logo

సెజ్‌ కంపెనీ ప్రమాదంలో మరో కార్మికుడి మృతి

సెజ్‌ సింబయో కంపెనీలో జరిగిన ప్రమాదంలో మరో కార్మికుడు మృతి చెందాడు.

Published : 28 Mar 2024 02:10 IST

రాంబిల్లి, న్యూస్‌టుడే: సెజ్‌ సింబయో కంపెనీలో జరిగిన ప్రమాదంలో మరో కార్మికుడు మృతి చెందాడు. పెదకలవలాపల్లి గ్రామానికి చెందిన కలవలాపల్లి నరిసింగరావు (48) 13 రోజుల పాటు మృత్యువుతో పోరాడి మంగళవారం రాత్రి మృతి చెందాడని పోలీసులు చెప్పారు.  సింబయో కంపెనీలో ఈ నెల 14న ప్రమాదం జరిగి ముగ్గురు కార్మికులు తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. ఆరిలోవలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్నారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో చోడవరం మండలం గోవాడకు చెందిన ఎ.రాము (50) సోమవారం మృతి చెందగా, పెదకలవలాపల్లి గ్రామానికి చెందిన కలవలాపల్లి నరిసింగరావు మంగళవారం రాత్రి మృతి చెందాడు. మృతుడికి భార్య కొత్తమ్మ, ఇద్దరు కుమారులు ఉన్నారు. బాధిత కుటుంబానికి కంపెనీ యాజమాన్యం రూ.20 లక్షలు, గుత్తేదారు రూ.2.75 లక్షలు ఇచ్చేందుకు అంగీకారం కుదిరిందని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు జి.దేముడునాయుడు, పెదకలవలాపల్లి ఎంపీటీసీ మాజీ సభ్యుడు కర్రి ప్రసాద్‌ చెప్పారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారని చెప్పారు.


స్నేహితుడే హంతకుడు

మాడుగుల గ్రామీణం, న్యూస్‌టుడే: మద్యం మత్తులో స్నేహితుల మధ్య మాటామాటా పెరగడం ఒకరి ప్రాణాలు పోవడానికి కారణమైంది. గాదిరాయికి చెందిన కర్రి కొండబాబు ఈనెల 21 గురువారం రాత్రి గ్రామ శివారులోని చిట్టిగెడ్డలో అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందాడు. కొండబాబు అతడి స్నేహితుడి చేతిలోనే హత్యకు గురైనట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. మాడుగుల సీఐ సోమినాయుడు, ఎస్సై దామోదర్‌నాయుడు తెలిపిన వివరాల ప్రకారం.. కొండబాబు ఇదే గ్రామానికి చెందిన కర్రి భాస్కరరావుతో స్నేహంగా ఉండేవాడు. ఈనెల 21న స్నేహితులతో కలిసి బయటకు వెళ్తున్నానని చెప్పిన కొండబాబు తిరిగి ఇంటికి రాలేదు. రెండు రోజుల తరవాత చిట్టిగెడ్డలో అతడి మృతదేహం లభ్యమైంది. తన భర్త మృతిపై అనుమానాలు ఉన్నాయంటూ భార్య సుశీల ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సంఘటన జరిగిన రోజు రాత్రి చిట్టిగెడ్డ కల్వర్టుపై కొండబాబు, భాస్కరరావు మద్యం తాగుతుండగా ఓ ఫోన్‌ కాల్‌ విషయమై ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. ఆ సమయంలో భాస్కరరావు కోపంతో కొండబాబును తోసేశాడు. కల్వర్టుపై నుంచి గెడ్డలో పడిపోవడంతో అతడు మృతిచెందాడు. పోలీసుల దర్యాప్తులో ఈ విషయం వెల్లడవడంతో బుధవారం నిందితుడిని అరెస్ట్‌ చేసి, రిమాండ్‌కు తరలించామని తెలిపారు.


బాలికపై అత్యాచార యత్నం..

పోక్సో కేసు నమోదు

నర్సీపట్నం గ్రామీణం, న్యూస్‌టుడే: బాలికపై అత్యాచార యత్నానికి పాల్పడిన యువకుడిపై నర్సీపట్నం పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. గ్రామీణ ఎస్సై భీమరాజు తెలిపిన వివరాల ప్రకారం.. నర్సీపట్నం మండలం దుగ్గాడ గ్రామానికి చెందిన 17 ఏళ్ల బాలిక బుధవారం ఇంట్లో ఒంటరిగా ఉంది. ఈ విషయం కనిపెట్టిన నాతవరం మండలం గునుపూడికి చెందిన సాయి (34) ఆమెపై బలాత్కారం చేయబోయాడు. బాలిక భయపడి కేకలు వేయడంతో ఇంట్లో నుంచి పారిపోయాడు. ఈ మేరకు బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేశారు. నిందితుడు సాయి విజయవాడలో కాపలాదారుడిగా పనిచేస్తున్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని