logo

జోరందుకున్న నామినేషన్లు

సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ జోరందుకుంది.

Published : 23 Apr 2024 02:57 IST

అరకు పార్లమెంటు స్థానానికి నామినేషను వేస్తున్న మాజీ ఎంపీ కొత్తపల్లి గీతతో కేంద్ర మంత్రి

పాడేరు, న్యూస్‌టుడే: సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ జోరందుకుంది. అరకు అసెంబ్లీ నియోజకవర్గానికి సోమవారం అయిదు నామినేషన్లు దాఖలయ్యాయని రిటర్నింగ్‌ అధికారి, ఐటీడీఏ పీవో వి.అభిషేక్‌ తెలిపారు. వైకాపా అభ్యర్థి రేగం మత్స్యలింగం రెండు సెట్ల నామినేషన్లు వేశారు. రేగం చాణక్య వైకాపా తరఫున డమ్మీ నామినేషన్‌ వేశారు. స్వతంత్ర అభ్యర్థి మొగలి చంద్రకళ, బీఎస్పీ అభ్యర్థి లకే రాజారావు మరొక సెట్‌ నామపత్రాలు సమర్పించారు.

పాడేరులో భారీ ర్యాలీ నిర్వహించిన తెదేపా అభ్యర్థి గిడ్డి ఈశ్వరి, మూడు పార్టీల నాయకులు, కార్యకర్తలు

పాడేరు అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి నాలుగు నామినేషన్లు దాఖలయ్యాయని రిటర్నింగ్‌ అధికారి, జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ భావన తెలిపారు. పాడేరు అసెంబ్లీ తెదేపా అభ్యర్థి గిడ్డి ఈశ్వరి, బీఎస్పీ తరఫున సుర్ల అప్పారావు, కాంగ్రెస్‌ పార్టీ నుంచి సతక బుల్లిబాబు, స్వతంత్ర అభ్యర్థి వంతల సుబ్బారావు నామపత్రాలు సమర్పించారు.

నామినేషన్లు వేసేందుకు భారీ ర్యాలీలతో అభ్యర్థులు రావడంతో పాడేరులో సందడి వాతావరణం నెలకొంది. పాడేరు అసెంబ్లీ కూటమి అభ్యర్థి గిడ్డి ఈశ్వరి ముందుగా మోదకొండమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. బీ-ఫాంను అమ్మవారి సన్నిధిలో పెట్టి ప్రత్యేక పూజలు చేశారు. తెదేపా, జనసేన, భాజపా నాయకులు కుమ్మరిపుట్టులోని ఈశ్వరి నివాసం నుంచి ర్యాలీగా వచ్చారు. అరకులోయ అసెంబ్లీ వైకాపా అభ్యర్థి రేగం మత్స్యలింగం, పార్టీ కార్యకర్తలు అరకు నుంచి హుకుంపేట వరకు భారీ ర్యాలీగా చేరుకున్నారు. ఎమ్మెల్సీ కుంభా రవిబాబు, ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ, జడ్పీ అధ్యక్షురాలు సుభద్ర, మత్స్యలింగం సతీమణి హాజరయ్యారు. నామినేషన్ల ప్రక్రియలో ఎక్కడా ఎలాంటి సంఘటనలు జరగకుండా సెబ్‌ సీఐ హిమగిరి, సీఐ ప్రవీణ్‌కుమార్‌, ఎస్సైలు, సిబ్బంది బందోబస్తు ఏర్పాటు చేశారు.

అరకు రిటర్నింగ్‌ అధికారి అభిషేక్‌కు నామినేషన్‌ పత్రాలు సమర్పిస్తున్న వైకాపా అభ్యర్థి రేగం మత్స్యలింగం, ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ, ఎమ్మెల్సీ రవిభాబు, జిల్లా పరిషత్‌ అధ్యక్షురాలు సుభద్ర

నాలుగో రోజు 13 ...

జిల్లా పరిధిలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో సోమవారం 13 నామినేషన్లు దాఖలైనట్టు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ విజయ సునీత తెలిపారు.. అరకు అసెంబ్లీకి ఐదు, పాడేరు అసెంబ్లీకి నాలుగు, రంపచోడవరం అసెంబ్లీకి నాలుగు నామినేషన్లు దాఖలయ్యాయని చెప్పారు.

స్కామ్‌ల ప్రభుత్వాన్ని సాగనంపండి

పార్వతీపురం పట్టణంలో నామినేషన్‌ వేయడానికి ర్యాలీగా వస్తున్న కూటమి అభ్యర్థిని గీత, నాయకులు

పార్వతీపురం, న్యూస్‌టుడే: అరకు పార్లమెంటరీ స్థానానికి ఐదుగురు నామపత్రాలు దాఖలు చేశారు. అరకు స్థానానికి భాజపా అభ్యర్థిగా కొత్తపల్లి గీత జిల్లా ఎన్నికల అధికారి నిశాంత్‌కుమార్‌కు నామపత్రాలు అందజేశారు. ఈమెతో పాటు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి ఫగ్గన్‌ సింగ్‌ కులస్తే పాల్గొన్నారు. గీత మాట్లాడుతూ స్కామ్‌ల వైకాపా ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాల్సిన అవసరం ఉందన్నారు. పార్వతీపురం అసెంబ్లీ కూటమి అభ్యర్థి విజయచంద్ర, భాజపా జిల్లా అధ్యక్షుడు డి.శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్సీ జగదీశ్‌, భాజపా, జనసేన, తెదేపా నాయకులు ఎస్‌.ఉమామహేశ్వరరావు, ఎ.మోహనరావు పాల్గొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని