logo

పండుటాకులపై పగ

సామాజిక పింఛన్లపైనే ఆధారపడి జీవిస్తున్న వృద్ధులు, దివ్యాంగులు పింఛను సొమ్ము పొందేందుకు నానా అగచాట్లు పడుతున్నారు.

Updated : 03 May 2024 04:50 IST

రంపచోడవరం యూనియన్‌ బ్యాంకు వద్ద బారులుతీరిన పింఛను లబ్ధిదారులు

అరకులోయ/ పట్టణం న్యూస్‌టుడే: సామాజిక పింఛన్లపైనే ఆధారపడి జీవిస్తున్న వృద్ధులు, దివ్యాంగులు పింఛను సొమ్ము పొందేందుకు నానా అగచాట్లు పడుతున్నారు. గురువారం ఉదయం సుదూర ప్రాంతాల నుంచి పింఛన్‌దారులు బ్యాంకుల వద్ద నగదు తీసుకునేందుకు బారులు తీరారు. అరకులోయ స్టేట్‌బ్యాంక్‌ వద్ద నిర్వాహకులు టెంట్‌ ఏర్పాటు చేశారు. వందలాది మంది లబ్ధిదారులు గంటల తరబడి లైన్లలో ఉండి సొమ్ము తీసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. అరకులోయ మండలం మాదల పంచాయతీ సరుబెడ్డ గ్రామానికి చెందిన కిల్లో మొనిమ్మ పింఛను సొమ్ము కోసం అరకులోయ ఎస్‌బీఐ వద్దకు వచ్చింది. వినియోగదారుల సేవా కేంద్రం వద్ద సొమ్ము తీసుకునేందుకు ప్రయత్నించగా ఖాతాలో నగదు జమ కాలేదని సిబ్బంది చెప్పడంతో నిరాశగా ఆమె వెనుదిరగాల్సి వచ్చింది.  

రంపచోడవరం, న్యూస్‌టుడే: పింఛన్లు తీసుకొనేందుకు దూర ప్రాంతాల నుంచి రంపచోడవరం బ్యాంకుకు వచ్చేందుకు వృద్ధులు నానా అవస్థలుపడ్డారు. ఒక్క రంపచోడవరం మండలంలోనే 4,500 పింఛన్లు ఉన్నాయి. దీంతోపాటు మారేడుమిల్లి, దేవీపట్నం మండలాల్లో కొంతమంది లబ్ధిదారులకు రంపచోడవరంలోనే బ్యాంకు ఖాతాలు ఉన్నాయి. వీరంతా గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు బారులు తీరారు. కొంతమందికి పింఛన్ల నగదు పడలేదని చెప్పడంతో నిరాశతో వెనుదిరిగారు.

అరకులోయ ఎస్‌బీఐ సేవా కేంద్రం వద్ద  పింఛనుదారుల రద్దీ

దేవీపట్నం, న్యూస్‌టుడే: మండలంలోని కొంతమంది పింఛనుదారులకు రెండో రోజు అవస్థలు తప్పడం లేదు. గురువారం పింఛను దారులు బ్యాంకులకు వెళ్తే బ్యాంకు అధికారులు డబ్బులు పడలేదని చెప్పడంతో ఆందోళన చెందారు. మరికొంత మందికి ఏ బ్యాంకు ఖాతాలో పింఛను సొమ్ములు వేశారో తెలియని పరిస్థితి నెలకొంది.

గంగవరం, న్యూస్‌టుడే: గంగవరంలో ఉదయం నుంచి పింఛన్ల కోసం వృద్ధులు బ్యాంకులు, సేవా కేంద్రాల వద్ద  పడిగాపులు కాశారు. 10 గంటలకు వరకు స్టేట్‌బ్యాంకు తెరవరని ఉదయాన్నే సేవా కేంద్రాల వద్ద క్యూలుకట్టారు. కొందరి ఖాతాల్లో నగదు జమకాగా వాటిని తీసుకుని వెళ్లగా, కొంతమందికి ఖాతాల్లో నగదు జమకాకపోవడంతో నిరాశగా వెనుతిరిగారు.  బ్యాంకులో రద్దీ నెలకొంది.   

రాజవొమ్మంగి, న్యూస్‌టుడే: వేడిగాలులు తట్టుకుని వృద్ధులు పింఛను కోసం బ్యాంకు వద్దకు వెళ్లాల్సి వచ్చింది. వీరిలో కొంతమంది లబ్దిదారుల ఖాతాలు డెడ్‌ (నిలిచిపోవడంతో) వెనుదిరిగారు. వాటిని పునరుద్ధరిస్తున్నట్లు బ్యాంకు సిబ్బంది తెలిపారు. అసలు తమ   ఖాతాల్లో నగదు జమ అయిందో లేదో తెలియక కొందరు ఆందోళన వ్యక్తం చేశారు.

హుకుంపేట, ముంచంగిపుట్టు: హుకుంపేట మండలంలో వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బ్యాంకుల వద్ద పడిగాపులు కాశారు. కొంతమంది వెళ్లిపోయారు. ముంచంగి పుట్టు మండలం బాబుసాల, బూసీపుట్టు, కిలగాడ, లక్ష్మీపురం ప్రాంతాల నుంచి జీపులపై ప్రయాణం చేసి, వ్యయప్రయాసలకోర్చి వచ్చి పింఛన్లు తీసుకున్నారు. కొంతమంది బ్యాంకు ఖాతాలు మనుగడలో లేకపోవడం, ఆధార్‌ లింక్‌ కాక వృద్ధులు ఇబ్బందులకు గురయ్యారు.  

పింఛను డబ్బులు పడకపోవడంతో చింతపల్లిలో బ్యాంకు నుంచి వెనుదిరుగుతున్న వృద్ధులు

కొయ్యూరు, అనంతగిరి గ్రామీణం : మండలంలోని లబ్ధిదారులు పది కిలోమీటర్ల దూరంలోని బ్యాంకులకు వెళ్లడానికి నానాపాట్లు పడ్డారు. అనంతగిరి   మండలంలో చాలామందికి ఆధార్‌ అనుసంధానం కాకపోవడంతో ఇబ్బందులు పడ్డారు. కాశీపట్నంలో ఒక్క రోజే సుమారు రూ.25 లక్షల వరకు నగదు పంపిణీ చేశామని అధికారులు తెలిపారు.  

చింతపల్లి: బ్యాంకులు రద్దీగా మారడంతో ప్రైవేటు వ్యక్తులు ఆధార్‌కార్డు, ఏటీఎంల ద్వారా నగదు ఇస్తున్నారు. వీరు వెయ్యికి రూ.20 చొప్పున కమీషన్‌ తీసుకుని లబ్ధిదారులకు ఇస్తున్నారు. లోతుగెడ్డ పంచాయతీ చోడ్రాయికి చెందిన కొర్రాపాలు, వంతల పాలు, రామారావుకు బ్యాంకు ఖాతాలున్నా వారి ఖాతాల్లో పింఛను సొమ్ము జమ కాలేదు.


ఎవరిని అడగాలో..

పింఛను పొందేందుకు గురువారం చింతపల్లి గ్రామీణ వికాస్‌ బ్యాంకుకు వచ్చాను. బ్యాంకు ఖాతా మనుగడలో లేదని చెప్పడంతో దిక్కు తోచని పరిస్థితి ఏర్పడింది. ఎవరిని అడగాలో తెలియలేదు. ఏం చేయాలో నాకు తెలియదు. బ్యాంకు మెట్ల వద్దే పడిగాపులు కాయాల్సి వచ్చింది

పాంగి సీతమ్మ,చింతపల్లి మండలం కొమ్మంగి


డబ్బులు పడ్డాయో, లేదో తెలీదు

మాది ఎన్‌ఆర్‌పురం పంచాయతీ పరిధిలోని మారుమూల డెంజన్‌వలస గ్రామం. పింఛను డబ్బులు తీసుకునేందుకు కాశీపట్నం బ్యాంకుకు వచ్చాను. పింఛను సొమ్ము బ్యాంకు ఖాతాలో పడిందో లేదో తెలియదు. ఎక్కడికి వెళ్లాలో తెలియని పరిస్థితి.

జన్ని చిన్నమ్మ, డెంజన్‌వలస


రూ. 260 ఖర్చు..

మాది లోతేరు పంచాయతీ ముసిరిగుడ గ్రామం. ఈనెల పింఛన్‌ సొమ్ము తీసుకోవడం కోసం గ్రామం నుంచి అరకులోయకు రానుపోనూ రూ. 200 ఛార్జీ ఆటోకి చెల్లించాను. సుమారు 30 కిలోమీటర్ల దూరం నుంచి అరకులోయ వచ్చాను. బ్యాంకుకి వెళ్తే వందలాది మంది క్యూలో ఉన్నారు. ప్రైవేట్‌ ఆన్‌లైన్‌ కేంద్రం వద్ద రూ. 60 చెల్లించి పింఛన్‌ సొమ్ము తీసుకున్నాను.

గుబాయి బిమల, ముసిరిగుడ గ్రామం, అరకులోయ మండలం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని