logo

కొత్త రైస్‌ మిల్లులకు త్వరలో పచ్చజెండా?

పత్తి పరిశ్రమకు పేరుగాంచిన ఆదిలాబాద్‌లో కొత్తగా రైస్‌ మిల్లుల ఏర్పాటు అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. జిల్లాలో వరి సాగు అంతగా లేకున్నా ఈ పరిశ్రమలు ఎలా వస్తున్నాయనే సందేహాలు వ్యక్తమవుతుండగా మరోపక్క కొత్తగా అయిదు

Published : 09 May 2024 06:49 IST

కేసు నమోదుతో జిల్లా కేంద్రం సమీపంలోని పొన్నారి రోడ్డులో మూసి ఉన్న రైస్‌ మిల్లు

న్యూస్‌టుడే, ఆదిలాబాద్‌ పట్టణం: పత్తి పరిశ్రమకు పేరుగాంచిన ఆదిలాబాద్‌లో కొత్తగా రైస్‌ మిల్లుల ఏర్పాటు అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. జిల్లాలో వరి సాగు అంతగా లేకున్నా ఈ పరిశ్రమలు ఎలా వస్తున్నాయనే సందేహాలు వ్యక్తమవుతుండగా మరోపక్క కొత్తగా అయిదు పరిశ్రమలకు దరఖాస్తులు వచ్చి అధికారుల వద్ద దస్త్రాలు సిద్ధంగా ఉండటం వారం పది రోజుల్లోనే అనుమతులు ఇచ్చేందుకు పావులు కదులుతుండటం ప్రాధాన్యం సంతరించుకుంటోంది.

పౌరసరఫరాల సంస్థ, పౌర సరఫరాల శాఖలకు సంయుక్తంగా ఈ రైస్‌ మిల్లులపై అజమాయిషీ ఉంటుంది. వీరి సహకారం సంపూర్ణంగా ఉండటంతోనే రైస్‌ మిల్లుల అక్రమాలు బయటకు రావడం లేదనే ప్రచారం ఉంది. జిల్లా ఉన్నతాధికారులు మౌనం వహించడం విమర్శలకు తావిస్తోంది. వరి సాగు కానప్పుడు ఈ రైస్‌ మిల్లులు ఎందుకు ఉన్నాయనేది ఎవరూ విచారణ చేపట్టడం లేదు. గత అయిదేళ్లలో ఎవరూ వీటిని తనిఖీలు చేసిన దాఖలాలు లేవు. కేసులు పెట్టిన ఘటనలూ లేవు. సంగారెడ్డి పోలీసు కేసు నమోదుతో అక్రమాలు జరుగుతున్నాయనేది తెలిసొచ్చింది. ఇతర జిల్లాల్లో ప్రభుత్వ పరంగా సేకరించిన వేలాది లారీల ధాన్యాన్ని ఇక్కడికి తెచ్చి డిమాండ్‌ ఉన్న మహారాష్ట్రకు దర్జాగా పంపిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అందుకే పంట లేకున్నా రైస్‌ మిల్లులు ఏర్పాటైనట్లు తెలుస్తోంది. కొత్తగా ఆదిలాబాద్‌లోని దస్నాపూర్‌, రాంపూర్‌, ఇతర ప్రాంతాల్లో అయిదు మిల్లుల ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది. వీటికి సంబంధించి భవనాలు సిద్ధంగా ఉన్నట్లు తెలిసింది. ఇప్పటికే తొమ్మిది మిల్లుల దందాపైనే అనేక సందేహాలు వ్యక్తమవుతుంటే ఈ కొత్త మిల్లులకు అనుమతులు ఇచ్చి ఏం చేస్తారనే ప్రశ్నలు మొదలయ్యాయి.


పాత పరిశ్రమలే..

జిల్లా కేంద్రం చుట్టు పక్కల ఆయిల్‌ మిల్లులు, జిన్నింగ్‌ మిల్లులు పదుల సంఖ్యలో మూతబడి ఉన్నాయి. అవే ఈ మిల్లు వ్యాపారులకు కలిసొస్తున్నాయి. వాటినే అద్దెకు తీసుకొని రైస్‌ మిల్లులుగా మార్చేస్తున్నారు. మొక్కుబడిగా అక్కడ ధాన్యాన్ని బియ్యంగా మార్చినట్లు చూపెడుతూ తమ పని సాఫీగా కానిస్తున్నారు. కొత్త మిల్లులకు అనుమతులు ఇంకా ఇవ్వలేదని పౌర సరఫరాల సంస్థ అధికారులు చెబుతున్నా ఉన్నత స్థాయిలోనే పైరవీలు సాగుతున్నాయనే ప్రచారం జరుగుతోంది. అక్రమ దందా కలిసి వస్తుండటంతో కొందరు పత్తి వ్యాపారులు కూడా తమ గోదాంలను మిల్లులుగా మార్చేందుకు ప్రయత్నాలు మొదలెట్టడం విశేషం. జిల్లా ఉన్నతాధికారులు దృష్టి సారిస్తేనే మిల్లుల బాగోతం బయట పడి అక్రమాలు ఆగుతాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని