logo

రెండు స్థానాలు ఎగబాకి..

పదో తరగతి ఫలితాలు ఈసారి కొంత ఊరటనిచ్చాయి. కిందటేడాదితో పోల్చితే జిల్లాకు 19వ స్థానం రాగా.. ఈసారి రెండు స్థానాలు ఎగబాకి 17వ స్థానం దక్కించుకుంది.

Published : 01 May 2024 03:10 IST

పదో తరగతి ఫలితాల్లో జిల్లాకు 17వ స్థానం 

10 జీపీఏ సాధించిన బాలికలను అభినందిస్తున్న డీఈవో ప్రణీత

న్యూస్‌టుడే, ఆదిలాబాద్‌ పాలనాప్రాంగణం : పదో తరగతి ఫలితాలు ఈసారి కొంత ఊరటనిచ్చాయి. కిందటేడాదితో పోల్చితే జిల్లాకు 19వ స్థానం రాగా.. ఈసారి రెండు స్థానాలు ఎగబాకి 17వ స్థానం దక్కించుకుంది. మంగళవారం విడుదలైన ఫలితాల్లో జిల్లా విద్యార్థులు 4.25 శాతం పెరుగుదలతో 92.93 శాతం ఉత్తీర్ణత సాధించారు.

జిల్లా వ్యాప్తంగా 10,374మంది విద్యార్థులు పదోతరగతి పరీక్షలకు హాజరుకాగా.. అందులో 9,641 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఇందులో బాలురు 5,179 మంది పరీక్ష రాస్తే 4,744 మంది, బాలికల్లో 5,195 మందికి 4,897 మంది పాసయ్యారు. ఉత్తీర్ణత శాతంలో బాలురు 91.60 శాతం, బాలికలు 94.26 శాతం సాధించారు.

94 మందికి 10 గ్రేడ్‌ పాయింట్లు

జిల్లాలో ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో 10 గ్రేడ్‌ పాయింట్లు(జీపీ) 46 మంది విద్యార్థులకు రాగా.. అందులో అత్యధికంగా తాంసి మండలం ఈదుల్లా సావర్గాం మహాత్మా జ్యోతిబాఫులే విద్యార్థినులు ఏకంగా 24 మంది, ప్రైవేటు విద్యా సంస్థల్లో 48 మంది విద్యార్థులు 10 జీపీఏ సాధించారు. బోథ్‌ టీఎస్‌డబ్ల్యూఆర్‌ఎస్‌(బాలికలు)లో ఆరుగురు, ఎంజెపీ ఆదిలాబాద్‌ విద్యార్థినులు నలుగురు, ఎంజెపీ నర్సాపూర్‌, జడ్పీఎస్‌ఎస్‌ కప్పర్లలో ఇద్దరు చొప్పున, ఎస్‌డబ్ల్యూఆర్‌, మైనార్టీ రెసిడెన్షియల్‌, మోడల్‌స్కూల్‌, జిల్లా పరిషత్‌ ఆదిలాబాద్‌, బజార్‌హత్నూర్‌, బోథ్‌, ఇచ్చోడ, జైనథ్‌, కూర పాఠశాలల్లో ఒకరి చొప్పున 10 జీపీఏ సాధించిన వారిలో ఉన్నారు.

59 బడుల్లో 100 శాతం ఉత్తీర్ణత

జిల్లాలో ప్రభుత్వ యాజమాన్యాల పరిధిలో 37 బడుల్లో చదివిన 1,066 మంది విద్యార్థులు, 22 ప్రైవేటు బడుల్లో చదివిన 869 మంది విద్యార్థులు పాసై 100 శాతం ఉత్తీర్ణత నమోదు చేయడం విశేషం. ఇందులో 30 జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలల్లో 658 మంది విద్యార్థులు, నాలుగు కేజీబీవీల్లో 132 మంది, మూడు మోడల్‌ స్కూళ్లలో 276 మంది, 22 ప్రైవేటు స్కూళ్లలో 869 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు.

యాజమాన్యాల వారీగా..

ఆశ్రమోన్నత పాఠశాలల్లో 1450(90.46శాతం), బీసీ గురుకులాల్లో 321(100శాతం)మంది, ప్రభుత్వ బడుల్లో 572(79.89శాతం), కేజీబీవీల్లో 548(94.97శాతం), ప్రైవేటు స్కూళ్లలో 2,288 (96.83 శాతం), మైనార్టీ గురుకులాల్లో 214(95.83శాతం), సోషల్‌ వెల్ఫేర్‌ స్కూళ్లలో 233(99.15శాతం), ట్రైబల్‌ వెల్ఫేర్‌లో 448(98.03 శాతం), జడ్పీ పాఠశాలల్లో 3,005(90.73శాతం) మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు.

అందరు పాస్‌!  

వీరంతా గాదిగూడ కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయ పదో తరగతి విద్యార్థినులు. పట్టుదలతో చదవడంతో పదో తరగతి పరీక్ష రాసిన 40 మంది ఉత్తీర్ణత సాధించి 100 శాతం ఫలితాలు నమోదు చేశారు. ఇతర కస్తూర్బా విద్యాలయాలైన ఇచ్చోడలో 33 మంది, నార్నూర్‌లో 30 మంది, తలమడుగులో 26 మంది, బేలలో 29 మంది ఉత్తీర్ణులై 100 శాతం ఫలితాలతో సత్తా చాటారు. విద్యార్థినులను, టీచర్లను, ఎస్‌ఓలను సెక్టోరల్‌ అధికారి ఉదయశ్రీ ప్రత్యేకంగా అభినందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని