logo

రెడ్‌ అలర్ట్‌

వేసవి భగభగలు ప్రజల్ని హడలెత్తిస్తున్నాయి. నాలుగేళ్లలో ఉమ్మడి జిల్లా సగటు ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలు దాటలేదు.

Published : 07 May 2024 04:04 IST

ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు
అత్యధికంగా జన్నారంలో 46.3 డిగ్రీలుగా నమోదు
న్యూస్‌టుడే, రాంనగర్‌

వేసవి భగభగలు ప్రజల్ని హడలెత్తిస్తున్నాయి. నాలుగేళ్లలో ఉమ్మడి జిల్లా సగటు ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలు దాటలేదు. అలాంటిది ఈ సీజన్‌లో వరుసగా రెండు రోజుల నుంచి సగటు ఉష్ణోగ్రత 44.3 డిగ్రీలు ఉండగా, జిల్లాలోని పలు ప్రాంతాల్లో 45 డిగ్రీలు దాటడం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పుడే ఈ పరిస్థితి ఉంటే ఈ ఏడాది రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. ఇప్పటికే భారత వాతావరణ శాఖ జిల్లాలోని పలు ప్రాంతాల్లో రెడ్‌అలర్ట్‌ ప్రకటించడంతో అప్రమత్తంగా ఉండాలంటూ వైద్యులు సూచిస్తున్నారు.

ఉమ్మడి జిల్లాలో సోమవారం 44.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కాగా, జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో ఇంకా ఎక్కువే నమోదైంది. వారం రోజులుగా వడగాల్పుల తీవ్రత అధికమైంది. ఈ నెల ప్రారంభం నుంచి వరుసగా 45 డిగ్రీల పైనే ఉష్ణోగ్రతలు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. గాలిలో తేమ శాతం తగ్గిపోవడంతో ఎండ తీవ్రత ఎక్కువైంది.  

ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటిన ప్రాంతాలు

ఉమ్మడి జిల్లాలోని పాలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటడంతో ఆయా ప్రాంతాలను రెడ్‌అలర్ట్‌గా ప్రకటించారు. ఆయా ప్రాంతాల్లోని జనం బయటకు వెళ్లకూడదని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.  
మంచిర్యాల జిల్లాలోని జన్నారం, హజీపూర్‌, దండేపల్లి మండలాల్లో 46 డిగ్రీలు దాటగా, లింగాపూర్‌, తపాలపూర్‌, తపాలపూర్‌, భీమిని మండలాల్లో 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడంతో వాటిని రెడ్‌జోన్‌లో చేర్చారు. ఆదిలాబాద్‌ జిల్లాలోని భీంపూర్‌ మండలంలోని అర్లి, ఆదిలాబాద్‌ మండలం పిప్పల్‌ధరి ప్రాంతాల్లో 45.8 డిగ్రీలు నమోదు కావడంతో ఆయా ప్రాంతాలను రెడ్‌అలర్ట్‌గా ప్రకటించారు. కుమురం భీం జిల్లాలో రెబ్బెన, కాగజ్‌నగర్‌ మండలాల్లో 46 డిగ్రీలకు పైగా నమోదు కాగా, ఆసిఫాబాద్‌, జంబుగూడ, తిర్యాణి తదితర ప్రాంతాల్లో 45 డిగ్రీలు దాటింది. నిర్మల్‌ జిల్లాలో దస్తూరాబాద్‌, కడెం, ముజ్గి, ఖానాపూర్‌, తదితర ప్రాంతాలు రెడ్‌జోన్‌లో ఉన్నాయి.  


మావలకు చెందిన ఉపాధి కూలీలు తెల్లవారుజామునే లేచి ఉపాధి పనులకు వెళుతున్నారు. తిరిగి 10 గంటల సమయంలో ఇంటికి కాలినడకన వెళ్లలేని పరిస్థితి ఉంది. అప్పటికే ఎండలో పని చేసిన కూలీలు తిరిగి నడిచి ఇళ్లకు వెళ్లడం ఇబ్బందిగా ఉండటంతో పనులు పూర్తయిన తర్వాత ఆటోల్లో ఇళ్లకు వెళుతున్నారు.


గుడిహత్నూర్‌ మండలం సీతాగొందిలో ఓ రైతు వేరుశనగ పంట వేశారు. మొక్కలను పీకడం, వాటి నుంచి కాయలను తుంచాలంటే ఉదయం నుంచి పంట పొలంలోనే ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎండలు ఎక్కువగా ఉండటంతో పొలం పనులకు తెల్లవారుజామునే వెళ్లి మొక్కలను తెంపుతున్నారు. ఎండలో కాయలు తెంపడం కష్టంగా ఉండటంతో వేరుశనగ కాయలను తెంపేందుకు పంట పొలంలోనే నీడ కోసం ప్లాస్టిక్‌ కవర్లతో కూలీలు చిన్న గుడారాలు ఏర్పాటు చేసుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని