logo

ఉద్ధృతంగా ఇంటింటి ప్రచారం

ఎన్నికల పోలింగ్‌కు సమయం దగ్గరపడుతోంది. ప్రచారానికి ఇంకా రెండు రోజులే మిగిలి ఉండటంతో ప్రధాన పార్టీలు కీలక నేతలు తమ ప్రచారపంథాను పూర్తిగా మార్చివేశారు.

Published : 10 May 2024 05:53 IST

ప్రతి ఓటరును కలిసేలా ప్రధాన పార్టీల ప్రణాళిక

చెన్నూరు గ్రామీణం, న్యూస్‌టుడే: ఎన్నికల పోలింగ్‌కు సమయం దగ్గరపడుతోంది. ప్రచారానికి ఇంకా రెండు రోజులే మిగిలి ఉండటంతో ప్రధాన పార్టీలు కీలక నేతలు తమ ప్రచారపంథాను పూర్తిగా మార్చివేశారు. ఇన్ని రోజులు సభలు, సమావేశాలు నిర్వహించి ఒక్క దగ్గరే ఓటర్లను కలిసిన నేతలు బూత్‌స్థాయిలో ప్రచారానికి శ్రీకారం చుట్టారు. పార్టీ శ్రేణులకు బాధ్యతలు అప్పగించి ఇంటింటికి వెళ్లి ఓటరును నేరుగా కలిసేలా దిశానిర్దేశం చేశారు. ప్రతీబూత్‌లో మెజార్టీ ఓట్లు పొందడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. గెలుపే లక్ష్యంగా బూత్‌స్థాయి నాయకులు అన్నీతామై అభ్యర్థుల తరఫున ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. దీంతో పల్లెలు, పట్టణాల్లో ఎక్కడ చూసిన ప్రధాన పార్టీల ప్రచారం హోరెత్తుతోంది. జిల్లాలోని మూడు నియోజకవర్గాలో ప్రధాన పార్టీల క్షేత్రస్థాయి ప్రచారతీరుపై కథనం.

అధినేత బస్సుయాత్రతో శ్రేణుల్లో జోష్‌

బూత్‌స్థాయి ప్రచారం తీరును పార్టీ కార్యాలయంలో సమీక్షించుకుంటున్న భారాస శ్రేణులు

మంచిర్యాల జిల్లా కేంద్రంలో నిర్వహించిన భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ బస్సుయాత్ర పార్టీ నేతలు, శ్రేణుల్లో జోష్‌ నింపింది. జిల్లాలోని మూడు నియోజకవర్గాల నుంచి పెద్దసంఖ్యలో సమావేశానికి హాజరుకావడంతో పార్టీ శ్రేణులు రెట్టింపు ఉత్సాహంతో ముందుకు సాగుతున్నారు. అభ్యర్థి గెలుపు కోసం ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. పురపాలికలు, మండలాల వారీగా బూత్‌స్థాయిలో పర్యటిస్తూ బూత్‌స్థాయిలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. నేతలు సూచించిన విధంగా ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ ప్రత్యర్థుల బలహీనతలు వివరిస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. బూత్‌స్థాయిలో చేపట్టిన ప్రచారంపై సమీక్ష చేసుకుంటున్నారు.

లక్ష్యం నిర్ధేశించి.. బాధ్యతలు అప్పగించి  

చెన్నూరులోని పద్మనగర్‌లో ప్రచారం చేస్తున్న కాంగ్రెస్‌ నాయకులు

కొన్ని రోజులుగా సభలు, సమావేశాల నిర్వహణ ద్వారా కాంగ్రెస్‌ కీలక నేతలు ఓటర్లు కలిశారు. రాష్ట్రంలో ఆరు గ్యారంటీల అమలు తీరు వివరించడంతోపాటు కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే కలిగే ప్రయోజనాలను చెబుతూ ఓటర్లకు ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఉదయాన్నే ఉపాధిహామీ పని స్థలాలకు వెళ్లి వందలాది మంది కూలీలను ఓకే చోట కలిశారు. అయితే పోలింగ్‌ సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో నేరుగా ఓటర్లను కలిసే కార్యక్రమాలను చేపట్టారు. జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో బూత్‌ల వారీగా పార్టీ శ్రేణులకు బాధ్యతలను అప్పగించి నేరుగా ఓటర్లను కలుస్తున్నారు. వారికి ముందుగానే లక్ష్యాన్ని నిర్దేశిస్తున్నారు. ఓటర్ల నాడిని తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రచారానికి మరో మూడు రోజులే సమయం మిగిలి ఉండటంతో వీలైనంత ఎక్కువ మంది ఓటర్లను కలిసేందుకు క్షేత్రస్థాయిలో శ్రమిస్తున్నారు.

బూత్‌ స్థాయికే ప్రాధాన్యం

చెన్నూరులో ప్రచారం చేస్తున్న భాజపా నేతలు, కార్యకర్తలు

జిల్లాలోని భాజపా శ్రేణులు ఎన్నికల ప్రచారంలో ఆది నుంచి ప్రత్యర్థుల కంటే ముందుగానే ఉన్నట్లు తెలుస్తోంది. సభలు, సమావేశాల నిర్వహణ కంటే బూత్‌స్థాయి ప్రచారానికే ప్రాధాన్యత ఇచ్చారు. అభ్యర్థిని ప్రకటించగానే నేతల ఆదేశాలతో క్షేత్రస్థాయి ప్రచారాన్ని కార్యకర్తలు చేపట్టారు. గతం నుంచి బూత్‌స్థాయిలో బాధ్యతలు నిర్వర్తిస్తున్న నాయకులు, కార్యకర్తలు గ్రామాల వారీగా పర్యటిస్తూ ఓటర్లకు కలిశారు. ఇక పట్టణాల్లో చేరికలతోపాటు ఇంటింటా ప్రచారాన్ని చేపట్టారు. నేతలు, నాయకులందరూ కలిసి పట్టణాల్లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. వీరికి అనుబంధ సంఘాల నాయకులు మద్దతుగా నిలుస్తున్నారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని