logo

తునికాకు సేకరణకు సన్నాహాలు

ఆసిఫాబాద్‌ డివిజన్‌ పరిధిలోని గిరివెల్లి-ఏ, గిరివెల్లి, కాగజ్‌నగర్‌ డివిజన్‌ పరిధిలోని బెజ్జూరు, సలుగుపల్లి, గూడెం, కర్జెల్లి, చీలపెల్లి, ముత్తంపేట, కొత్తపేట, అనుకోడ, పెంచికల్‌పేట, లోనవెల్లి, కడంబ, బొంబాయిగూడ, డబ్బా యూనిట్లకు ఇటీవల ఆన్‌లైన్‌ టెండర్లు నిర్వహించారు.

Published : 07 May 2024 03:56 IST

10 నుంచి ప్రారంభం.. 

బెజ్జూరులో తునికాకు కట్టలు కడుతున్న కుటుంబ సభ్యులు

ఆసిఫాబాద్‌ డివిజన్‌ పరిధిలోని గిరివెల్లి-ఏ, గిరివెల్లి, కాగజ్‌నగర్‌ డివిజన్‌ పరిధిలోని బెజ్జూరు, సలుగుపల్లి, గూడెం, కర్జెల్లి, చీలపెల్లి, ముత్తంపేట, కొత్తపేట, అనుకోడ, పెంచికల్‌పేట, లోనవెల్లి, కడంబ, బొంబాయిగూడ, డబ్బా యూనిట్లకు ఇటీవల ఆన్‌లైన్‌ టెండర్లు నిర్వహించారు. కడంబా, బొంబాయిగూడ, గిరివెల్లి-ఏ యూనిట్లలో గుత్తేదార్లు ముందుకు రాలేదు.  

కాగజ్‌నగర్‌, బెజ్జూరు, న్యూస్‌టుడే

ఏటా వేసవిలో గిరిజనులు,కూలీలకు ఉపాధి లభించే తునికాకు సేకరణ కోసం అటవీశాఖ సన్నాహాలు చేస్తోంది. ఇటీవలి అకాల వర్షాల కారణంగా ఆకు నాణ్యత బాగుందని అధికారులు, గుత్తేదార్లు భావిస్తున్నారు. ఈ ఏడాది కాగజ్‌నగర్‌, ఆసిఫాబాద్‌ డివిజన్ల పరిధిలోని 15 యూనిట్లలో సేకరణకు టెండర్లు పిలిచినప్పటికీ, మూడింటిలో గుత్తేదార్లు ముందుకు రాలేదు.

జిల్లాలోని గిరిజనులు, కూలీలు, రైతులకు వేసవిలో వ్యవసాయ పనులు లేకపోవడంతో తునికాకు సేకరణ ప్రధాన ఆదాయంగా మారుతోంది. దాదాపు అయిదువేల మందికి పైగా ఉపాధి లభిస్తోంది. యాభై ఆకులను ఒక కట్టగా కట్టి కల్లాల్లో విక్రయిస్తారు. అధికారులు కట్టకు రూ.మూడు చొప్పున కొనుగోలుచేసి, ఎండబెట్టి వెయ్యి కట్టలను ఒక స్టాండర్డ్‌ బ్యాగుగా నింపి గుత్తేదార్లకు అప్పగిస్తారు. ఒక్కొక్క కుటుంబంలో రోజుకు రూ.500 నుంచి రూ.1000 వరకు సంపాదిస్తారు. గుత్తేదార్లు, బీడీ కార్మికులకు సైతం ఉపాధి లభిస్తుంది. ఈ నెల 10వ తేదీ నుంచి జిల్లాలో 12 యూనిట్ల పరిధిలోని 197 కల్లాల్లో ఆకు సేకరణ ఏర్పాట్లు చేసినట్లు డివిజన్‌ అధికారి తెలిపారు. ఈ నెల చివరి వరకు సేకరణ జరుగనుంది.

కూలీలకు రాయల్టీ డబ్బుల చెల్లింపు

నాలుగేళ్ల పెండింగ్‌ డబ్బులు గతేడాది ప్రభుత్వం విడుదల చేయగా.. జిల్లాకు దాదాపు రూ.36 కోట్లు వచ్చాయి. తునికాకు సేకరణను బట్టి రాయల్టీ డబ్బులు ప్రభుత్వం కూలీలకు మంజూరు చేసే అవకాశం ఉంది. అయితే ఈ సారి తునికాకు తగ్గి, ఆ డబ్బులు తగ్గే అవకాశం ఉంది.

పొంచి ఉన్న ముప్పు

ఏప్రిల్‌ మొదటి వారంలో ఛత్తీస్‌గడ్‌ రాష్ట్రం నుంచి జిల్లాలోని చింతలమానేపల్లి, పెంచికల్‌పేట మండలాలకు వచ్చిన ఏనుగు ఇద్దరు రైతులను బలిగొన్న విషయం తెలిసిందే. రెండ్రోజుల పాటు అటవీ ప్రాంతంలో హల్‌చల్‌ సృష్టించి తిరిగి మహారాష్ట్రకు వెళ్లడంతో అధికారులు, జిల్లావాసులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రాణహిత నదిని ఆనుకుని ఒక వైపు మహారాష్ట్ర-ఛత్తీస్‌గడ్‌ అభయారణ్యాలు, మరోవైపు కుమురంభీం, మంచిర్యాల జిల్లాల గ్రామాలు ఉన్నాయి. ప్రస్తుతం ఏనుగుల గుంపు నదికి అటువైపు కేవలం 50-60 కిలోమీటర్ల మేర సంచరిస్తున్నాయని, ఏ క్షణమైనా తెలంగాణ వైపు గుంపు వచ్చే అవకాశం ఉందని అధికారులు అప్రమత్తమయ్యారు. అటవీ ప్రాంతాల్లో ఉండే గ్రామాల ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. మరోవైపు కాగజ్‌నగర్‌ సరిహద్దు ప్రాంతం గుండా మహారాష్ట్రలోని తిప్పేశ్వర్‌, తడోబా, ఇంద్రావతి అభయారణ్యాల నుంచి పులుల రాకపోకలు సాగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం తునికాకు సేకరణపై కూడా ఆ ప్రభావం పడే అవకాశం ఉంది. అధికారులు కాగజ్‌నగర్‌ డివిజన్‌ ప్రాంతాల్లో పులి సంచరిస్తున్న పలు ప్రాంతాల్లో సేకరణ సందర్భంగా కూలీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులు గ్రామాల్లో అవగాహన కల్పిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని