logo

గిరిజన విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తాం

పదేళ్లు అధికారంలో ఉన్న భారాస, భాజపాలు జిల్లాలో విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయడంలో విఫలమయ్యాయని రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి సీతక్క విమర్శించారు.

Published : 10 May 2024 06:17 IST

అభివాదం చేస్తున్న మంత్రి సీతక్క, చిత్రంలో కంది శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్‌

ఆదిలాబాద్‌ అర్బన్‌, న్యూస్‌టుడే : పదేళ్లు అధికారంలో ఉన్న భారాస, భాజపాలు జిల్లాలో విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయడంలో విఫలమయ్యాయని రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి సీతక్క విమర్శించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం జిల్లాలో విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తుందని హామీ ఇచ్చారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా జిల్లా కేంద్రంలో గురువారం కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర మంత్రి సీతక్క, నియోజకవర్గ ఇన్‌ఛార్జి కంది శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తలు ద్విచక్రవాహన ర్యాలీ నిర్వహించారు. ప్రజాసేవాభవన్‌ నుంచి ప్రారంభమైన ర్యాలీ పట్టణంలోని పలు కూడళ్ల గుండా సాగింది. మంత్రి మాట్లాడుతూ భాజపా రాజ్యాంగాన్ని మార్చే కుట్రకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. భారాస, భాజపా వేర్వేరు కాదని, రెండూ కలిసి కాంగ్రెస్‌ పార్టీని ఓడించేందుకు కుమ్మక్కు అయ్యాయని దుయ్యబట్టారు. ఆదిలాబాద్‌ లోక్‌సభ చరిత్రలో మొదటిసారిగా కాంగ్రెస్‌ పార్టీ ఓ ఆదివాసీ ఆడబిడ్డకు అవకాశం ఇచ్చిందని, ఆత్రం సుగుణను గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందన్నారు. మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్‌, డీసీసీబీ ఛైర్మన్‌ అడ్డి భోజారెడ్డి, మంచికట్ల ఆశమ్మ, జహీర్‌ రంజానీ, కలాల శ్రీనివాస్‌, కొండ గంగాధర్‌, లోక ప్రవీణ్‌రెడ్డి, శంతన్‌రావు, సాయిచరణ్‌గౌడ్‌, చారి తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని