logo

పథకాలను ప్రజలకు చేరువ చేస్తాం

‘ఐదేళ్ల వైకాపా పాలనలో గిరిజన చట్టాలు నిర్వీర్యమయ్యాయి. బతుకులు అతలాకుతలమయ్యాయి. గిరిజనులకు ప్రాణవాయువులాంటి జీవో నం.3ను అటకెక్కించారు. నిరుపేదలకు అందాల్సిన రాయితీ పథకాలను రద్దు చేశారు. పల్లెల్లో ప్రజలు తాగునీటి కోసం అల్లాడుతున్నారు.

Published : 03 May 2024 02:36 IST

గిరిజనులకు రక్షణగా ఉంటా
జీవో నెం 3 పునరుద్ధరిస్తాం
ముఖాముఖిలో పాడేరు కూటమి అభ్యర్థి ఈశ్వరి
పాడేరు/పట్టణం, న్యూస్‌టుడే

పాడేరు తెదేపా అభ్యర్థి గిడ్డి ఈశ్వరి

‘ఐదేళ్ల వైకాపా పాలనలో గిరిజన చట్టాలు నిర్వీర్యమయ్యాయి. బతుకులు అతలాకుతలమయ్యాయి. గిరిజనులకు ప్రాణవాయువులాంటి జీవో నం.3ను అటకెక్కించారు. నిరుపేదలకు అందాల్సిన రాయితీ పథకాలను రద్దు చేశారు. పల్లెల్లో ప్రజలు తాగునీటి కోసం అల్లాడుతున్నారు. ప్రత్యేక డీఎస్సీ కోసం నిరుద్యోగ యువత కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. ఎన్నికలకు ముందు మన్యం ప్రాంత ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు కదా గిరిజన చట్టాలను పరిరక్షించడంలో జగన్‌ సర్కార్‌ విఫలమైంది. ఉప ప్రణాళిక నిధులు దారి మళ్లించారు. ఉచిత విద్యుత్తు రాయితీని ఎత్తేశారు. జగన్‌ దిగజారుడు నిర్ణయాలతో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఐదేళ్లుగా సాగుతున్న ఈ అరాచక పాలనను అంతం చేయాలనే తెదేపా, జనసేన, భాజపా జతకట్టాయి. త్వరలో అధికారంలోకి రాబోతున్నాం. అన్నివర్గాలను ఆదుకుంటాం. నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామ’ని పాడేరు అసెంబ్లీ ఎన్డీఏ అభ్యర్థి గిడ్డి ఈశ్వరి పేర్కొన్నారు. గురువారం ‘న్యూస్‌టుడే’తో  ముఖాముఖిలో మాట్లాడారు.

మహిళా సాధికారతకు పెద్దపీట

తెదేపా ఆవిర్భావం నుంచి మహిళలకు అనేక రంగాల్లో ప్రాధాన్యత ఇస్తున్నాం. ఆస్తిలో సగం వాటాతోపాటు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత తెదేపాదే. డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేసింది మా ప్రభుత్వమే. గిరిజన మహిళలు స్వయం ఉపాధితో అభివృద్ధి చెందేలా చర్యలు చేపట్టాం. 2014కు ముందు వరకు పాడేరు నియోజకవర్గంలో రెండు వేల వరకూ మాత్రమే సంఘాలుండేవి. తెదేపా అధికారంలోకి వచ్చాక ఐదు వేల సంఘాలు అయ్యాయి. వడ్డీలేని రుణాలు అందిస్తూ సంఘాలను బలోపేతం చేశాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రతి విద్యార్థికి ఏడాదికి రూ.15 వేలు చెల్లిస్తాం. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచితంగా ప్రయాణం కల్పిస్తాం. 18 ఏళ్లు దాటిన ప్రతి మహిళకు నెలకు రూ.1500 ఇస్తాం. ఏడాదికి మూడు గ్యాస్‌ సిలెండర్లు ఉచితంగా అందిస్తాం.

అర్హలందరికీ సామాజిక పింఛన్లు

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 2019 ఎన్నికల ప్రచారంలో భాగంగా పాడేరులో పర్యటించినప్పుడు 50 ఏళ్లు నిండిన అర్హులందరికీ పింఛన్లు అందిస్తామని హామీ ఇచ్చారు. గెలిచాక మాట తప్పారు. ఐదు ఎకరాల భూమి ఉందని, విద్యుత్తు బిల్లు అధికంగా వస్తుందని, సదరం ధ్రువపత్రం లేదంటూ వివిధ కారణాలతో నియోజకవర్గంలో వేలాది మందికి పింఛన్లు నిలిపేశారు. దీంతో ఎంతోమంది నిరాశ చెందారు. తెదేపా అధికారంలో వచ్చిన వెంటనే ఎస్సీ, ఎస్టీ, బీసీల్లో 50 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికి నెలకు రూ.4 వేలు పింఛను అందిస్తాం.

ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తాం

రాష్ట్రంలో జగన్‌ పాలనలో పారిశ్రామీకీకరణ కుంటుపడింది. ముఖ్యంగా షెడ్యూల్డ్‌ ప్రాంతంలో ఐదేళ్ల కాలంలో ఒక్క కుటీర పరిశ్రమ కూడా రాలేదు. నిరుద్యోగ సమస్య తీవ్రంగా పెరిగింది. పాడేరు డివిజన్‌ 11 మండలాల పరిధిలో సుమారు 60 వేల మంది బీఈడీ, డీఈడీ, పాలిటెక్నిక్‌, ఐటీఐ, ఇంజినీరింగ్‌ వంటి కోర్సులు పూర్తి చేసిన వారు ఉన్నారు. ప్రత్యేక డీఎస్సీ లేకపోవడంతోపాటు నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు చేపట్టకపోవడంతో వారంతా గ్రామాల్లో ఉపాధి పనులకు వెళ్లాల్సి వస్తోంది. తెదేపా హయాంలో నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా 2019కు ముందు వరకూ ఐదు వేల మందికి స్వయం ఉపాధి అవకాశాలు కల్పించాం. వీటన్నింటినీ వైకాపా ప్రభుత్వం నీరుగార్చింది. మళ్లీ తెదేపా అధికారంలోకి వస్తే నిరుద్యోగులకు నెలకు రూ.3 వేలు నిరుద్యోగ భృతి కల్పిస్తాం. పరిశ్రమల స్థాపనకు కృషి చేస్తాం. ప్రత్యేక డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ ఖాళీలు భర్తీ చేయిస్తాం. గిరిజనులకు అండగా ఉంటాను. చట్టాలకు రక్షణ కల్పిస్తాం. జీవో నం.3ను పునరుద్ధరించి స్థానికులకే ఉద్యోగాలు కల్పించేలా చర్యలు తీసుకుంటాం.

ట్రైకార్‌ సేవలు పునరుద్ధరిస్తాం

నిరుపేద గిరిజన కుటుంబాలకు రాయితీ ద్వారా రుణాలందించి వారి అభివృద్ధికి తోడ్పడే ట్రైకార్‌ పథకాన్ని వైకాపా ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. ఈ ఐదేళ్ల కాలంలో ఒక్క గిరిజనుడికి రుణం అందించలేదు. 2014 నుంచి 2019 వరకు తెదేపా పాలనలో 20 వేల మందికి పైగా నిరుపేద గిరిజనులకు 100 శాతం రాయితీపై రుణాలిచ్చాం. మరో 700 మంది లబ్ధిదారులను ఎంపిక చేసి రుణాలిచ్చే సమయానికి ఎన్నికలు రావడంతో ఈ ప్రక్రియ నిలిచిపోయింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైకాపా ఆ లబ్ధిదారుల వివరాలే లేకుండా చేసింది. తెదేపా అధికారంలోకి వచ్చిన వెంటనే ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన్లకు పూర్వ వైభవం తెప్పిస్తాం. ట్రైకార్‌ ద్వారా రాయితీపై రుణాలు, యూనిట్లు అందిస్తాం. గిరిజనుల జీవన ప్రమాణాలు మెరుగుకు కృషి చేస్తాం.

ప్రతి ఇంటికీ తాగునీరు

తెదేపా హయాంలో ఎన్టీఆర్‌ సుజల పేరుతో శుద్ధి చేసిన నీటిని నామమాత్రపు ధరకే అందించాం. ప్రతి గ్రామంలో తాగునీటి పథకాలు నెలకొల్పాం. సౌర విద్యుత్తు పథకాలు 700 వరకూ ఏర్పాటు చేసి విద్యుత్తు సదుపాయం లేని గ్రామాలకు సూర్యరశ్మితో నీరు అందే ఏర్పాట్లు చేశారు. పాడేరు పట్టణంలో రెండు భారీ రక్షిత పథకాలు ఏర్పాటు చేసి వీధి కుళాయిలు అమర్చాం. చింతపల్లి, జి.మాడుగుల, కొయ్యూరు, గూడెంకొత్తవీధి మండల కేంద్రాల్లో రక్షిత పథకాలను ఏర్పాటు చేశాం. వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత ఉన్న వీధి కుళాయిలు పాడయ్యాయి. ప్రతి గ్రామంలో తాగునీటి కొరత నెలకొంది. తెదేపా అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లా కేంద్రంలో ఇంటింటికీ కుళాయి అందిస్తాం. నియోజకవర్గంలో ఎక్కడెక్కడ నీటి కొరత ఉందో అధ్యయనం చేసి ప్రతి ఇంటికి తాగునీరు అందేలా చర్యలు తీసుకుంటాం.

ఉచిత విద్యుత్తు అందిస్తాం

నిరుపేద గిరిజన కుటుంబాలకు ఉప ప్రణాళిక నిధుల ద్వారా ఉచితంగా విద్యుత్తు ఇవ్వాల్సి ఉంది. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వివిధ సాకులు చూపి ఈ పథకాన్ని ఎత్తేసింది. ఏడుసార్లు విద్యుత్తు ఛార్జీలను వైకాపా ప్రభుత్వం పెంచింది. 2014 నుంచి 2019 వరకు తెదేపా పాలనలో ఎటువంటి షరతులు లేకుండా తెల్లకార్డున్న 1.5 లక్షల గిరిజన కుటుంబాలకు రాయితీపై విద్యుత్తు అందించాం. తెదేపా అధికారంలోకి వస్తే అర్హులైన ప్రతి ఒక్క వినియోగదారుడికి ఉచిత విద్యుత్తు అందిస్తాం.

అర్హులందరికీ ఇళ్లు

తెదేపా హయాంలో పాడేరు నియోజకవర్గంలో ఇచ్చిన ఎన్టీఆర్‌ గృహాలకు ఈ ఐదేళ్లలో వైకాపా ప్రభుత్వం కక్షపూరితంగా ఒక్క రూపాయి బిల్లు చెల్లించలేదు. రూ.3 కోట్ల వరకు బకాయిలు ఉండిపోయాయి. ఎన్టీఆర్‌ గృహాల లబ్ధిదారులంతా ఇళ్లు పూర్తిగా నిర్మించుకునేందుకు డబ్బులు లేక, బయట తెచ్చిన అప్పులకు వడ్డీలు చెల్లించలేక ఆర్థిక ఇబ్బందుల్లో ఉండిపోయారు. జిల్లావ్యాప్తంగా వైఎస్సార్‌ లే అవుట్లంటూ హడావుడి చేశారు. కానీ నేటికీ సొమ్ములు చెల్లించకపోవడంతో ఒక్క ఇల్లు కూడా పూర్తికాని పరిస్థితి ఉంది. తెదేపా అధికారంలో వచ్చిన తర్వాత పాత బకాయిలు పూర్తిగా చెల్లిస్తాం. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు మంజూరు చేస్తాం.

వ్యవసాయానికి భరోసా

తెదేపా హయాంలో వాణిజ్య పంటలైన కాఫీ, మిరియాలు, పసుపు విస్తరణకు పెద్ద పీట వేశాం. ఉపాధి హామీ పథకం సహకారంతో కాఫీ సాగు విస్తరణకు కృషి చేశాం. వైకాపా ప్రభుత్వం ఈ సాగును పూర్తిగా నీరు గార్చింది. కాఫీ సాగుకు  ఉపాధి హామీతో సంబంధం లేకుండా చేశారు. దీని ద్వారా రైతుకు ఏటా రావాల్సిన రాయితీ నిలిచిపోయింది. తెదేపా అధికారంలోకి వచ్చాక అన్నదాతలు సంతోషంగా ఉండేలా చేస్తాం. రాయితీపై యంత్రాలు, ప్రోత్సాహక నిధులు అందిస్తాం. రైతుకు భరోసా కింద రూ.20 వేలు అందిస్తాం.

ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి

గత ఎన్నికల్లో ఉద్యోగ, ఉపాధ్యాయులు, పింఛన్‌దారులు జగన్‌ మోసపూరిత మాటలు నమ్మి ఓటు వేశారు. పాలన సక్రమంగా సాగడంలో ఉద్యోగుల పాత్ర ఎంతో కీలకం. సమస్యల పరిష్కారం కోసం ప్రశ్నించే ఉద్యోగుల గొంతు నొక్కే ప్రయత్నం వైకాపా ప్రభుత్వం చేసింది. ఏజెన్సీలో ఎన్నో ప్రతికూల పరిస్థితుల నడుమ పనిచేస్తున్న ఉద్యోగుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాను. నివాసగృహాల ఏర్పాటు, బకాయిలు చెల్లింపునకు కృషి చేస్తాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని