logo

లారీల కొరత.. అన్నదాతకు వెత

కొనుగోలు కేంద్రాలనుంచి వెంటవెంట ధాన్యం తరలించకపోవడంతో రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు.

Published : 07 May 2024 03:50 IST

కొనుగోలు కేంద్రాల్లో పేరుకుపోతున్న ధాన్యం నిల్వలు

దండేపల్లిలో ధాన్యాన్ని తూకం వేస్తున్న హమాలీలు

మంచిర్యాల వ్యవసాయం, న్యూస్‌టుడే: కొనుగోలు కేంద్రాలనుంచి వెంటవెంట ధాన్యం తరలించకపోవడంతో రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. కేంద్రాల్లో తూకం వేసినప్పటికీ లారీల కొరతతో తరలింపులో జాప్యమవుతోంది. మిల్లుల్లో ధాన్యాన్ని దించుకోకపోవడంతో రోజుల తరబడి అక్కడే నిరీక్షించేందుకు రైతులు అవస్థలు పడుతున్నారు. ధాన్యంలో తప్ప, తాలు, విరిగిన నూక వస్తోందనే నెపంతో మిల్లర్లు కొర్రీలు పెడుతూ దించుకోవడం లేదు. అసలే లారీలు తక్కువగా ఉన్నాయంటే దీనికితోడు మిల్లర్లు వెంటనే దించుకోకపోవడం సమస్యగా మారింది. లారీలురాక కేంద్రాల్లో బస్తాల నిల్వలు పేరుకుపోతున్నాయి. మిల్లులకు లారీలు చేరుకున్న తరువాత ధాన్యం దించుకోకపోవడంతో వెనుకకు రావడం లేదు. దీంతో కేంద్రాల్లో రైతులు పడిగాపులు కాయాల్సి వస్తోంది.

పదిరోజులుగా వరికోతలు ముమ్మరంగా సాగుతుండటంతో కేంద్రాలకు ధాన్యం విరివిగా వస్తోంది. అయితే కేంద్రాల్లో అప్పటికే తూకం వేసిన ధాన్యం నిల్వలు ఉండటంతో ఆరబోసేందుకు స్థలంలేక ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలోని హాజీపూర్‌, భీమారం, జైపూర్‌, చెన్నూరు, భీమిని, కన్నేపల్లి, లక్షెట్టిపేట, దండేపల్లి తదితర మండలాల్లో ధాన్యం నిల్వలు పేరుకుపోతున్నాయి. వెంటవెంట ధాన్యం తరలించి మిల్లుల్లో దించుకునేలా అధికారులు చర్యలు తీసుకుంటేనే రైతులకు ప్రయోజనం చేకూరనుంది.

అంతా సాధారణ రకమే..

ధాన్యాన్ని రెండు రకాలుగా విభజించి ప్రభుత్వం ధాన్యాన్ని కొనుగోలు చేస్తుంది. ‘ఏ’రకం క్వింటాలుకు రూ.2203 మద్దతు ధర ఉండగా.. సాధారణ రకం ‘బీ’ రకానికి రూ. 2183 మద్దతు ధర ఉంది. అయితే మిల్లుల్లో మొత్తం బీ రకం కిందే తీసుకోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ‘ఏ’ రకాన్ని కూడా ‘బీ’ కిందే కొనుగోలు చేయడంతో తాము క్వింటాలుకు రూ. 20 నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వెంటవెంటనే తరలించేలా చర్యలు: వాజీద్‌, జిల్లా పౌరసరఫరాల అధికారి, మంచిర్యాల

జిల్లాలో మిల్లుల సామర్థ్యం తక్కువగా ఉండటంతో ఆలస్యం అవుతోంది. పెద్దపల్లి జిల్లా మిల్లర్లతో మాట్లాడాం. ఇక్కడి మిల్లులకు ట్యాగింగ్‌ చేసి వెంటవెంటనే తరలించేలా చర్యలు తీసుకుంటాం. మిల్లుల్లో ఆలస్యం చేయకుండా త్వరగా దించుకునేలా చూస్తాం.

వారం రోజులుగా ధాన్యం కేంద్రంలోనే: తిరుపతి, రైతు, వందూర్‌గూడ

నాకు రెండెకరాల పొలం ఉంది. వారం రోజుల కింద ధాన్యం కేంద్రంలో పోశాను. ఇప్పటికీ తూకం కాలేదు. తేమ రాలేదని ఇప్పటి వరకు తూకం వేస్తలేరు. వారం రోజులుగా ఇక్కడే ఉండాల్సి వస్తోంది. వెంటనే తూకం వేసి ధాన్యం తరలించేలా చూడాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని