logo

పోలింగ్‌ కేంద్రం దూరం.. అసౌకర్యాల భారం..

మరో ఆరు రోజుల్లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో అనేక అవస్థల మధ్య ఓట్లేసిన జిల్లావాసులకు మళ్లీ అసౌకర్యాలే ఎదురుకానున్నాయి. చాలా చోట్ల హడావుడిగా పనులను చేస్తున్నా..

Published : 08 May 2024 03:40 IST

ఈనాడు, ఆసిఫాబాద్‌: మరో ఆరు రోజుల్లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో అనేక అవస్థల మధ్య ఓట్లేసిన జిల్లావాసులకు మళ్లీ అసౌకర్యాలే ఎదురుకానున్నాయి. చాలా చోట్ల హడావుడిగా పనులను చేస్తున్నా.. అనేక చోట్ల తాగునీరు, విద్యుత్తు, మరుగుదొడ్లు, మూత్రశాలల పనులు అసంపూర్తిగానే ఉన్నాయి. ర్యాంపులు సైతం లేవు. పల్లె ప్రజలు నాలుగైదు, కిలోమీటర్ల మేర నడిచి ఓట్లు వేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే పోలింగ్‌ కేంద్రాలు పెంచినా, సౌకర్యాలు కల్పించేందుకు చేపడుతున్న పనులు మరింత వేగం పెంచాల్సి ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

పోలింగ్‌ కేంద్రాలలో అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీ ఆధ్వర్యంలో ప్రస్తుతం సౌకర్యాల కల్పన పనులు కొనసాగుతున్నాయి. ఆసిఫాబాద్‌ నియోజకవర్గంలో 356 కేంద్రాలు, సిర్పూర్‌లో 320 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే 69 కొత్తగా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం శిథిలమైన పాఠశాల భవనాలకు మరమ్మతులు పూర్తి చేస్తున్నారు. టైల్స్‌ వేయడం, ఫ్యాన్లు, లైట్లు బిగించడం విద్యుదీకరణ పనులు గడువులోగా పూర్తవుతాయిఅనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని కేంద్రాల్లో ర్యాంపులు లేక దివ్యాంగులకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. అనేక పాఠశాలల్లో తాగునీటి కోసం పోలింగ్‌ జరిగే రోజు తాత్కాలిక ట్యాంకులను ఏర్పాటు చేయనున్నారు. మిషన్‌ భగీరథ కనెక్షన్లు ఉన్నా.. నీటి సరఫరా కావడం లేదు.

జైనూర్‌ మండలంలోని దబోలి పోలింగ్‌ కేంద్రానికి లొద్దిగూడ నుంచి మూడు కిలోమీటర్లు నడిచి వచ్చి ఓటేయాలి. తిర్యాణి మండలం నయకపుగూడ, గోండుగూడ, కొలాంగూడలకు చెందిన ఓటర్లకు గోవెన వద్ద పోలింగ్‌ కేంద్రం ఏర్పాటు చేశారు. తాగునీరు, మరుగుదొడ్లు ఏవీ ఇక్కడ లేవు. రేకులతో తాత్కాలికంగా ఏర్పాటు చేశారు.

డదస్నాపూర్‌ (211) పోలింగ్‌ కేంద్రం ఇది. వావుదాం, కొత్త దెమ్మడిగూడ, పాత దెమ్మడిగూడ, మెటీగూడ గ్రామాల్లో 677 మంది ఓటర్లు ఇక్కడ ఓటేస్తారు. ర్యాంప్‌ ఏర్పాటు చేయలేదు. తిర్యాణి మండలంలోని పంగిడి గ్రామస్థులు నాలుగు కిలోమీటర్ల దూరంలో పంగిడిమాదరకు ఓటేయడానికి వెళ్లారు. కన్నెపల్లి, రాంబాయిగూడ గ్రామస్థులు 7 కిలోమీటర్ల దూరం వెళ్లి మెర్రిగూడలో ఓటు వేయాలి.

కెరమెరి మండలంలోని పరస్వాడ గ్రామానికి చెందిన ప్రజలు ఆరు కిలోమీటర్లు నడిచి కేలీ-బి పోలింగ్‌ కేంద్రంలో ఓటు వేయాలి. టోకెన్‌మోవాడ్‌ కేంద్రంలో మరుగుదొడ్లు, మూత్రశాలలు లేవు. పోలింగ్‌ సిబ్బంది ఒకరోజు ముందే కేంద్రానికి చేరుకునే నేపథ్యంలో మహిళా సిబ్బంది ఉంటే ఇబ్బంది పడే అవకాశం ఉంది.

లింగాపూర్‌ మండలంలోని చోర్‌పల్లి పంచాయతీ పరిధిలోని 12 గ్రామాల ప్రజలందరూ.. దాదాపు 5-6 కిలోమీటర్లు వెళ్లి చోర్‌పల్లిలో ఓటువేయాల్సి ఉంటుంది. ఒకే పోలింగ్‌ కేంద్రం ఏర్పాటు చేయడంతో దూరభారం కానుంది.

కాఫ్రి పోలింగ్‌ కేంద్రం ఇది. టైల్స్‌, విద్యుదీకరణ, మరుగుదొడ్లకు మరమ్మతులు చేస్తున్నారు. ర్యాంప్‌ లేదు. భవనం సైతం శిథిలావస్థలో ఉంది. నీటి సౌకర్యం లేదు. ఈ పోలింగ్‌ కేంద్రం పరిధిలో 383 మంది ఓటర్లు ఉన్నారు.

సిఫాబాద్‌ మండలం బలాన్‌పూర్‌ (216) పోలింగ్‌ కేంద్రం ఇది. ఇక్కడ భవనం పైకప్పు పూర్తిగా శిథిలమైంది. ఎప్పుడు కూలుతుందో తెలియని పరిస్థితి. మరుగుదొడ్లు, మూత్రశాలలు ఉన్నా నీటి వసతి లేదు. ఇవి అధ్వానంగా మారాయి. వెంకటాపూర్‌, పార్వతీగూడ, ఓట్టేఘాట్, సమతుల గుండం (వీరు మూడు కిలోమీటర్లు నడుచుకుంటూ రావాలి) గ్రామాలలో 528 ఓట్లు ఈ కేంద్రం పరిధిలో ఉన్నాయి. ఓటు వేసే సమయంలో వీరికి అవస్థలు తప్పేలా లేవు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు