logo

అక్రమ మద్యంపై ఉక్కుపాదం

అక్రమంగా మద్యం నిల్వ ఉంచినా, రవాణా చేసినా, విక్రయించినా కఠిన చర్యలు తప్పవని పాడేరు ఏఏస్పీ ధీరజ్‌ పేర్కొన్నారు. జోలాపుట్టులో ఒడిశా మద్యం పట్టుబడిన కేసులో నిందితుడిని అరెస్టు చేశారు.

Published : 16 Apr 2024 02:15 IST

నిందితుడి వివరాలు వెల్లడిస్తున్న ఏఏస్పీ ధీరజ్‌, సీఐ రమేష్‌

ముంచంగిపుట్టు, న్యూస్‌టుడే: అక్రమంగా మద్యం నిల్వ ఉంచినా, రవాణా చేసినా, విక్రయించినా కఠిన చర్యలు తప్పవని పాడేరు ఏఏస్పీ ధీరజ్‌ పేర్కొన్నారు. జోలాపుట్టులో ఒడిశా మద్యం పట్టుబడిన కేసులో నిందితుడిని అరెస్టు చేశారు. దీనికి సంబంధించిన వివరాలను సోమవారం ముంచంగిపుట్టు పోలీసుస్టేషన్‌లో వెల్లడించారు. ఈ నెల 6న జోలాపుట్టులో అక్రమ మద్యం నిల్వ ఉంచి విక్రయిస్తున్నట్లు అందిన సమాచారంతో జి.మాడుగుల సీఐ రమేష్‌, స్థానిక ఎస్సై రవీంద్ర తనిఖీలు నిర్వహించారు. గ్రామంలో నివాసం ఉంటున్న వైకాపా నాయకులు వారానాసి మణికేశవరావు ఇంటి గోదాములో అక్రమంగా నిల్వ ఉంచిన 5424 సీసాలతో ఉన్న 113 మద్యం కేసులను పట్టుకున్నారని చెప్పారు. వాటి విలువ రూ.10.84 లక్షలు ఉంటుందని పేర్కొన్నారు. మణికేశవరావు, ఆయన కుమారుడు జగదీష్‌పై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. నిందితులు అప్పట్లో పరారవగా.. సోమవారం వాహనాల తనిఖీల సమయంలో మణికేశవరావు పట్టుబడ్డాడని చెప్పారు. జగదీష్‌ పరారీలో ఉన్నాడని, త్వరలోనే పట్టుకుంటామని పేర్కొన్నారు.

సాధారణ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు చర్యలు చేపడుతున్నామని ఏఏస్పీ ధీరజ్‌ తెలిపారు.బుంగాపుట్టు, కొసొంపుట్టు, లంగ్బాపొదొర్‌ గ్రామాల్లో ఉన్న పోలింగ్‌ కేంద్రాలను స్థానిక సమస్యల దృష్ట్యా లక్ష్మీపురం, వనుగుమ్మ గ్రామాలకు మార్చుతున్నామని తెలిపారు. గతంలో మావోయిస్టుల ప్రభావంతో ఎన్నికలు ప్రశాంతంగా సాగని పెదబయలు మండలంలోని గిన్నెలకోట, ఇంజరి, బూసీపుట్టు గ్రామాల్లో పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వివరించారు. ముంచంగిపుట్టు పోలీసుస్టేషన్‌ సిబ్బందికి పలు సూచనలు అందించారు. సీఐ రమేష్‌, ఎస్సై రవీంద్ర పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని