logo

ఏడేళ్లుగా తీరని వెతలు!

భైంసా మండలం గుండేగాం వాసుల పునరావాసం మాట అరణ్య రోదనే అవుతోంది.

Published : 07 May 2024 03:42 IST

వానాకాలంతో గుండేగాం వాసుల గుబులు

గుండేగాంలో కూలిపోయిన ఇల్లు

భైంసా, న్యూస్‌టుడే: భైంసా మండలం గుండేగాం వాసుల పునరావాసం మాట అరణ్య రోదనే అవుతోంది. ఏడేళ్లుగా వారి కష్టాలు వర్ణనాతీతంగా మారాయి. ప్రభుత్వం శాశ్వత పరిష్కారం కోసం జీవో విడుదల చేసినా కార్యాచరణ ముందడుగు వేయడంలేదు. దీనికి శాసనసభ, పార్లమెంట్‌ ఎన్నికల నిబంధనలకు కూడా అడ్డుగా మారాయి. ఈ ఎన్నికలు పూర్తయితే మళ్లీ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తుండడంతో ఈ ఏడాది కూడా కష్టాలు తప్పేటట్లు లేవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వమే ప్రత్యేక అనుమతులతో పునరావాస చర్యలు చేపడితే సమస్య అధిగమించే వీలుందంటున్నారు.

2006లో మండలంలోని కోతుల్‌గాం-వాడి శివారులోని చిన్న సుద్దవాగుపై పల్సీకర్‌ రంగారావు ప్రాజెక్టు నిర్మాణ పనులు చేపట్టగా 2017లో పూర్తయ్యాయి. రూ.37 కోట్లతో నిర్మించిన పనుల్లో ఆయా శాఖల అధికారుల తప్పిదాలు గుండేగాం వాసుల శాపమయ్యాయి. పూర్తిగా రూపుదిద్దుకున్న ప్రాజెక్టుతో మొదటి వర్షాకాలంలోనే గ్రామంలో వెనకతట్టు నీరు ప్రవేశించింది. దీంతో ఏడేళ్లుగా వానాకాలం వస్తే గూడులేని పక్షుల్లా ఇతర ప్రాంతాల్లో తల దాచుకుంటున్నారు. వాగు పరీవాహక ప్రాంత వ్యవసాయ భూములు సైతం నీట మునుగుతున్నాయి. ఏడేళ్లుగా పునరావాసం కల్పిస్తామని ప్రజాప్రతినిధులు, ప్రభుత్వాలు హామీలతోనే కాలం వెళ్లదీస్తున్నాయని బాధిత గ్రామస్థులు ఆవేదన చెందుతున్నారు. రెండేళ్ల కిందట జులైలో ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ కింద రూ.61.30 కోట్లను మంజూరు చేస్తూ 211 జీవో జారీ చేసింది. దీంతో అధికారులు గతేడాది మే 5న గ్రామసభ నిర్వహించి పునరావాస చర్యలను వివరించారు. కుటుంబాలు, నివాసాలు, ఆస్తులకు అందించే పరిహారం, 18 సంవత్సరాలు నిండిన వారికి భత్యం, ఉపాధి, జీవన భృతి వంటి విషయాలపై బాధితులతో చర్చించి అభిప్రాయాలు తెలుసుకున్నారు. తర్వాత ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది.

శిథిలమైన ఇళ్లలోనే..

బాధితులకు పరిహారం, భత్యం వంటి ఆర్థిక చేయూత, ఇళ్లస్థలాలు చూపక పోవడంతో ఈ వానాకాలం సైతం కష్టాలు తప్పవని ఆందోళన చెందుతున్నారు. శిథిలమైన ఇళ్లకు మరమ్మతులు లేక అవి వానలకు కూలిపోతున్నాయి. ఊరు వదలని కొందరు ఇళ్లపై పాలిథిన్‌ కవర్లు, టార్పలిన్‌లు కప్పుకొని వాటిలోనే గడుపుతున్నారు

స్థలం గుర్తించినా..

భైంసా వాసుల కోసం నిర్మించిన రెండు పడక గదుల ఇళ్ల సముదాయంలో బాధితులకు ప్రస్తుతానికి తాత్కాలిక ఆవాసాలు కల్పించారు. శాశ్వత పరిష్కారం కోసం సిద్దూరు శివారులోని సర్వే నంబరు 79 ప్రభుత్వ భూమిలో 20 ఎకరాలు కేటాయించారు. దీనికి గ్రామస్థులు సమ్మతించినట్లు అధికారులు తెలిపారు. కాగా గ్రామసభ నివేదికను జిల్లా అధికారులకు పంపి ఏడాది గడుస్తున్నా ఎలాంటి పురోగతి లేదు.

ప్రభుత్వం ఆదేశిస్తే చర్యలు చేపడతాం: కోమల్‌రెడ్డి,  ఆర్డీవో

పునరావాసం కోసం స్థలం గుర్తించాం. గ్రామసభ నివేదికను ఉన్నతాధికారులకు నివేదించాం. తదుపరి ఎలాంటి ఆదేశాలు రాలేదు. ప్రభుత్వం అనుమతిస్తే మార్గదర్శకాల మేరకు చర్యలు తీసుకుని బాధితులను అన్ని విధాలా ఆదుకుంటాం.

గ్రామంలో లెక్కలిలా..

నివాసాలు : 271
నీట మునిగినవి : 240
శిథిలమై కూలినవి : 35
పాక్షికంగా దెబ్బతిన్నవి : 25
జనాభా : 980
గుర్తించిన కుటుంబాలు : 454

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని