logo

అక్రమార్కులను వదిలేదే లే!

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌కు అనకాపల్లి జిల్లా వాసులు సోమవారం ఘన స్వాగతం పలికారు. వారాహి విజయయాత్రలో భాగంగా కశింకోట మండలం విస్సన్నపేటలోని భూ అక్రమాలు పరిశీలించడానికి ఆయన సోమవారం విచ్చేశారు.

Updated : 15 Aug 2023 13:36 IST

పవన్‌ కల్యాణ్‌ హెచ్చరిక
అడుగడుగునా జన నీరాజనం

వాహనంపై  జన సేనాని

ర్యాలీలో కోలాహలం

అనకాపల్లి/ పట్టణం, గ్రామీణం, కశింకోట, న్యూస్‌టుడే: జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌కు అనకాపల్లి జిల్లా వాసులు సోమవారం ఘన స్వాగతం పలికారు. వారాహి విజయయాత్రలో భాగంగా కశింకోట మండలం విస్సన్నపేటలోని భూ అక్రమాలు పరిశీలించడానికి ఆయన సోమవారం విచ్చేశారు. అగనంపూడి టోల్‌గేటు నుంచి మారేడుపూడి, గొల్లవానిపాలెం, అనకాపల్లి జాతీయ రహదారి, కొత్తూరు, కశింకోట ప్రాంతాల్లో ప్రజలు రహదారిపైకి వచ్చారు. మహిళలు పవన్‌కల్యాణ్‌కు హారతులు ఇచ్చారు. జనసైనికులు బైకుల ర్యాలీతో సందడి వాతావరణం నెలకొంది.  

ఆర్చిపైకి ఎక్కి ఆర్తిగా..

పూలవర్షం కురిపిస్తూ..

కశింకోట మండలం బయ్యవరం, విస్సన్నపేట గ్రామాల్లో పవన్‌కల్యాణ్‌ రాకకోసం రహదారులపై చాలాసేపు వేచి ఉన్న ప్రజలు ఆయన రాగానే పూలవర్షం కురిపించారు. మహిళలు, గ్రామస్థులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. పవన్‌కల్యాణ్‌ కిందకు దిగి వివాదాస్పద ప్రాంతాన్ని పరిశీలించడానికి ప్రయత్నించగా జన సందోహంతో వీలుకాలేదు. దీంతో వాహనంపై నుంచే మీడియాతో మాట్లాడి అనంతరం ఇక్కడికి వచ్చిన వారికి అభివాదం చేశారు. విస్సన్నపేట భూములను పరిశీలించడానికి వచ్చిన పవన్‌కల్యాణ్‌ మీడియా వాహనం ముందు మాట్లాడుతూ కొండపై మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ నిర్మించిన గెస్ట్‌హౌస్‌ ఇదేనంటూ చూపించడంతో జనసైనికులు కేరింతలు కొట్టారు. భూ అక్రమాలు చేసే ఎవరినీ వదిలిపెట్టేది లేదంటూ ఆయన హెచ్చరించారు. మీడియాతో పవన్‌కల్యాణ్‌ మాట్లాడుతుండగా పీఏసీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ వెళ్లి భూములను పరిశీలించారు. అక్రమ తవ్వకాలు, కొండమీద నిర్మించిన గెస్ట్‌హౌస్‌ను పరిశీలించారు. భూ ఆక్రమణల్లో మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ అనుచరుల ప్రమేయం తదితరాలను పవన్‌కల్యాణ్‌కు జనసేన పార్లమెంట్‌ నియోజకవర్గ అధికార ప్రతినిధి దూలం గోపి వివరించారు. లోకాయుక్తలో తాను వేసిన కేసు వివరాలు వెల్లడించారు. నియోజకవర్గ అధ్యక్షులు పరుచూరి భాస్కరరావు, నాయకులు కోన తాతారావు, టి.శివశంకర్‌, బొలిశెట్టి సత్య, సుందరపు విజయ్‌కుమార్‌, పంచకర్ల రమేష్‌, గడసాల అప్పారావు, అంగా ప్రశాంతి, పీవీఎస్‌ఎన్‌ రాజు, గంగులయ్య, శివదత్‌ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పలువురు వినతిపత్రాలు అందజేశారు. తుమ్మపాల చక్కెర కర్మాగారం తెరిపించాలని, ఫార్మా కంపెనీల కాలుష్యం నుంచి రక్షణ కల్పించాలని అగనంపూడిలో వినతిపత్రం అందజేశారు. తాడి గ్రామం తరలింపు పవన్‌కల్యాణ్‌తోనే సాధ్యం అంటూ నినాదాలు చేశారు.

అభిమానులంతే.. తగ్గరంతే..

జాతీయ పతాకంతో    వీర మహిళ

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని