logo

ఊపిరితీసిన వాగులు

మన్యంలో పర్యటక ప్రాంతాలను చూద్దామని సరదాగా వచ్చిన వారికి తీరని విషాదం మిగిలింది. వేర్వేరు ఘటనల్లో ఇద్దరు చిన్నారులు సహా నలుగురు మృత్యువాత పడటం ఆయా కుటుంబాల వారిని శోకసంద్రంలో ముంచింది.

Published : 03 May 2024 02:18 IST

ఇద్దరు చిన్నారులు సహా నలుగురి దుర్మరణం

రాజ్‌కుమార్‌, అవినాష్‌ (పాతచిత్రాలు)

మన్యంలో పర్యటక ప్రాంతాలను చూద్దామని సరదాగా వచ్చిన వారికి తీరని విషాదం మిగిలింది. వేర్వేరు ఘటనల్లో ఇద్దరు చిన్నారులు సహా నలుగురు మృత్యువాత పడటం ఆయా కుటుంబాల వారిని శోకసంద్రంలో ముంచింది.

రంపచోడవరం, అడ్డతీగల, న్యూస్‌టుడే: అడ్డతీగల మండలం పైడిపుట్ట వద్ద పెద్దేరు వాగులో మునిగి ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. స్థానికుల కథనం ప్రకారం.. గురువారం విహారయాత్రలో భాగంగా ఏలేశ్వరం మండలం జె.అన్నవరం గ్రామానికి చెందిన సీహెచ్‌ హేమంత్‌(7), సీహెచ్‌. స్రవంతి (6) కుటుంబ సభ్యులతో కలిసి వాగు వద్దకు వచ్చారు. వారితో కలిసి కొద్దిసేపు వాగులో సరదాగా గడిపారు. అంతా ఒడ్డుకు చేరుకున్నారు. కొంతసేపటికి చిన్నారులు మళ్లీ వాగులోకి దిగారు. వారు కనిపించలేదని వెతుకుతుంటే వాగులో మునిగిపోతూ కనిపించారు.  వెంటనే కుటుంబ సభ్యులు వారిని ఒడ్డుకు చేర్చి అడ్డతీగల సీహెచ్‌సీకి తరలించారు. అప్పటికే చిన్నారులు మృతిచెందినట్లు సిబ్బంది తెలిపారు.

మరో ఘటనలో..: సీతపల్లి వాగులో ఇద్దరు యువకులు మృతిచెందారు. అప్పటివరకు తమతో సరదాగా గడిపిన స్నేహితులు ఇక లేరన్న నిజం తోటివారిని తీవ్రంగా కలచివేసింది. గురువారం చోటుచేసుకున్న ఈ ఉదంతంపై ఎస్సై మోహన్‌కుమార్‌ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. కాకినాడ జిల్లా సామర్లకోటకు కొందరు యువకులు గృహాలకు ఆల్‌టెక్‌, పెయింటింగ్‌ పనులు చేస్తుంటారు. ఒకే వృత్తిలో ఉన్న ఆరుగురు యువకులు సరదాగా మన్యంలోని పర్యటక ప్రాంతాలను వీక్షించేందుకు వచ్చారు. మండలంలోని ఐ.పోలవరం ఉద్యాన పార్కు వద్ద ఉన్న సీతపల్లి వాగు వద్దకు వచ్చిన వీరంతా స్నానానికి వాగులోకి దిగారు. వీరిలో వర్థనపు రాజ్‌కుమార్‌ (29), వాసా అవినాష్‌ (27) ఊబిలో చిక్కుకుని మునిగిపోయారు. స్నేహితులతోపాటు స్థానికులు సైతం వీరిని కాపాడే ప్రయత్నం చేశారు. కొంత సమయంపాటు గాలించిన స్థానికులు యువకుల మృతదేహాలను బయటకు తీశారు. పోలీసులు వచ్చి మృతదేహాలను ఏరియా ఆసుపత్రికి తరలించారు. వీరిద్దరికీ వివాహం కాలేదని కుటుంబసభ్యులు తెలిపారు. ఇదే వాగులో ఇటీవల కాలంలో 10మంది మృతి చెందారు.


అప్పులు తీర్చలేక యువకుడి ఆత్మహత్య

సతీష్‌ (పాత చిత్రం)

ఎటపాక, న్యూస్‌టుడే: అప్పులు తీర్చలేక, అప్పిచ్చిన వారి వేధింపులు తాళలేక ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని త్రిపురపెంటవీడు పంచాయతీ సీతాపురంలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. ఎస్సై కె.పార్థసారధి తెలిపిన వివరాల ప్రకారం... సీతాపురం గ్రామానికి చెందిన సిరిగం సతీష్‌ (31) తన కుటుంబ అవసరాల కోసం కొందరి దగ్గర సుమారు రూ. నాలుగు లక్షల వరకు అప్పులు చేశాడు. అప్పిచ్చిన వారు రోజూ తీర్చమని వేధిస్తుండటంతో బుధవారం సాయంత్రం పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించి అదే రోజు రాత్రి మృతిచెందాడని తెలిపారు. గురువారం కేసు నమోదుచేసి, పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అప్పగించామని, సతీష్‌ మృతికి కారకులైన ఇద్దరి వ్యక్తులపై కూడా కేసు నమోదు చేశామని ఎస్‌ఐ తెలిపారు. సతీష్‌కు భార్య, నాలుగేళ్ల వయసున్న పాప ఉన్నట్లు బంధువులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని