంతో నాలుగు రోజులైనా ఇంకా కొంతమందికి శిబిరం కొనసాగుతున్నట్లు తెలియడం లేదు. ఇక క్రీడా సామగ్రి పంపిణీపై శిక్షకులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. శిబిరం ప్రారంభంలో క్రీడాకారుల సమక్షంలో ఇవ్వాల్సిన క్రీడా సామగ్రి కార్యాలయానికి పిలిచి నాసిరకమైనవి అందించినట్లు ఆరోపణలు వినవస్తున్నాయి. కనీస సౌకర్యాలు లేవని, మంచినీరు అందించే ఏర్పాటు చేయలేదని క్రీడాకారులు వాపోతున్నారు.  

డీవైఎస్‌ఓ మైదానం.. అధికారి రారేమి?

ప్రస్తుత జిల్లా పరిషత్తు బాలుర పాఠశాల మైదానాన్ని డీవైఎస్‌ఓ పేరుతోనే పిలుస్తుంటారు. కానీ ఇప్పుడున్న అధికారి ఒక్కసారి కూడా ఇక్కడికి వచ్చింది లేదు. పరిస్థితిని తెలుసుకుంది లేదు. కనీసం ప్రారంభానికి రాలేదని పలువురు శిక్షకులు చెబుతున్నారు. దీంతో ఇక్కడి శిబిరాల నిర్వహణ గందరగోళంగా మారింది. ఫుట్‌బాల్‌కు సంబంధించిన శిక్షణ తప్ప ఏ క్రీడా శిబిరం కూడా కొనసాగుతున్నట్లు కనిపించడం లేదు. బాక్సింగ్‌ శిక్షణ నిర్విరామంగా జరుగుతున్నా అది క్రీడా ఖేలో ఇండియా పరిధిలో ఉంది. శిబిరాలకు హాజరుకాకపోగా ఎలా సాగుతున్నాయని ఆరా కూడా తీయడం లేదని క్రీడా సంఘాల సభ్యులు అంటున్నారు.
మైదానంలో ఈ గుంపును చూస్తే క్రీడాశిబిరానికి సంబంధించి సమావేశం నిర్వహిస్తున్నట్లు ఉంది కదూ. ఇది ఫుట్‌బాల్‌ శిబిరం నిర్వాహకులు, క్రికెట్‌ క్రీడాకారులకు మధ్య జరుగుతున్న వాగ్వాదం. క్రికెట్‌ను నిలిపివేయాలని, శిబిరానికి వచ్చే చిన్నారులకు ఇబ్బంది కలుగుతుందని ఒకరు.. రోజూ ఆడుతుండగా ఇప్పుడు కొత్తగా ఆపివేయాలనడం ఏంటని మరొకరు వాదనలు చేసుకుంటున్నారు. మైదానానికి అనేకమంది వస్తుంటారు. వివిధ రకాల వ్యాయామాలు చేస్తుంటారు. వీరందరినీ సమన్వయం చేసి శిబిరం సాఫీగా జరిగేలా డీవైఎస్‌ఓ చొరవ తీసుకోవాలి. నెలరోజుల కార్యక్రమాన్ని వివరించి సహకరించేలా కోరాలి. కానీ తనకేం సంబంధం లేన్నట్లు శిక్షకులకు వదిలేయడంతో ఇలా గొడవలకు దారితీస్తున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని