logo

విద్యుత్తు ఉపకేంద్రాల్లో సౌర యూనిట్లు

విద్యుత్తు అవసరాలు రోజురోజుకు పెరుగుతుండటంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సౌరప్లాంట్ల ఏర్పాటుపై దృష్టి సారించాయి. ఇప్పటికే ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలపై సౌర యూనిట్లు ఏర్పాటు చేస్తున్నాయి.

Updated : 08 May 2024 06:54 IST

ఉమ్మడి జిల్లాలో 13 ప్లాంట్లు

న్యూస్‌టుడే, ఆదిలాబాద్‌ వ్యవసాయం: విద్యుత్తు అవసరాలు రోజురోజుకు పెరుగుతుండటంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సౌరప్లాంట్ల ఏర్పాటుపై దృష్టి సారించాయి. ఇప్పటికే ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలపై సౌర యూనిట్లు ఏర్పాటు చేస్తున్నాయి. మరోవైపు గ్రామీణ ప్రాంతాల్లో మహిళా సంఘాల సభ్యులు సోలార్‌ యూనిట్‌ ఏర్పాటు చేసుకునేందుకు రాయితీ ఇస్తున్నాయి. తాజాగా విద్యుత్తు ఉప కేంద్రాల పరిధిలో సోలార్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు అవసరమైన స్థలం అందుబాటులో ఉంటే ఆయా ప్రాంతాల్లో సౌరవిద్యుత్తు ప్లాంటు ఏర్పాటు చేయాలని కేంద్రం ఆదేశించింది.. ఇందులోభాగంగా ఉమ్మడి జిల్లా మొత్తంలో 13 ప్లాంట్ల ఏర్పాటుకు అవసరమైన స్థలం అందుబాటులో ఉందని సంబంధిత విద్యుత్తు శాఖ అధికారులు ప్రతిపాదనలు పంపించారు.

ఉమ్మడి జిల్లాలో విద్యుత్తు అవసరాలు పెరుగుతున్నాయి. నెల వారీగా విద్యుత్తు వినియోగం 150 మిలియన్‌ యూనిట్లకు పైగా ఉంటోంది. వేసవిలో కోటా కంటే ఎక్కువ విద్యుత్తును వినియోగిస్తున్నారు. పైగా 200 యూనిట్లు లోపు విద్యుత్తును వినియోగించుకునే వారికి విద్యుత్తు ఉచితంగా ఇస్తున్నారు. మరో వైపు వ్యవసాయానికి 24 గంటలు ఉచితంగా సరఫరా ఉంది. ఈ నేపథ్యంలో సౌర విద్యుత్తు ఉత్పత్తిని ప్రోత్సహిస్తే.. ప్రయోజనం ఉంటుందని భావించిన కేంద్రం ‘‘పీఎం కుసుమ్‌’’ పథకం కింద సౌర విద్యుత్తు ప్లాంట్ల ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఉమ్మడి జిల్లాలో సౌర విద్యుత్తు ఉత్పత్తికి అనువైన వాతావరణం ఉంది. ఎక్కడ లేని ఉష్ణోగ్రత, ఎండ వేడిమి ఇక్కడ ఉంటుంది. జిల్లా యంత్రాంగం చొరవ చూపితే అడవుల జిల్లా ఆదిలాబాద్‌ సౌర వెలుగుల జిల్లాగా మారే అవకాశాలు ఉన్నాయి.

రూ.4.25 కోట్ల వ్యయంతో..

సౌర విద్యుత్తు ప్లాంటు ఏర్పాటు చేసేందుకు అవసరమైన స్థలం ఉన్న ఉప కేంద్రాల వివరాలతో ప్రతిపాదనలు పంపించారు. ఆయా ఉపకేంద్రాల పరిధిలో సోలార్‌ యూనిట్‌ ఏర్పాటు చేసి వీటి నిర్వహణ బాధ్యతలను మహిళా సంఘాల సభ్యులకు అప్పజెప్పాలని ప్రభుత్వం భావిస్తోంది. రూ.4.25 కోట్ల వ్యయంతో ఒక్కో సౌర విద్యుతు ప్లాంటు ఏర్పాటు చేయనున్నారు. ఉమ్మడి జిల్లాలో 13 ఉపకేంద్రాల్లో యూనిట్ల ఏర్పాటుకు అవసరమైన స్థలం ఉందని గుర్తించి ప్రతిపాదనలు పంపించారు. కేంద్రం నుంచి ఆదేశాలు వస్తే ఆయా ప్రాంతాల్లో సౌర విద్యుత్తు ప్లాంటు ఏర్పాటు చేస్తారు. ఉత్పత్తయిన విద్యుత్తును గ్రిడ్‌కు విక్రయించేలా కార్యాచరణ రూపొందించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు