logo

వైకాపాకు రాజవొమ్మంగి జడ్పీటీసీ సభ్యురాలి రాజీనామా

రంపచోడవరం నియోజకవర్గంలో వైకాపాకు భారీ షాక్‌ తగిలింది. వైకాపాకు చెందిన రాజవొమ్మంగి జడ్పీటీసీ సభ్యురాలు వడుగుల జ్యోతి గురువారం పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

Published : 19 Apr 2024 02:07 IST

మాట్లాడుతున్న జడ్పీటీసీ సభ్యురాలు జ్యోతి. పక్కన రవి, అప్పారావు

రాజవొమ్మంగి, న్యూస్‌టుడే: రంపచోడవరం నియోజకవర్గంలో వైకాపాకు భారీ షాక్‌ తగిలింది. వైకాపాకు చెందిన రాజవొమ్మంగి జడ్పీటీసీ సభ్యురాలు వడుగుల జ్యోతి గురువారం పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆమె భర్త, వైకాపా మండల యువజన విభాగం ఉపాధ్యక్షుడు రవికుమార్‌, రాజవొమ్మంగి మాజీ సర్పంచి చీడిపల్లి అప్పారావు కూడా పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా జ్యోతి విలేకరులతో మాట్లాడుతూ పార్టీ వైఖరి, నాయకుల వ్యవహార శైలి నచ్చక రాజీనామా చేశామన్నారు. కష్టించి పనిచేసిన నాయకులకు, కార్యకర్తలకు న్యాయం చేయలేకపోతున్నామన్నారు. తన భర్త రవి 14 ఏళ్లు పార్టీకి సేవలందించారని, ఎమ్మెల్సీ అనంత బాబు అనుచరుడిగా ఉన్నారన్నారు. మండలంలో ప్రొటోకాల్‌ పాటించడం లేదని, పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాలకు కనీస సమాచారం కూడా ఉండటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధిష్ఠానం దృష్టికి సమస్యను తీసుకువెళ్లినా మార్పు రాలేదన్నారు. జడ్పీటీసీ సభ్యురాలిగా గెలిచిన తర్వాత కనీసం ప్రమాణ స్వీకారం జరగలేదన్నారు. ఎంపీడీఓ కార్యాలయంలో ప్రత్యేకంగా కుర్చీ కూడా లేకపోవడంతో అక్కడికి వెళ్లలేని పరిస్థితులు ఉన్నాయన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో రాత్రనక, పగలనక కష్టించి పనిచేసిన కార్యకర్తలకు గుర్తింపు లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాజవొమ్మంగి మాజీ సర్పంచి చీడిపల్లి అప్పారావు మాట్లాడుతూ సీనియర్లను గుర్తించకుండా వాళ్ల సొంత నిర్ణయాలతోనే ముందుకు సాగుతున్నారని, కార్యకర్తల మనోభావాలను దెబ్బతీస్తున్నారన్నారు. వైకాపా మండల యువజన ఉపాధ్యక్షుడు రవికుమార్‌ మాట్లాడుతూ మూడు నెలలుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నా మండల నాయకుల్లో మార్పు కనిపించకపోవడంతో పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. వీరంతా తెదేపాలోకి వెళ్లనున్నట్లు సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని