logo

జిల్లా.. వైద్య రంగాలకు ప్రాధాన్యం

‘‘మొన్నటి వరకు నేనో ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయురాలిని. నా విధుల నిర్వహణ తరగతి కేంద్రంగా సాగేది.

Published : 07 May 2024 03:49 IST

‘ఈనాడు’తో కాంగ్రెస్‌ అభ్యర్థి ఆత్రం సుగుణ

ఈటీవీ - ఆదిలాబాద్‌ : ‘‘మొన్నటి వరకు నేనో ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయురాలిని. నా విధుల నిర్వహణ తరగతి కేంద్రంగా సాగేది. సమాజ ప్రగతి అనేది స్వప్నంగా కనిపించేది. అందుకే రాజకీయాల్లోకి వచ్చా. ఎంపీగా పోటీ చేసే అవకాశం కాంగ్రెస్‌ పార్టీ కల్పించింది. ప్రజల ఆశీస్సులతో ఎన్నికల్లో గెలిచిన తర్వాత పార్లమెంటు నియోజకవర్గమే పాఠశాలగా పని చేస్తా‘‘నని కాంగ్రెస్‌ అభ్యర్థి ఆత్రం సుగుణ స్పష్టం చేశారు. పదేళ్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పాలనలో ఆదిలాబాద్‌ పార్లమెంటు నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు. ప్రజల ఆలోచనలకు అనుగుణంగా ఆచరణాత్మకమైన అభివృద్ధిని చేసి చూపిస్తానంటున్న’’ కాంగ్రెస్‌ అభ్యర్థి ఆత్రం సుగుణతో ‘ఈనాడు’ ముఖాముఖి.

ఈనాడు : ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పాఠశాలలో పని చేసి రాజకీయాల్లోకి వచ్చారు. ఎంపీగా విజయం సాధిస్తే రాజకీయాల్లో రాణించగలననే నమ్మకం ఉందా? అయిదేళ్ల వ్యవధిలో మీకంటూ ఎంచుకున్న తొలి ప్రాథామ్యాలు ఏమిటి?

సుగుణ : ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా ఉన్నప్పుడు కూడా ఎన్నో ప్రజా ఉద్యమాల్లో పాల్గొన్నాను. ఉపాధ్యాయురాలిగా ఉంటూ ప్రజా ఉద్యమాలకు పూర్తి న్యాయం చేయలేం. అందుకే భర్త భుజంగరావు తోడ్పాటుతో రాజకీయాల్లోకి వచ్చా. ఎంపీగా విజయం సాధించాక విద్యా, వైద్యం, రవాణా రంగాలను మెరుగుపర్చడాన్ని తొలి ప్రాథామ్యాలుగా భావిస్తా. సామాన్యుల అవసరాలు, విద్యావంతుల సూచనలు, మేధావుల ఆలోచనలను రంగరించి ఎంపీ ల్యాడ్స్‌ నిధులను వెచ్చిస్తా. ప్రగతి అనేది మాటల్లో కాకుండా ఆచరించి చూపించి ఆదిలాబాద్‌ ఖ్యాతిని ఇనుమడింపజేస్తా.

ఈ : ప్రజా ఉద్యమాల్లో పనిచేసిన మీరు  కాంగ్రెస్‌ ఎంపీగా గెలిచాక ప్రజా సమస్యలను గుర్తించటం, వాటిని చట్టసభల్లో వినిపించి పరిష్కరించటం సాధ్యమేనంటారా?

సుగుణ : మీరనేది వాస్తవమే కావచ్చు. కానీ మాది వ్యక్తిగత అవసరాల రీత్యా ప్రజలను తప్పుదోవ పట్టించే నైజం కాదు. పారదర్శకంగా పని చేయాలనేది మా అభిమతం. అధికారంలో  ఉన్నా.. లేకున్నా ప్రజల బాధలు గుర్తించామా? లేదా? అనేది ముఖ్యం. పదేళ్ల భాజపా, భారాస పాలనలో ఆదిలాబాద్‌ లోక్‌సభ స్థానం ప్రగతి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది. ఆదిలాబాద్‌ - ఆర్మూర్‌ రైల్వేలైన్‌ సాధించటం, సిమెంటు పరిశ్రమను తెరిపించటం, కేరళ రాష్ట్రం మాదిరిగా గల్ఫ్‌ వెళ్లేవారికి ప్రత్యేక విధానం అమలుచేయటం, బీడీ కార్మికుల కుటుంబాల సంక్షేమం కోసం పని చేయటం, వాళ్లు కోరుకుంటే స్వయం ఉపాధిని చూపించటం, అన్ని గ్రామాలకు తాగునీరు సరఫరా చేయటం, మా  ఎన్నికల ప్రణాళికలో పొందుపర్చినట్లు పట్టభద్రులైన నిరుద్యోగులకు ఉద్యోగాలిప్పించటం నా కర్తవ్యం.

ఈ : ఉమ్మడి జిల్లాలో ఆదివాసీలు, ప్రధానంగా గిరిజనులు, గిరిజనేతరుల భూ సమస్య ఇబ్బందికరంగా ఉంది. కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థిగా మీ వైఖరి ఏమిటి? ఎలా ఉండబోతోంది?

సుగుణ : ఇది ఉమ్మడి జిల్లా ప్రధాన సమస్య. భాజపా, భారాస ప్రభుత్వాల పదేళ్ల కాలంలో ఆదివాసీలు, ఇతర గిరిజనులు, గిరిజనేతరులకు ఎలాంటి లబ్ధి జరగలేదు. వారికి భిన్నంగా నేను పారదర్శక పనితనంతో ప్రతి ఒక్కరి బాధ వింటా. పరిష్కారం చూపిస్తా. మా పార్టీ విధానాలకు లోబడి గిరిజనులకు సాగుభూమిపై హక్కులు కల్పిస్తాం. గిరిజనేతరుల సమస్యలు పరిష్కరించి గతంలో పహాణీ, నకలు జారీ చేసి పంట రుణాలు ఇప్పించే బాధ్యత తీసుకుంటా. ఈ  విషయమై సీఎం రేవంత్‌రెడ్డి, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి సీతక్క సైతం అనుకూలంగా ఉన్నందున ఏ ఇబ్బందులకు తావులేదు.  

ఈ : ఆదిలాబాద్‌ లోక్‌సభ స్థానం నుంచి తొలిసారి మహిళా అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. వారి సమస్యల పట్ల మీ స్పందన ఏమిటి?

సుగుణ : వ్యక్తిగతంగా డబ్బులు సంపాదించాలని, కోట్లకు పడగలెత్తాలనే ఆలోచన నాది కాదు. ఉట్నూరులో మాకంటూ ఉన్న ఓ ఇల్లు చాలు. ఇప్పటికీ ఆదివాసీ, గిరిజన, మైదాన ప్రాంతాల్లో రక్తహీనతతో బాధపడుతున్న మహిళలను చూస్తుంటే గుండె తరుక్కుపోతోంది. వైద్యం అందక బాలింతలు చనిపోయారని, ఉప్పొంగిన వాగులతో సకాలంలో ఆసుపత్రికి రాలేక కడుపులోనే పిండం చనిపోయిందని విన్నప్పుడు ఆవేదన కలుగుతోంది. సాటి మహిళగా వారికి అండగా నిలవాలనే లక్ష్యంతో రాజకీయాల్లోకి వచ్చా. మహిళలు అనుకుంటే ఏ రంగంలోనైనా రాణించగలరు. సహనం, గుండె ధైర్యం కావాలి. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లోని మహిళలకు అండగా ఉంటా. ఎంపీగా గెలిచాక తప్పకుండా విశ్వవిద్యాలయం తీసుకొస్తా. మహిళల అక్షరాస్యతను పెంచేలా కృషి చేస్తా. బాలికల చదువులు మధ్యలో ఆగకుండా చూస్తా.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని