logo

వృద్ధులు, దివ్యాంగులకు నేరుగా ఓటేసే అవకాశం

పెద్దపల్లి పార్లమెంట్‌ నియోజక వర్గంలో ఈ నెల 13న నిర్వహించే ఎన్నికల కోసం అన్నీ సిద్ధం చేశామని జిల్లా పాలనాధికారి బదావత్‌ సంతోష్‌ అన్నారు. మంచిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లి అసెంబ్లీ నియోజకవర్గాల్లో మాత్రం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌ ఉంటుందన్నారు.

Published : 09 May 2024 06:38 IST

ప్రతిఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి
మంచిర్యాల పట్టణం, న్యూస్‌టుడే

‘న్యూస్‌టుడే’ ముఖాముఖిలో పాలనాధికారి బదావత్‌ సంతోష్‌

పెద్దపల్లి పార్లమెంట్‌ నియోజక వర్గంలో ఈ నెల 13న నిర్వహించే ఎన్నికల కోసం అన్నీ సిద్ధం చేశామని జిల్లా పాలనాధికారి బదావత్‌ సంతోష్‌ అన్నారు. మంచిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లి అసెంబ్లీ నియోజకవర్గాల్లో మాత్రం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌ ఉంటుందన్నారు. అర్హులందరూ ఓటు హక్కు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఎండ తీవ్రత దృష్ట్యా పోలింగ్‌ కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. జిల్లా పాలనాధికారితో ‘న్యూస్‌టుడే’ బుధవారం ముఖాముఖి నిర్వహించింది. ఆ వివరాలు..

న్యూస్‌టుడే: ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నందున పోలింగ్‌ కేంద్రాల వద్ద ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు?

పాలనాధికారి బదావత్‌ సంతోష్‌ : ఓటర్లకు ఇబ్బంది లేకుండా ప్రతి పోలింగ్‌ కేంద్రంలో టెంట్లు, కుర్చీలు ఏర్పాటు చేస్తున్నాం. అక్కడ తాగునీటి వసతి కల్పిస్తున్నాం. పోలింగ్‌ కేంద్రాల వద్ద ఏఎన్‌ఎం లేదా పారామెడికల్‌ సిబ్బంది అందుబాటులో ఉంటారు. వారి వద్ద మందులు, ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు సిద్ధంగా ఉంచుతాం.

న్యూ: పోలింగ్‌ కేంద్రాలకు ఓటు వేయడానికి వచ్చే వృద్ధులు, దివ్యాంగులు, గర్భిణులు, చంటి పిల్ల తల్లుల కోసం ఎలాంటి ఏర్పాట్లు చేస్తారు?          

పా: పోలింగ్‌ కేంద్రాల్లో వృద్ధులు, దివ్యాంగులు, గర్భిణులు, చంటి పిల్ల తల్లులను వరుసలో ఉంచకుండా నేరుగా పంపించి ఓటు వేసే అవకాశం కల్పించాం. దివ్యాంగులకు వీల్‌ఛైర్స్‌ ఏర్పాటు చేస్తున్నాం. వీరిని తీసుకెళ్లడానికి ఎన్‌సీసీ లేదా, ఎన్‌ఎస్‌ఎస్‌ వాలంటీర్లు సహాయకులుగా ఉంటారు. నడవలేని స్థితిలో ఉన్న వృద్ధులు,     దివ్యాంగులను ఇంటి నుంచి పోలింగ్‌ కేంద్రానికి తీసుకురావడానికి ఆటోలు ఏర్పాటు చేస్తాం. 85 ఏళ్లు దాటిన వృద్ధులు, దివ్యాంగులు ఇంటి నుంచే ఓటు వేసే అవకాశం కల్పించాం. ఇందుకోసం జిల్లాలో 330 మంది దరఖాస్తులు చేసుకున్నారు. వీరు ఈ నెల 5, 6 తేదీల్లో 304 మందికి ఇంటి వద్దే ఓటు వేసే అవకాశం కల్పించాం.

న్యూ: మీరు ఓటర్లకు ఇచ్చే సందేశం ఏంటి..?

పా : సమీపంలోని పెద్దపల్లి, జగిత్యాల జిల్లాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ నెల 13న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓటు వేసే అవకాశముంది. మంచిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లి నియోజక వర్గాలను మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌ ముగుస్తుంది. ప్రస్తుతం ఎండల ప్రభావం ఎక్కువగా ఉన్నందున వృద్ధులు, మహిళలు ఉదయమే ఓటు హక్కు వినియోగించుకోవాలి.  

న్యూ: సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలను ఎన్ని గుర్తించారు. అక్కడ ఎలాంటి భద్రత చర్యలు తీసుకుంటున్నారు.

పా: జిల్లాలోని మంచిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లి మూడు నియోజక వర్గాల్లో 741 పోలింగ్‌ కేంద్రాలు ఉన్నాయి. ఇందులో కొన్ని సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలను గుర్తించి అక్కడ పోలింగ్‌ కేంద్రంలో ఒక్కో సూక్ష్మపరిశీలకులను నియమించాం. పోలింగ్‌ బూత్‌ లోపల, బయట వెబ్‌ కాస్టింగ్‌ ఏర్పాటు చేస్తాం. అక్కడ పోలింగ్‌ సరళిని నేరుగా ఎన్నికల సంఘం అధికారులు (ఈసీఐ), జిల్లా పాలనాధికారి కార్యాలయంలో ఏర్పాటు చేసే కంట్రోల్‌ రూం నుంచి పరిశీలించే ఏర్పాటు చేశాం. అక్కడ ప్రత్యేక పోలీస్‌ బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాం.

న్యూ: గత అసెంబ్లీ ఎన్నికల్లో తక్కువ శాతం పోలింగ్‌ నమోదైన ప్రాంతాలను గుర్తించారా.. ఇప్పుడు అక్కడ పోలింగ్‌ శాతం పెంచడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?

పా: అసెంబ్లీ ఎన్నికల్లో మంచిర్యాల, నస్పూరు లాంటి పట్టణాలు, సింగరేణి ప్రాంతాల్లో కొంత పోలింగ్‌ శాతం తక్కువ నమోదైంది. ఎందుకంటే అక్కడ ఓటరు జాబితాలో చనిపోయిన వారి పేర్లు తొలగించకపోవడం, షిప్టింగ్‌, రెండు పేర్లు ఉండటం వంటి సమస్యలు గుర్తించాం. ఇప్పుడు ఓటరు జాబితాలో అలాంటి పేర్లను తొలగించాం. పోలింగ్‌ తక్కువ శాతం నమోదైన ప్రాంతాల్లో కళాజాత బృందాలతో అవగాహన కల్పిస్తున్నాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని