logo

హే జగన్‌.. పార్థసారథి ఉత్సవాలకు నిధులేవీ?

ఐదేళ్ల కిందటి వరకు నిత్య దీప ధూప నైవేద్యాలతో కళకళలాడిన ఆలయాలు జగన్‌ సీఎం అయ్యాక వెలవెలబోతున్నాయి. దేవాదాయ శాఖ పరిధిలోని ఆలయాలకు కమిటీలు వేసేందుకూ వైకాపా ప్రభుత్వం చొరవ చూపలేదు.

Published : 16 Apr 2024 02:22 IST

ఐదేళ్లలో కమిటీకీ దిక్కులేదు
మాడుగుల, న్యూస్‌టుడే

ఐదేళ్ల కిందటి వరకు నిత్య దీప ధూప నైవేద్యాలతో కళకళలాడిన ఆలయాలు జగన్‌ సీఎం అయ్యాక వెలవెలబోతున్నాయి. దేవాదాయ శాఖ పరిధిలోని ఆలయాలకు కమిటీలు వేసేందుకూ వైకాపా ప్రభుత్వం చొరవ చూపలేదు. నిధుల మంజూరు లేకపోవడం, అర్చకులకు వేతనాలు ఇవ్వకపోవడంతో దీపం పెట్టే నాథుడే లేకుండా పోయారు. ఏడాదికోసారి చేసే ఉత్సవాలను నిధుల లేమితో కంటితుడుపుగా నిర్వహించాల్సి వస్తోందని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

  • దేవాదాయ శాఖ పరిధిలో మాడుగులలో ఎనిమిది ఆలయాలు ఉన్నాయి. వీటికి 1200 ఎకరాల భూములున్నాయి. ఆలయాల నిర్వహణ, ఉత్సవాలను పర్యవేక్షించేందుకు కమిటీలను ప్రభుత్వం నియమించడం లేదు. ధర్మకర్తలు లేక, ఉత్సవ కమిటీల నియామకం జరగక ఆలయాలు కళతప్పాయి. శ్రీరామ నవమి సందర్భంగా ఏటా పార్థసారథి ఉత్సవాల నిర్వహణ ఆనవాయితీగా వస్తోంది. నిధులు, కమిటీలు లేక ఉత్సవాలను ఎలా విజయవంతం చేయాలో తెలియక అర్చకులు తలలు పట్టుకుంటున్నారు.

  • వందేళ్ల కిందట భక్తుల సహకారంతో పార్థసారథి ఆలయాన్ని గోవింద దాసు నిర్మించారు. అప్పట్లో 500 మెట్లతో కొండపైన గర్భగుడిలో శ్రీకృష్ణ సమేత రుక్ష్మిణి సత్యభామ విగ్రహాలు, దిగువన ఉత్సవ మూర్తుల విగ్రహాలను ప్రతిష్ఠించారు. ఈ ఆలయానికి 350 ఎకరాల భూములున్నాయి. ఇవన్నీ ఆక్రమణదారుల చేతుల్లో చిక్కుకున్నాయి. శిస్తు వసూలు చేసే వారే లేరు. పైసా ఆదాయం లేక భక్తులు ఇచ్చే చందాలతో ఉత్సవాలు చేస్తున్నారు. ఈ ఏడాది చందాలు ఇవ్వలేమని భక్తులు చేతులెత్తేయడంతో ఉత్సవాల నిర్వహణ ప్రశ్నార్థకంగా మారింది.
  • శ్రీరామ నవమి నుంచి పది రోజులపాటు జరిగే పార్థసారథి ఉత్సవాలకు గతంలో చలువ పందిళ్లు వేసి విద్యుద్దీపాలతో ఆలయాన్ని ముస్తాబు చేసే వారు. అర్చకులకు వేతనాలు చెల్లించేందుకూ నిధుల్లేక దేవాదాయ శాఖ అధికారులు మొండి చేయి చూపుతున్నారు. సుమారు రూ.3 లక్షల వరకు ఖర్చయ్యే ఉత్సవాలకు.. ఈ ఏడాది భక్తుల చందాలతో సున్నాలు, పందిళ్లు వేయించారు. కొండపైన తాగునీరు, ప్రసాదాలు, తిరువీధి ఉత్సవంలో భాగంగా స్వామివారి ఊరేగింపునకు అయ్యే ఖర్చులు ఎవరు భరిస్తారన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఏడాదిగా వేతనాలు లేవు, మేమేం చేయగలమని అర్చకులు చెబుతున్నారు.

ఆర్థిక సాయం చేస్తాం
- సత్యనారాయణ, ఈఓ

28 ఆలయాల పర్యవేక్షణ చూడాల్సి ఉంది. వాటికి తోడు పార్థసారథి ఆలయాన్ని అదనంగా కేటాయించారు. ఇప్పటివరకు రికార్డుల పరిశీలించలేదు. ఏటా ఉత్సవాలకు ఎంత కేటాయిస్తున్నారో అంత ఇస్తాం. అప్పటివరకు దాతలు ముందుకువచ్చి చేయూత అందించాలని కోరుతున్నాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని